నర్సాపూర్, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనందున ఇక రాష్ర్ట ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని మహిళ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆమె నర్సాపూర్‌లోని అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంటుకు తెలంగాణ బిల్లు రాకుండా అడ్డుకుంటానని సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి ఏపీఎన్జీలకు హామీ ఇచ్చినట్లు వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయలు చెప్పిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ సీడబ్యుసీలో తీర్మానం చేసిందన్నారు. తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి సమాధి కట్టడం సరికాదని ఆమె పేర్కొన్నారు. నిరసనలు వ్యక్తం చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, అలా కాకుండా జీవించి ఉన్న వ్యక్తులకు సమాధి కట్టి నిరసన వ్యక్తం చేయడం విచారకరమన్నారు.
నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులకు రూ.46 కోట్ల 46 లక్షల 59 వేలు మంజూరు చేయించినట్లు చెప్పారు. నర్సాపూర్‌లో పీజీ కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ. 31 కోట్లను మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం నర్సాపూర్‌లో ఉన్న ఆసుపత్రి స్థాయిని 100పడకల స్థాయికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఇందుకు రూ. 11కోట్ల 25లక్షలు మంజూరైనట్లు మంత్రి వివరించారు. కౌడిపల్లి మండలం సదాశివపల్ల గ్రామంలోని రోడ్డు నిర్మాణానికి రూ. 40 లక్షలు , హత్నూర మండలం మధిర గ్రామంలోని రహదారికి రూ.27లక్షల 59 వేలు, శివ్వంపేట మండలం తిమ్మాపూర్ రోడ్డుకు రూ.కోటి ఐదులక్షలు, సికింద్లాపూర్ నుంచి కూచారం రహదారికి రూ. 63లక్షలు, వెల్దుర్తి మండలం ఎదుల్లపల్లి, ఉప్పులింగాపూర్ రహదారికి రూ.75 లక్షలు, కొల్చారం మండలం సీతారాంతండా రొడ్డుకు రూ.70లక్షలు మంజూరైనట్లు మంత్రి వివరించారు.
అలాగే నర్సాపూర్‌లో శిథిలావస్థలో ఉన్న రెండు ప్రభుత్వ క్వార్టర్లను పునర్నించేందుకు రూ. 31లక్షలు, కొల్చారంలో మండల పరిషత్ కార్యాలయ భవన నిర్మాణానికి గాను రూ 80 లక్షలు మంజూరు చేయించినట్లు మంత్రి తెలిపారు. అలాగే నర్సాపూర్‌లో ఆర్టీసీ బస్ డిపో నిర్మించేందుకు సంబంధిత శాఖా మంత్రితో చర్చించామన్నారు. త్వరలో డిపో నిర్మాణ పనులు ప్రారంభం కాగలవని ఆమె ఆశా భావం వ్యక్తం చేశారు. కాగా వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని ఆమె సంబంధిత అధికారులకు సూచించారు. విలేకరుల సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరు
Published Sun, Oct 20 2013 12:38 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement