మరుగుదొడ్లు లేక పార్వతీపురం తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో మూత్ర విసర్జన
కొన్నాళ్ల క్రితం అధికారులంతా వేకువనే రోడ్డెక్కేవారు. ఎవరైనా చెంబుతో కనిపిస్తే చాలు చెలరేగిపోయేవారు. ఆరుబయట మల, మూత్ర విసర్జన చేసేవారిపై కన్నెర్ర చేసేవారు. మరోసారి కనిపించారో ఖబడ్దార్.. అని హెచ్చరించేవారు. మరుగుదొడ్లు నిర్మించుకోండని ఉపదేశించేవారు. స్వచ్ఛభారత్‌పై అలవోకగా ప్రసంగించేవారు. ఇప్పుడు ఫైళ్లన్నీ పక్కన పడేసి.. పనులన్నీ మానేసి ఊరూవాడా తిరుగుతున్నారు. మరుగుదొడ్ల లక్ష్యం పూర్తికి రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఊరందరికీ మరుగుదొడ్ల ఉపయోగాలు వివరించే అధికారుల కార్యాలయాల్లో దృశ్యం దారుణంగా ఉంటుంది.
ఎక్కడో తప్ప.. ఉన్నతాధికారుల కార్యాలయాల్లో సైతం మరుగుదొడ్లు లేవు. మిగిలిన సిబ్బంది సంగతి సరేసరి. ఏ చెట్టోపుట్టో చూసుకోవలసిందే. మహిళా ఉద్యోగుల పరిస్థితి పరమ దారుణం. అర్జీదారుల అవస్థలు వర్ణనాతీతం. జిల్లావ్యాప్తంగా మరుగుదొడ్డి సదుపాయం లేని అధికారుల కార్యాలయాలపై కథనాలివి.
బయటికెళ్లాల్సిందే
చీపురుపల్లి: చీపురుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్‌కు మాత్రమే మరుగుదొడ్డి ఉంది. మిగిలిన అధికారులు ఆరుబయటికి పోవలసిందే. చీపురుపల్లి గృహనిర్మాణ శాఖ కార్యాలయంలోను అదే పరిస్థితి నెలకొంది. చీపురుపల్లి రక్షిత మంచినీటి సరఫరా విభాగం డీఈ కార్యాలయానికి మరుగుదొడ్లు లేకపోతే వెనుకనున్న పురాతన మరుగుదొడ్లకు మరమ్మతులు చేసి అరకొరగా వినియోగిస్తున్నారు. చీపురుపల్లి మండల విద్యాశాఖ కార్యాలయంలో మరుగుదొడ్లు లేవు. ఉన్నవి పని చేయడం లేదు. గుర్ల మండల పరిషత్, గృహ నిర్మాణం, పీహెచ్‌సీ, విద్యాశాఖ కార్యాలయాల్లో మరుగుదొడ్లు లేవు. గరివిడి వ్యవసాయశాఖ, మెరకముడిదాం తహసీల్దార్ కార్యాలయాల్లో మరుగుదొడ్లు లేవు.
అత్యవసరమైతే నరకమే
పార్వతీపురం/సీతానగరం/బలిజిపేట: జిల్లా వ్యాప్తంగా ఓడీఎఫ్ మరుగుదొడ్లను నిర్మించాలని అన్ని శాఖాధికారులు ప్రజలపై ఒత్తిడి తెచ్చి మరుగుదొడ్లను కట్టిస్తున్నారు. ఫిబ్రవరి 15 నాటికి ఓడీఎఫ్ జిల్లాగా విజయనగరాన్ని చేయాలని కలెక్టర్ లక్ష్యం చేసుకున్నారు. కానీ వారు విధులు నిర్వర్తించే ప్రభుత్వ కార్యాలయాల్లో మరుగుదొడ్లను నిర్మించడం లేదు. పార్వతీపురం ఐటీడీఏ, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలకు నిత్యం అర్జీదారులు సమస్యల పరిష్కారం కోసం వస్తుంటారు.మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక నరక యాతన పడుతున్నారు.
♦ సీతానగరం వ్యవసాయ శాఖ కార్యాలయంలో మరుగుదొడ్డి లేకపోవడంతో అక్కడికి వచ్చే రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
♦ తహసీల్దార్ కార్యాలయంలో తడకలతో ఏర్పాటు చేసిన మరుగుదొడ్డే ఉద్యోగులకు శరణ్యం.
♦ అర్జీదారులు మాత్రం ఆరుబయటికి వెళ్లాల్సిందే.
♦ బలిజిపేట వ్యవసాయ శాఖ కార్యాలయంలో పూర్తిగా మరుగుదొడ్లు లేవు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. బలిజిపేట ఎమ్మార్సీ భవనంలో రెండు మరుగుదొడ్లు ఉన్నప్పటికీ అవి నిరంతర నీటి సదుపాయం లేక నిరుపయోగమయ్యాయి.
♦ ఇక్కడ కూడా ఉద్యోగులు ఆరుబయటికెళ్లాల్సిందే. మహిళ ఉద్యోగులు, అర్జీదారుల పరిస్థితి దారుణం.
♦ చాలా మంది ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చి కాలకృత్యాలు తీర్చుకొని తిరిగి కార్యాలయానికి వెళ్తున్న సందర్భాలున్నాయి.
అధికారుల అగచాట్లు
శృంగవరపుకోట/జామి: ఎస్.కోట గ్రామీణ నీటిసరఫరా శాఖ, ఉపఖజానాధికారి, ధర్మవరం పంచాయతీ కార్యాలయాలకు మరుగుదొడ్డి సౌకర్యం లేదు. జామి వ్యవసాయశాఖ, పశు వైద్య కేంద్రం, ఆర్‌డబ్ల్యూఎస్, 15 పంచాయతీ కార్యాలయాలకు మరుగుదొడ్లు లేవు. అత్యవసరమైతే ఎంతటి అధికారి అయినా బయటికి పోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది.
పాపం.. ఉద్యోగినులు
సాలూరు: సాలూరు నియోజకవర్గం మక్కువ మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో మరుగుదొడ్లను నిర్మించలేదు. అత్యధిక సంఖ్యలో మహిళలు విధులు నిర్వర్తించే కార్యాలయం ఇదే అయినా మరుగుదొడ్లను నిర్మించక అవస్థలు పడుతున్నారు. మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో పరిస్థితి మరోలా ఉంది. శిథిలమై కూలిపోయే స్థితికి చేరుకున్నా విధిలేక దాన్నే వినియోగిస్తున్నారు.
♦ మెంటాడ ఎమ్మార్సీ భవనంలో మరుగుదొడ్లకు నిరంతర నీటి సదుపాయం లేకపోవడంతో వినియోగించలేకపోతున్నారు. గృహనిర్మాణ, వ్యవసాయశాఖ కార్యాలయాల్లో మరుగుదొడ్ల నిర్మాణం జరగలేదు.
♦ పాచిపెంట ఎంపీడీఓ కార్యాలయంలో మరుగుదొడ్ల పైపులు విరగడంతో వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. ఎంఈఓ కార్యాలయంలో కూడా వినియోగించేందుకు వీల్లేక తాళాలు వేసేశారు. తహసీల్దార్ కార్యాలయంలో మరుగుదొడ్ల పరిస్థితి కూడా దాదాపు అదే. తలుపు విరిగిపోవడంతో ఆఖరికి కర్టెన్ కట్టుకున్నారు.
♦ సాలూరు మండలం స్త్రీశక్తి భవనంలో ఒక్క మరుగుదొడ్డి మాత్రమే ఉండటంతో అత్యవసర వేళ మహిళలు అవస్థలు పడుతున్నారు. గృహనిర్మాణశాఖ కార్యాలయంలో మరుగుదొడ్డిని నిర్మించినా నీటి సదుపాయం లేక వినియోగించుకోలేకపోతున్నారు.
వినియోగించకముందే శిథిలం
కురుపాం/గుమ్మలక్ష్మీపురం/కొమరాడ/జియ్యమ్మవలస/గరుగుబిల్లి: కురుపాం గ్రామీణ తాగునీటి విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్ ) కార్యాలయంలో మరుగుదొడ్లు లేవు. జాతీయ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ శాఖ, ఎంపీడీఓ కార్యాలయాల్లో మరుగుదొడ్లు వినియోగించకముందే శిథిలావస్థకు చేరుకున్నాయి. గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్, వ్యవసాయ శాఖ, పశు సంవర్థక శాఖ, ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, గృహనిర్మాణ శాఖ కార్యాలయాల్లో మరుగుదొడ్లు లేవు. కేవలం ఎంపీడీఓ కార్యాలయంలోని ఎంపీడీఓ, ఎంపీపీ చాంబర్లలో మరుగుదొడ్డి సదుపాయం ఉంది. దీంతో ఈ కార్యాలయంలో పనిచేసే సూపరింటెండెంట్, ఈఓపీఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శులకు ఇబ్బంది తప్పడం లేదు. కొమరాడ మండల పరిషత్ కార్యాలయంల్లో మరుగుదొడ్లు నిర్మించినా వినియోగించడం లేదు. తహసీల్దార్, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో మరుగుదొడ్లు లేవు.
పనికిరాని మరుగుదొడ్లు
జియ్యమ్మవలస తహసీల్దార్ కార్యాలయంలో మరుగుదొడ్లున్నా వినియోగానికి పనికిరావు. ఉన్న రెండు మరుగుదొడ్లలో ఒకటి శిథిలావస్ధకు చేరుకోగా రెండోది నీటి సదుపాయం లేక మూలకు చేరింది. ఎంపీడీఓ కార్యాలయంలో ఇటీవల నిర్మించిన మరుగుదొడ్డి కూడా పనిచేయక అధికారులకు అవస్థలు తప్పడం లేదు
నీటి సదుపాయం లేదు
గరుగుబిల్లి తహసీల్దార్, ఎంపీడీఓ, గృహ, ఎంఆర్‌సీ, వ్యవసాయం, విద్యుత్ సబ్‌స్టేషన్లు తదితర కార్యాలయాల్లో ఎక్కడా మరుగుదొడ్ల సౌకర్యం లేదు. మండల పరిషత్‌లో గతంలో మరుగుదొడ్లు నిర్మించినా నీటి సదుపాయం లేకపోవడంతో నిరుపయోగమై మరమ్మతులకు గురయ్యాయి. దీంతో సిబ్బంది, సందర్శకులకు అవస్థలు తప్పడం లేదు.
నీళ్లు లేక నిరుపయోగం
నెల్లిమర్ల: నెల్లిమర్ల ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయాలకు గతంలో నిర్మించిన మరుగుదొడ్లు శిథిలం కావడం, నీటిసరఫరా లేకపోవడంతో నిరుపయోగమయ్యాయి. తహసీల్దార్, విద్య, వ్యవసాయం, నీటిపారుదల, కార్యాలయాలకు అసలు మరుగుదొడ్లే నిర్మించలేదు. దీంతో ఈ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు, సందర్శకులూ నానాపాట్లు పడుతున్నారు. డెంకాడ గృహ నిర్మాణ శాఖ కార్యాలయానికి కూడా మరుగుదొడ్లు నిర్మించనే లేదు. మిగిలిన కార్యాలయాల్లో అధికారులు, సిబ్బందికి మరుగుదొడ్లున్నా సందర్శకులకు అందుబాటులో లేవు. భోగాపురం మండల గృహ నిర్మాణ శాఖ, గూడెపువలస పంచాయతీ కార్యాలయాలకు మరుగుదొడ్లను నిర్మించలేదు. దీంతో ఈ రెండు కార్యాలయాల సిబ్బంది ఇక్కట్లు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment