కర్నూలు (అగ్రికల్చర్) : వికలాంగుల సంక్షేమాన్ని ప్రభుత్వం దాదాపుగా విస్మరించింది. విభిన్న ప్రతిభావంతులైన వికలాంగులకు చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం వీరి అభ్యున్నతి పట్ల పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. వికలాంగులకు ట్రైసైకిల్స్, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు కనీస అవసరాలు. ప్రభుత్వం వీటిని కూడా ఇవ్వని పరిస్థితిలో ఉండటం వల్ల వికలాంగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అర్హులైనవారికి పింఛన్లు కరువు...
జిల్లాలో శారీరక, మానసిక, తదితర వికలాంగులు లక్షకుపైగా ఉన్నారు. ఇందులో పింఛన్లకు అర్హత కల్గిన వారు 50 వేల మంది వరకు ఉన్నారు. కానీ ప్రస్తుతం 35 వేల మందికి మాత్రమే పింఛన్లు వస్తున్నాయి. అర్హత ఉన్నా దాదాపు 15 వేల మందికి పింఛన్లు లేవు. వీరిలో 80 శాతం మంది సదరం క్యాంపులకు వెళ్లారు. 80 శాతంపైగా వికలత్వం ఉన్నట్లు నిర్ధారణ అయింది. కానీ పింఛన్ల మంజూరులో ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. 40 నుంచి 80 శాతం వైకల్యం ఉన్నవారికి రూ.1000, ఆపైన వైకల్యం ఉన్నవారికి రూ.1500 పింఛన్ ఇవ్వాల్సి ఉంది. కానీ తాజాగా ప్రభుత్వం దాదాపు 15 వేల మందిని పింఛన్లకు దూరం చేసింది.
ఆర్థిక పునరావాస పథకం అమలు ఏదీ..
పట్టణ ప్రాంతాల్లోని వికలాంగులు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే గరిష్టంగా రూ.లక్ష వరకు సబ్సిడీ ఇస్తారు. ఇందుకు అవసరమైన రుణాలు బ్యాంకులు ఇవ్వాలి. యూనిట్ కాస్ట్‌లో 50 శాతం సబ్సిడీని రూ.లక్షకు మించకుండా ఇస్తారు. ఈ ఏడాది ఇంతరకు ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. వృత్తి, విద్యా కోర్సులు, పోస్టుగ్రాడ్యుయేట్, ఇతర ఉన్నత చదువులు చదివే వికలాంగులకు 50 శాతం సబ్సిడీపై మూడు చక్రాల మోటర్ సైకిల్ ఇవ్వాల్సి ఉంది. దీనిపై వికలాంగులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ఉన్నత విద్య అభ్యసించే వికలాంగులకు పూర్తి సబ్సిడీతో ల్యాప్‌టాప్‌లు, ఐ-పాడ్‌లు ఇవ్వాల్సి ఉన్నా అధికారులు తూతూమంత్రంగానే అమలు చేస్తున్నారు.
వికలాంగుల గ్రూపులకు చేయూత ఏది..
డీఆర్‌డీఏ-వెలుగు ద్వారా వికలాంగులతో 2,070 పొదుపు గ్రూపులు ఏర్పాటు చేశారు. ఇందులో 15,716 మంది వికలాంగులు సభ్యులుగా ఉన్నారు. 2014-15లో ఈ వికలాంగుల సంఘాలకు రూ.1.58 కోట్లు రుణాలు ఇప్పించాల్సి ఉన్నా ఇంతవరకు కేవలం రూ.68 లక్షలు మాత్రమే రుణాలు ఇప్పించినట్లు తెలుస్తోంది. చేయూత ఇస్తే ఉన్నత శిఖరాలకు ఎదిగే వికలాంగులు ఎందరో ఉన్నా ప్రభుత్వం పట్టనట్లు వివరిస్తుండటం దారుణం.
2013-14 నుంచి వివాహ ప్రోత్సాహాలు లేవు...
వికలాంగులను సకలాంగులైనవారు వివాహం చేసుకుంటే ప్రోత్సాహకంగా రూ.50 వేలు ఇస్తుంది. 2011 జులై 22 నుంచి ఇది అమలులోకి వచ్చింది. 2012లో వచ్చిన దరఖాస్తులే ఇప్పటికీ పెండింగ్‌లో ఉండిపోయాయి. వివాహ ప్రోత్సాహకాల కోసం వచ్చిన దరఖాస్తులు 280 పెండింగ్‌లో ఉండిపోయాయి. 2012లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులకే ప్రోత్సాహకాలు ఇవ్వడం పెండింగ్‌లో ఉందంటే 2014లోని వారికి ఎప్పటికి చేయూత అందుతుందో ఊహించుకోవచ్చు.
కనీస అవసరాలు తీర్చని ప్రభుత్వం...
వికలాంగులకు కనీస అవసరాలు ట్రైసైకిళ్లు, వీల్‌చైర్‌లు, వినికిడి యంత్రాలు. ఇవి కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. 2014-15లో ఒక్కరికి కూడా కనీస అవసరాలను తీర్చిన జాడ లేదు. ట్రైసైకిళ్ల కోసం 600 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీల్‌చైర్ దరఖాస్తులు 90, వినికిడి యంత్రాల దరఖాస్తులు 120 పెండింగ్‌లో ఉన్నాయి.
వికలాంగుల హాస్టల్‌లో తిష్ట వేసిన సమస్యలు...
వికలాంగులకు 3వ తరగతి నుంచి పీజీ చదివే వారికి హాస్టల్ సదుపాయం ఉంది. వికలాంగులకు సి.క్యాంప్ సెంటర్‌లో వసతి గృహం ఉంది. ఇందులో సమస్యలు తిష్టవేశాయి. తాగు నీరు లేదు. ఇచ్చే భోజనంలో నాణ్యత లేదు. మరుగుదొడ్లు లేవు. మొత్తంగా సమస్యలు చుట్టుముట్టాయి.
100 మంది వరకు హాస్టల్‌లో ఉండి చదువుకునే అవకాశం ఉన్న 55 మంది మాత్రమే ఉన్నారు. సౌకర్యాలు లేకపోవడం భోజనం సరిగా ఉండకపోవడం వల్ల హాస్టల్‌లో ఉండేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా వికలాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
నేడు భారీ ర్యాలీ..
వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, డీఆర్‌డీఏ, సర్వశిక్ష అభియాన్, మెప్మా, డ్వామా సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు వికలాంగులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
చిత్తశుద్ధి ఏదీ?
Published Wed, Dec 3 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement
Advertisement