చీరాల : కృష్ణా డెల్టా పరిధిలో ఈ ఏడాది ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఒకవైపు పొలాలు బీళ్లను తలపిస్తుండగా.. డెల్టా కాలువ పరిధిలోని కారంచేడు, పర్చూరు మండలాల్లోని తాగునీటి చెరువులు ఎండి నోళ్లు తెరుచుకున్నాయి. దీంతో ఊళ్లకు ఊళ్లే అలమటిస్తున్నాయి. అతివృష్టి, అనావృష్టిలతో ఏటా డెల్టా రైతులు నిండా మునిగిపోతున్నారు. ఈ ఏడాదైనా ఏరువాక సవ్యంగా సాగి అప్పుల బాధల నుంచి గట్టెక్కుతామని ఆశించిన రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేంద్ర జలసంఘం మంగళవారం తీసుకున్న నిర్ణయం ప్రకా రం నీరు వస్తే కనీసం తాగునీటి సమస్య కొంతైనా తీరుతుంది.
వివరాల్లోకెళ్తే...
వరుణుడు కరుణించకపోవడం, రెండు నెలలుగా ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం నిలిచిపోవడంతో తెలుగు రాష్ట్రాలకు వరదాయిని అయిన నాగార్జునసాగర్‌లో నీటి మట్టం అడుగంటింది. ఎగువ ప్రాంతం నుంచి తుంగభద్ర, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి ప్రవాహం నిలిచిపోవడంతో సాగర్‌లో నీటి సామర్థ్యం రోజురోజుకూ గణనీయంగా తగ్గింది. నాలుగు నెలల తర్జనభర్జనల అనంతరం కేంద్ర జలసంఘం జోక్యంతో కృష్ణా డెల్టాకు 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని మధ్యంతర కమిటీ జూన్ 11న తీర్మానించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరకు 3.6 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని నిర్ణయించింది.
ఆ మేరకు కృష్ణా, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసినప్పటికీ జిల్లాలోని కొమ్మమూరు కాలువకు నీటి బొట్టు కూడా రాలేదు.మూడు రోజుల్లో నీళ్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు.
నాగార్జునసాగర్‌కు నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా డెడ్ స్టోరేజి 510 అడుగులు. ప్రస్తుతం 517 అడుగులకు పడిపోయింది. 517 అడుగుల నీటి సామర్థ్యం ఉంటేనే సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలనే నిబంధన ఉంది. దీనిని బట్టి కృష్ణా డెల్టా పరిధిలో ఆఖరున ఉన్న కొమ్మమూరు కాలువకు తాగు, సాగునీటి సమస్య పొంచి ఉంది.
కొమ్మమూరు కాలువ కింద లక్ష ఎకరాలు సాగు అవుతుంది. వందలాది మంచినీటి చెరువులు ఉన్నాయి. రుతుపవనాలు ప్రారంభమైనా వానల జాడేలేదు. ఎగువ ప్రాంతా ల్లో విస్తారంగా వర్షాలు కురిసి నాగార్జునసాగర్‌కు నీరు వస్తేనే డెల్టా పరిధిలోని కొమ్మమూరు కాలువ ఆయకట్టు సాగవుతుంది. దాంతోపాటు తాగునీటి చెరువులూ నిండుతాయి. లేకుంటే పరిస్థితి అత్యంత దుర్భిక్షంగా ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాద ఘంటికలు
Published Wed, Jul 2 2014 5:54 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement
Advertisement