నీళ్లిచ్చే దిక్కేది..?! | No Use With Water Camps in Chittoor | Sakshi
Sakshi News home page

నీళ్లిచ్చే దిక్కేది..?!

Published Tue, May 14 2019 11:44 AM | Last Updated on Tue, May 14 2019 11:44 AM

No Use With Water Camps in Chittoor - Sakshi

చిత్తూరు నగరంలో కార్పొరేషన్‌ అధికారులు ఏర్పాటు చేసిన చలివేంద్రం

41.26, 43.00, 44.56 ఇవి కొలతలు కావు. జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం 8 గంటల నుంచే సెగలు పుట్టిస్తున్నాడు. మధ్యాహ్నమైతే బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. రోడ్లపై ప్రయాణికులు, పాదచారులు, కూలీలు అల్లాడిపోతున్నారు. గొంతు తడుపుకుందామని చలివేంద్రాలకు వెళితే కొన్నిచోట్ల బోర్డులు ఉంటున్నాయే కానీ కనిపించడం లేదు. మరికొన్ని చోట్ల కుండలు కనిపిస్తున్నా అందులో నీళ్లు ఉండటం లేదు.

చిత్తూరు అర్బన్‌: వేసవిలో ప్రజల దాహం తీర్చడంలో జిల్లాలోని పలువురు అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. జిల్లా మొత్తం చలివేంద్రాలు పెట్టాలని కలెక్టర్‌ పీఎస్‌.ప్రద్యుమ్న ఆదేశించినా పాటించడంలో అలసత్వం చూపుతున్నారు. జిల్లా వ్యా ప్తంగా 1,372 పంచాయతీలు, ఆరు మున్సి పాలిటీలు, రెండు కార్పొరేషన్లు ఉన్నాయి. రెండు కార్పొరేషన్లతో పాటు మూడు మున్సిపాలిటీలతో కలిపి దాదాపు 600 ప్రాంతాల్లో మాత్రమే చలివేంద్రాలు ఏర్పా టు చేశారు. వాస్తవానికి జిల్లాలో 5 వేల చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రతి చలివేంద్రం వద్ద చలువ పందిళ్లు వేసి, శుద్ధి నీటిని అందుబాటులో ఉంచాలి. కానీ కొందరు అధికారులు పుస్తకాల్లో వీటిని బా గా రాసుకుంటూ ప్రతినెలా రూ.లక్షల్లో బిల్లులు చేసుకుని వారి జేబుల్లో వేసుకుం టున్నారనే విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో చూస్తే ఒకటి, రెండుచోట్ల మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో నామమాత్రంగా రెండు రోజులు ట్యాంకు నీళ్లు అందుబాటులో ఉంచి చేతులు దులుపుకున్నారు.

బిల్లులు రాలేదని
చలివేంద్రాల ఏర్పాటుపై అనాసక్తి చూపడానికి అధికారులు బలమైన వాదన వినిపిస్తున్నారు. గతంలో వేసవి ఉపశమన కోసం ఖర్చుచేసిన నిధులే ఇంకా జమ కాలేదని ఇలాంటి సమయంలో చలివేంద్రాల ఏర్పాటుకు నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నిస్తున్నారు. పైగా ఈసారి చలివేంద్రాల ఏర్పాటుకు ప్రత్యేకంగా బడ్జె ట్‌ కేటాయించకపోవడంతో తామేమీ చేయలేమని ఖరాకండిగా చెబుతున్నారు. మున్సి పాలిటీల్లో మాత్రం కొందరు కమిషనర్లు సొంతంగా చొరవ తీసుకుని చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు తాగునీరు అందుబాటులో పెడుతున్నారు. దీంతో ఈ ఏడాది చలివేంద్రాల నిర్వహణ కంటితుడుపుగానే జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రజలు దాహం తీర్చుకోవడానికి వాటర్‌ ప్యాకెట్లు, మరికొన్ని చోట్ల దాతలు ఏర్పాటు చేసిన చలివేంద్రాల వైపు వెళుతున్నారు.

ఆరోగ్య శాఖ అంతంతే
వడదెబ్బ తగలకుండా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. ఉన్నతాధికారులు చాం బర్ల నుంచి కదలకుండా పోగ్రాం అధికారులను పిలిపించుకోవడం.. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి చేతులు దులుపుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో ప్రజల కు అందుతున్న సౌకర్యాలు, వైద్యాధికారులు తీసుకుంటున్న చర్యలను పట్టించుకున్న పాపానపోలేదు. చలివేంద్రాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచి బస్టాపుల్లో ప్రయాణికులకు పంపిణీ చేయాలి. జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించదు. కేవలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రం ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.

మజ్జిగ కనిపించదు
జిల్లాలో రెండేళ్ల క్రితం వరకు వేసవిలో చాలాచోట్ల చలివేంద్రాల వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. ఇందుకు కలెక్టర్‌ ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో ఇది సాధ్యమయ్యింది. రోజూ ప్రతి చలివేంద్రం వద్ద పది లీటర్ల పెరుగును ఉపయోగించి 150 మందికి మజ్జిగ అందేలా చర్యలు తీసుకున్నారు. కానీ ఈసారి ఎండాకాలం ముగిసిపోతున్నా మజ్జిగ ఊసే కనిపించలేదు. మరోవైపు చాలా చలివేంద్రాల్లోని కుండల్లో నీళ్లు నింపడంలేదు. కొన్నిచోట్ల మధ్యాహ్నానికే అయిపోతున్నాయి. అయినా సరే పట్టించుకునే దిక్కులేకుండా పోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement