సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకార పర్వం ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచే అంటే సోమవారం నుంచే నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. కాగా, నామినేషన్లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు. సెలవు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదని ఈసీ స్పష్టం చేసింది. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 28. పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీన జరుగుతుంది. నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులు ఆ పత్రాలను జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అన్ని వివరాల్ని నామినేషన్ పత్రంలో పేర్కొనాలి. అలాగే ఎన్నికల అఫిడవిట్ కూడా చాలా కీలకం కానుంది. ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్థులపై గల అన్ని రకాల కేసులతోపాటు ఆస్తుల వివరాలను పేర్కొనాలి. ఇందులో ఎటువంటి పొరపాట్లు దొర్లినా నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి.
ఎన్నికల వ్యయం లెక్కింపు ప్రారంభం..
నామినేషన్ల దాఖలు తేదీ నుంచే అభ్యర్థుల ఎన్నికల వ్యయం లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇందుకుగాను అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంది. ఆ బ్యాంకు ఖాతా నుంచే విరాళాల స్వీకరణ, ఎన్నికల వ్యయం చేయాల్సి ఉంటుంది. రూ.పదివేలలోపు మాత్రమే నగదు స్వీకరణ, నగదు వ్యయాన్ని అనుమతిస్తారు. రూ.పదివేలు దాటి విరాళాల స్వీకరణ చెక్కుల రూపంలో లేదా ఆన్‌లైన్‌లోనే చేయాలి. అలాగే రూ.పదివేలకుపైబడి ఎన్నికల వ్యయం చేయాలంటే చెక్కు రూపంలో లేదా ఆన్‌లైన్‌లోనే చేయాలి. అభ్యర్థుల విరాళాల స్వీకరణ, ఎన్నికల వ్యయానికి సంబంధించి ప్రతీ అభ్యర్థి తెలుపు, గులాబీ, పసుపు పేపర్లతో కూడిన మూడు రిజిస్టర్లను నిర్వహించాలి. వీటిని ఎన్నికల వ్యయ పరిశీలకులు తనిఖీలు చేస్తూ ఉంటారు.
ఎన్నికల నిర్వహణకు 3 లక్షలమంది సిబ్బంది..
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకోసం మొత్తం 45,920 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అలాగే ఎన్నికల నిర్వహణకు మూడు లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తోంది. అదే సమయంలో భద్రతా చర్యలకోసం 350 ప్లటూన్ల కేంద్ర సాయుధ బలగాలను మోహరించనుంది. ఇదిలా ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన రోజు నాటికి రాష్ట్రంలో 3.82 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఓటర్ల సంఖ్య ఇంకా పెరగనుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు కొత్తగా ఓటర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించారు. వీరిలో అర్హులందరినీ ఈ నెల 26వ తేదీలోగా ఓటర్ల జాబితాలోకి తీసుకొస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
మంచి ముహూర్తాల కోసం అన్వేషణ..
ఇదిలా ఉండగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బరిలోకి దిగుతున్న ఆయా పార్టీల అభ్యర్థులు మంచి ముహూర్తాల కోసం అన్వేషిస్తున్నారు. సోమవారం 18వ తేదీ ద్వాదశి, 22వ తేదీ విదియ, 23వ తేదీ తదియ, 25వ తేదీ పంచమి మంచి రోజులుగా భావిస్తూ ఈ తేదీల్లో నామినేషన్లు వేయడానికి అత్యధికులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి: ద్వివేది
రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో పాటు రాయలసీమలో జరిగిన పలు సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీలు ప్రతిరోజు పంపుతున్న నివేదికలను ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. ఇకపై రాష్ట్రంలో ఎలాంటి చిన్న ఘటన కూడా జరగకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని, శాంతిభద్రతలపై రాజీపడొద్దంటూ రాష్ట్ర పోలీస్ శాఖను ఆదేశించినట్లు ద్వివేదీ తెలిపారు. ఇప్పటికే కేంద్రం నుండి 90 కంపెనీల పారామిలటరీ బలగాలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. సాధారణ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు.. రాజకీయ పార్టీలు చేసే ఖర్చులను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన 102 మంది వ్యయ పరిశీలకులు మార్చి 18 సోమవారం రాష్ట్రానికి వస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలంటూ ద్వివేది కోరారు.
18 నుంచి సీ–విజిల్ యాప్ అందుబాటులోకి..
ఇదిలా ఉంటే.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడానికి రూపొందించిన సీ–విజిల్ యాప్ సోమవారం నుంచి అందుబాటులోకి వస్తుందని అదనపు ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ సంఘటనలను ఫొటోలు, వీడియోలు తీసి ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అనుమతుల్లేని ప్రచారానికి సంబంధించి పోస్టర్ల తొలగింపు తదితర అంశాలను సంబంధిత వ్యక్తులకు తెలియజేయాలని, వారు స్పందించకపోతే ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో వాటిని తొలగించి అపరాధ రుసుమును వసూలు చేస్తామన్నారు. ఎటువంటి ఫిర్యాదు వచ్చినా పరిశీలన అనంతరమే చర్యలను తీసుకుంటామన్నారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోపే స్పందించి, క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాల్సి వుంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment