ఉద్యమం.. నిర్విరామం
Published Sun, Nov 10 2013 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
ఏలూరు, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర పరిరక్షణ ధ్యేయంగా చేపట్టిన ఉద్యమం జిల్లాలో నిర్విరామంగా సాగుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం 102వ రోజు నిరసనలు కొనసాగాయి. ఏలూరు జెడ్పీ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు. పాలకొల్లులో నాన్‌పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఛాంబర్స్ కామర్స్ కళాశాలకు చెందిన విద్యార్థులు 20 మంది దీక్షలో కూర్చున్నారు. వీరికి జేఏసీ నాయకులు ముచ్చెర్ల శ్రీరామ్, చీకట్ల వరహాలు సంఘీభావం తెలిపారు. తణుకులో మహిళా ఉద్యోగినులు ఎన్జీవో హోం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి దీక్ష చేపట్టారు. దువ్వలో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలో రైతుమిత్ర సంఘాల నాయకులు కూర్చున్నారు. వీరికి ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు సంఘీభావం తెలిపారు. భీమడోలులో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టి 101 రోజులైన సందర్భంగా విద్యార్థులు సేవ్ ఏపీ 101 ఆకృతిలో ఒదిగి నిరసన తెలిపారు. భీమవరం ప్రకాశం చౌక్‌లో దీక్షలు కొనసాగుతున్నాయి. ఆకివీడులో వర్తక సంఘాల నాయకులు దీక్షలో కూర్చున్నారు.
Advertisement