'తెలంగాణ ఇవ్వకుంటే నక్సలిజం పెరుగుతుంది'
హైదరాబాద్ : ఇందిరాగాంధీ సమైక్యవాది అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై చర్చలో భాగంగా ఆయన సభలో మాట్లాడుతూ తెలంగాణ ఇవ్వకుంటే నక్సలిజం పెరుగుతుందని అన్నారు. గోల్డ్ మెడలిస్ట్లయిన తమ ప్రాంత విద్యార్థులు నక్సలిజం వైపు మళ్లటానికి సమైక్య రాష్ట్రమే కారణమని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉన్నందునే కేసీఆర్ వెనక ప్రజలు అండగా నిలిచారన్నారు. 371 డి ఆర్టికల్ రాష్ట్ర విభజనకు అడ్డుకాదన్నారు.
దేశానికి పట్టిన చీడే కాంగ్రెస్ పాలన అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఉన్నత పదవులన్నీ సీమాంధ్ర ప్రాంతానికే ఇచ్చారన్నారు. కేంద్ర మంత్రుల పదవుల విషయంలోనూ తెలంగాణవారికి అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నాలుగు ప్రధాన పదవులన్నీ సీమాంధ్ర ప్రాంతానికే ఇచ్చారని అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదట ఖమ్మంలోనే మొదలయిందన్నారు. తాము ఎన్నడూ జై ఆంధ్రా ఉద్యమాన్ని తప్పు పట్టలేదన్నారు.
తెలంగాణ ప్రజల కోసమే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని రేవంత్ రెడ్డి అన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ అభినవ అంబేడ్కర్ అని అభివర్ణించారు. ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడు కాదని... సమస్యలు ఉన్న ప్రాంతమంతా తనదే అనేవారన్నారు. 2008లోనే టీడీపీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని... తెలంగాణ ఇవ్వమంటే... సీమాంధ్రకు అన్యాయం చేయాలని చెప్పలేదన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే అన్ని పార్టీలు టీడీపీనీ లక్ష్యంగా చేసుకున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.