జిల్లాలో నామినేషన్ల జాతర నడుస్తోంది. ముహూర్తం కలిసి రావడంతో మంచిరోజని భావించి భారీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలో రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీలకు బుధవారం ఒక్కరోజే 1400 నామినేషన్లు దాఖలయ్యాయి. రామగుండంలో అత్యధికంగా 422 మంది నామినేషన్ వేశారు. రాష్ట్రంలోనే ఇది రికార్డుగా నిలవనుంది. కరీంనగరంలో 276 మంది నామినేషన్ సమర్పించారు.
- సాక్షి, కరీంనగర్
సాక్షి, కరీంనగర్: ఎన్నికల వేడి రాజుకుంది. ఓ పక్క మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం... మరో పక్క ప్రచారంతో జిల్లాలోని కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో కోలాహలం మొదలైంది. బుధవారం మంచి ముహూర్తం ఉండడం.. గురువారం కార్పొరేషన్ల పరిధిలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజు ఉండడంతో ఎక్కువ మంది అభ్యర్థులు బుధవారమే నామినేషన్లు సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా 1400 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు పోటాపోటీ ర్యాలీలు తీసి కోలాహలం మధ్య నామినేషన్లు వేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో 276 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి.. మున్సిపల్ మాజీ చైర్మన్ వావిలాల హన్మంతరెడ్డి 34 వ డివిజన్ నుంచి, పీసీసీ కార్యదర్శి సునీల్‌రావు 31వ డివిజన్ నుంచి నామినేషన్ వేశారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుగ్గిళ్ల జయశ్రీ 36వ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి 44వ, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆమ ఆనంద్ 32వ డివిజన్ నుంచి నామినేషన్ వేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి పల్లె లలిత 41వ డివిజన్, కాసారపు కిరణ్‌కుమార్ 11వ, ముహమ్మద్ సలీం 39వ డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. వీరి వెంట పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిథి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఉన్నారు.
ఎంఐఎం పార్టీ తర పున మాజీ డెప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ 7వ డివిజన్ నుంచి నామినేషన్ వేశారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా రికార్డుస్థాయిలో 422 నామినేషన్లు దాఖలయ్యా యి. మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం (టీఆర్‌ఎస్) 30వ డివిజన్ నుంచి, మున్సిపల్ మాజీ చైర్మన్ బడికెల రాజలింగం (కాంగ్రెస్) 12వ, అదే డివిజన్ నుంచి డాక్టర్ అనిల్‌కుమార్ టీఆర్‌ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. 11వ డివిజన్ నుంచి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తానిపర్తి గోపాల్‌రావు నామినేషన్ దాఖలు చేశారు.
మెట్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ తరపున 7వ వార్డు నుంచి మున్సిపల్ మాజీ చైర్మన్ యామ రాజయ్య , వన్నెల గంగారం 16వ, బీజేపీ నుంచి బత్తుల లక్ష్మణ్ 12వ వార్డు నుంచి నామినేషన్లు వేశారు. సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గుడ్ల మంజుల (కాంగ్రెస్) 31వ వార్డు నుంచి నామినేషన్ వేశారు. వేములవాడ నగర పంచాయతీ పరిధిలోని పెరుక శ్రీలతరవి వైఎస్సార్‌సీపీ తరఫున 19వ వార్డు నుంచి నామినేషన్ వేశారు.
హుస్నాబాద్ నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థి సుద్దాల చంద్రయ్య (టీఆర్‌ఎస్) 16వ వార్డు, 14వ వార్డు నుంచి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్కిరెడ్డి తిరుమల, 11వ వార్డు నుంచి బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కవ్వ వేణుగోపాల్‌రెడ్డి నామినేషన్ వేశారు. పెద్దపల్లి నగర పంచాయతీలోని 16వ వార్డు నుంచి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పు రాజు, 14వ వార్డు నుంచి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, చైర్మన్ అభ్యర్ధి పుట్ట మొండయ్య నామినేషన్ వేశారు.
నామినేషన్ల జాతర
Published Thu, Mar 13 2014 3:57 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement