Physical assaults
-
‘మానవ రవాణా’.. ఆగేనా? అవయవాలు మాయం, బలవంతపు పెళ్లిళ్లు, భిక్షాటన
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : మావన అక్రమ రవాణా..భారత్‌తో పాటు యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఓ పెద్ద సమస్య. మహిళలు, యువతులు, పిల్లలే కాదు.. పురుషులు కూడా బాధితులుగా మారుతున్నారు. తమ వలలో చిక్కుతున్న వారిని మాఫియా ఇతర ప్రాంతాలకు తరలించడంతో పాటు అవసరమైతే, వీలైతే దేశాలను సైతం దాటించేస్తోంది. మహిళలు, యువతులను బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపుతోంది. లొంగని వారిపై భౌతిక దాడులు చేస్తోంది. పలు రకాలుగా హింసిస్తోంది. పురుషులు, పిల్లలకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ బానిసలుగా మార్చేస్తోంది. కూలీలుగా పని చేయించడం, వ్యభిచారం చేయించడం, ఈ రెండింటికీ వినియోగించడం లాంటి వాటికి ఈ మాఫియా తెగబడుతోంది. బలవంతపు పెళ్లిళ్లు చేయడంతో పాటు భిక్షాటన కూడా చేయిస్తోంది. బాధితుల అవయవాలు వారికి తెలియకుండా దొంగిలించడం వంటి దురాగతాలకు పాల్పడుతోంది. మోసాలు, ఆర్థిక అసమానతలు.. ఎక్కువగా.. చదువు, అవగాహన లేకపోవడం వల్ల మోసాలకు గురవుతున్నవారు, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవారు, ఉద్యోగాలు, ఉత్తమ జీవన ప్రమాణాల పేరిట మాఫియా ప్రలోభాలకు లొంగిపోతున్నవారు మానవ అక్రమ రవాణా బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక అసమానతలు దీనికి కారణమవుతున్నాయని ఐక్యరాజ్య సమితికి చెందిన మాదకద్రవ్యాలు, నేరాల సంబంధిత కార్యాలయం (యూఎన్ఓడీసీ) నివేదిక స్పష్టం చేసింది. 95 శాతం ప్రపంచ జనాభా ఉండే 141 దేశాల నుంచి సేకరించిన డేటా ప్రకారం యూఎన్ఓడీసీ ఈ నివేదిక రూపొందించింది. శిక్షల శాతం తగ్గుతోంది.. చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు దీనిపై ఎక్కువ దృష్టి పెట్టడం లేదని అందుకే అక్రమ రవాణా చేసే మాఫియాకు పడే శిక్షలు తగ్గుతున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. 2017 నుంచి ఈ శిక్షలు పడే శాతం తగ్గుతూ వచ్చిందని వెల్లడించింది. గత సంవత్సరంలో న్యాయస్థానాలు విధించే శిక్షలు ఏకంగా 27% తగ్గినట్లు పేర్కొంది. అంతర్జాతీయంగా 27% తగ్గుదల ఉంటే.. దక్షిణాసియాలో 56 శాతం, మధ్య అమెరికాలో 54 శాతం, దక్షిణ అమెరికాలో 46 శాతం తగ్గినట్లు పేర్కొంది. ఒక్కసారి చిక్కితే జీవితాలు నాశనమే ప్రపంచ జనాభాలో 95 శాతం ఉండే 141 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా యూఎన్ఓడీసీ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం చూస్తే...మానవ అక్రమ రవాణాలో ఇప్పటికీ మహిళలు, యువతుల శాతమే అధికంగా ఉంటోంది. మాఫియా చేతుల్లో ఎక్కువ హింసకు గురవుతున్నదీ వీరే కావడం గమనార్హం. అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో ఇది ఎక్కువగా ఉంది. భారతదేశంలోనూ మానవ అక్రమ రవాణా పెద్ద సంఖ్యలో జరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ముఠాలకు ఒక్కసారి చిక్కితే బయటపడడం అంత సులువు కాదు. తప్పించుకుని పోవడానికి వీల్లేకుండా భౌతిక, మానసిక హింసకు గురి చేస్తారు. ఇది తీవ్రమైన సమస్య అయినా భారత ప్రభుత్వం స్పందన ఆశించిన స్థాయిలో లేదన్న విమర్శలున్నాయి. 2021లో 6,533 కేసులు దేశంలో మానవ అక్రమ రవాణా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 2020తో పోలిస్తే 2021లో 27.7% పెరిగినట్లు ఎన్సీఆర్బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అక్రమ రవాణా ఆరోపణలతో మహిళలు 2020లో 1,714 ఫిర్యాదులు చేస్తే, 2021లో 2,189 నమోదయ్యాయని ఎన్సీఆర్బీ పేర్కొంది. పిల్లలు, పెద్దల అక్రమ రవాణాకు సంబంధించి 6,533 కేసులు నమోదు కాగా.. అందులో 18 సంవత్సరాల వయస్సులోపు వారు 2,877 కాగా, 3,656 మంది పెద్దవారు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కూలీలుగా 38.8 శాతం మానవ అక్రమ రవాణాలో బలవంతంగా కూలీలు మారేవారి సంఖ్య 38.8 శాతం ఉండగా, వ్యభిచారంలోకి 38.7 శాతం మంది నెట్టబడుతున్నారు. ఈ రెండింటికీ వినియోగించేలా 10.3 శాతం, బలవంతపు పెళ్లిళ్లు 0.9 శాతం, యాచకవృత్తిలోకి 0.7, దత్తత కోసం 0.3 శాతం, అవయవాల దొంగతనం 0.2 శాతం ఉన్నట్లు యూఎన్ఓడీసీ స్పష్టం చేస్తోంది. వాతావరణ మార్పులూ పరోక్షంగా దోహదం వాతావరణ మార్పులూ పరోక్షంగా మానవ అక్రమ రవాణాకు దోహదపడుతున్నట్టు యూఎన్ఓడీసీ తన నివేదికలో పేర్కొంది. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే భారీ వరదల్లో సర్వం కోల్పోయిన వారు, కరువు కాటకాల్లో చిక్కుకున్న వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే క్రమంలో ఈ ముఠాలకు చిక్కుతున్నారు. ప్రభుత్వాలు దీనిపై దృష్టి కేంద్రీకరించని కారణంగానే ఈ దందా కొనసాగుతున్నట్లు నివేదిక తేల్చింది. కోర్టుల్లోనూ ఈ మాఫియాకు పెద్దగా శిక్షలు పడుతున్న దాఖలాల్లేవని, పడుతున్న శిక్షలే తక్కువ అంటే.. 2020లో ఈ శిక్షల సంఖ్య ఏకంగా 27% తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. విద్య, మహిళా సాధికారతతో చెక్ విద్య, మహిళా సాధికారతతో మానవ అక్రమ రవాణకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. లింగ భేదం లేకుండా మహిళలు ఆర్థిక సాధికారత సాధించే విధంగా ప్రభుత్వ విధానాలు, కార్యాచరణ ఉంటే దీనికి అడ్డుకట్ట పడుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. చట్టాలను, న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, చట్టాలు అమలు చేసే యంత్రాంగానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని అంటున్నారు. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన పెంచాలని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు సైతం సంయుక్తంగా కృషి చేస్తేనే ఈ అమానవీయ పరిస్థితి నుంచి బయట పడడానికి వీలుంటుందని చెబుతున్నారు. -
శస్త్ర చికిత్సే, లేపనాలు సరిపోవు
జ్వరం రోగం కాదు. రోగ లక్షణమే! రోగమేదైనా, దాని సంకేతంగా జ్వరం వస్తుంది. జ్వరం తగ్గే మందు మాత్రమే ఇస్తే... రోగం నయం కాదు. రోగాన్ని గుర్తించాలి, చికిత్స చేయాలి, మళ్లీ రాకుండా చూడాలి. అలా జరుగకపోతే అది ప్రాణాంతకంగానూ మరొచ్చు! మహిళలపై అత్యాచారాలు, లైంగిక హింస విషయంలో ఇప్పుడు అనుసరిస్తున్న దోరణి అలాగే ఉంటోంది. సదరు దుర్మార్గాలను వేటికవే ఘటనలుగా చూస్తున్నాం. విడివిడిగా çపరిశీలిస్తున్నాం. పొడిపొడిగా స్పందిస్తున్నాం. ఒక నిందితుడు పోలీసు ‘ఎన్కౌంటర్’లో చనిపోతేనో, మరో నిందితుడిని రైల్వే ట్రాక్‌పై ‘ఆత్మహత్య’గా చూసో ‘తగిన శాస్తి జరిగిందిలే!’ అని సరిపెట్టుకుంటున్నాం. సమస్య మూలాలపై దృష్టి పెట్టట్లేదు. కారణాల్ని లోతుగా అన్వేషించట్లేదు. ఇంతటి జఠిల సమస్యకు దీర్ఘకాలిక, శాశ్వత పరిష్కారాల్ని కనుక్కోవడం లేదు. నిర్మాణాత్మక ప్రయత్నమే జరగట్లేదు. పౌరులుగా మనం సరే, దర్యాప్తు సంస్థలు, సమాజ శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, న్యాయపాలకులు.. అందరూ, అక్కడక్కడ ఒకటీ, అరా ‘దిశ’ చట్టం వంటి ప్రయత్నాలు తప్ప నిర్దిష్ట కార్యాచరణే లేదు. అందుకే, ఈ ఘాతుకాలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఇటీవల మహిళలు, బాలికలపై జరిగిన అత్యాచారాలు, లైంగిక దాడులు, హత్యోదంతాల తీరు తెన్నులు గగుర్పాటు కలిగిస్తున్నాయి. ఆయా నేరాలే ఘోరంగా ఉన్నాయంటే, అవి జరిగే తీరు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇవి వెలుగు చూస్తున్న కేసులే, ఇంకా రికార్డులకెక్కని దాష్టీకాలెన్నో రెట్లు! భయంగొలిపే వాతావరణం బలపడుతోంది. ప్రమాద సంకేతమేమంటే, అత్యాచారం జరిపి తీవ్రంగా గాయపరచడమో, హతమార్చడమో చేసిన సందర్భాలు అనివార్యంగా వెలుగు చూస్తు న్నాయి. అత్యాచారానికే పరిమితమైన ఘాతుకాల్లో, ఎవరైనా దైర్యం కూడగట్టుకొని పోలీసుస్టేషన్ గడప తొక్కిన చోట రికార్డుల్లోకి వస్తున్నాయి. అలా జరక్క, లోలోపల లొంగదీసుకునే, బెదిరించి అత్యాచారాలకు పాల్పడే, నిరవధికంగా–నిరాఘాటంగా లైంగిక హింసను కొనసాగిస్తుండే, నిత్య క్షోభకు గురిచేస్తుండే... వెలుగు చూడని ఉదంతాలెన్నో! ఎందరు వివాహిత మహిళలు, పెళ్లికాని యువతులు, బాలికలు ఆగని కన్నీటితోఅలాంటి మూగవేదనను అనుభవిస్తున్నారో? అదంతా లెక్కలకెక్కని అజ్ఞాత హింస! ఈ అమానుష హింసకి మూలాలెక్కడున్నాయి? పురుషాధిక్య సమాజంలో మ(మృ)గాడై పుట్టిన పసికందు పెంపకం నుంచి, అప్పుడే మొదలయ్యే లింగ వివక్ష నుంచి, వాడి నడతపై దృష్టి పెట్టని తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం నుంచి, అసహజ వాతావరణం– పరిసరాల వరకు అంతటా మూలాలున్నాయి. స్త్రీల పట్ల పురుషుల దృక్పథంలోనే పెద్ద లోపముంది. లోపభూయిష్ట విద్యా విధానంలో విలువలు కొరవడ్డ ‘చదువు’తో అలవడే కుసంస్కారం నుంచి, నిర్హేతుకమైన నిరుద్యోగిత నుంచి, తిని తిరగడం అలవడ్డ ఆంబోతుతనం వరకు అన్నీ యువతలో హింసా దృక్పథాన్ని పెంచి పోషించేవే! పేదరికం, ప్రేమరాహిత్యం, కుటుంబ కలహాలు, ఎప్పుడో ఒకటీ, రెండు చిన్న నేరాలు చేస్తే సరిదిద్దని నిర్లక్ష్యపు వ్యవస్థ... ఇవన్నీ దారితప్పిన యువ తలో లైంగిక నేర ప్రవృతిని పెంచేవే! ఉద్రేకాన్ని, ఉన్మాదాన్ని, లైంగిక హింసను ప్రేరేపించేలా బాధ్య తెరుగక తీసే సినిమా, ఓటీటీ–టీవీ సీరియళ్ల ‘విష(య)ం’ కూడా కారణమే! విచ్ఛల విడిగా దొరికే మద్యం, గంజాయి, ఇతర డ్రగ్స్ హింసాప్రవృత్తికి ప్రధాన వనరు! వీటికి తోడు.. మార్కెట్ ప్రపం చంలో దూసుకువచ్చిన స్మార్ట్‌ఫోన్ వ్యసనం, హద్దూ–అదుపూ లేని శృంగార సైట్ల (పోర్న్) ప్రభావం మగైనా, ఆడైనా... యువతను తప్పుదారి పట్టిస్తోంది. తెలిసి చేసే ఉద్దేశ్యపూర్వక దురాగతాలు కొందరివైతే, అవగాహన లేక, తెలియకుండా ఉచ్చులో పడేవారెందరో! పిల్లల పట్ల వాంఛతో రగిలే ఉన్మాదుల్ని (పీడోఫైల్) గుర్తించి, వారిని సరిదిద్దే వ్యవస్థే మనదగ్గర లేదు. ఉత్తరప్రదేశ్, హాత్రస్లో దళిత యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం జరిపి, రక్తమోడే స్థితిలో ఆమెను పొలాల్లో పారవైచిన దుర్మార్గానికి ఏడాది. చికిత్స పొందుతూ మరణిస్తే.... కుటుం బాన్ని అడ్డుకుంటూ అర్ధరాత్రి బలవంతపు అంత్యక్రియలు జరిపించిన పాలనా వ్యవస్థ మనది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ, రక్షక వలయం మధ్య భయంగా నేటికీ విచారణ హాజరవుతున్న తలిదండ్రులకు, ఇంకెన్నాళ్లో ఈ కన్నీటి వేధన తెలియదు. దాదాపు దేశవ్యాప్తంగా జరిగే ఈ దాష్టీకాలకు కుటుంబ నేపథ్యం, పెరిగిన క్రమం, సామాజిక పరిస్థితులు ఓ కారణమైతే వ్యవస్థాగత లోపాలు మరో బలమైన కారణం! ప్రభుత్వాల వైఖరి, దర్యాప్తు వ్యవస్థల నిర్వాకం, న్యాయస్థానాల్లో అసాధారణ జాప్యాలు వెరసి దురాలోచనాపరుల్లో భయంలేనితనాన్ని పెంచుతున్నాయి. చట్ట మంటేనో, తీర్పులంటేనో, చివరకు శిక్షలంటేనో భయంతో మాత్రమే ఈ నేరాల్ని నియంత్రించ గలుగుతాం. కానీ, అదే ఉండటం లేదు. ఇదంతా పరిగణనలోకి తీసుకొని ఏపీ ప్రభుత్వం తెచ్చిన ‘దిశ’ చట్టానికి కేంద్రమింకా అనుమతించలేదు. వారు లేవనెత్తిన సందేహాలకు ఏపీ సమాధానా లిచ్చినా, అనుమతి కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. ఈ లోపున ఆ చట్టపు స్పూర్తిని అమలుపరుస్తూ, దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం, కాలపరిమితితో నేరాల సత్వర దర్యాప్తు–విచారణ జరిపించడం ఆశావహ పరిణామం. వెంటనే అనుమతించి, కేంద్రమీ చట్టాన్ని దేశవ్యాప్తం చేయాలి. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, పౌరసమాజం ముగ్గురూ ఏకతాటిపైకి వచ్చి లైంగిక హింసను శాశ్వతంగా నిర్మూలించే పూనిక వహించాలి. అప్పుడే మహిళకు రక్ష! -
చిత్తశుద్ధి ఏదీ?
కర్నూలు (అగ్రికల్చర్) : వికలాంగుల సంక్షేమాన్ని ప్రభుత్వం దాదాపుగా విస్మరించింది. విభిన్న ప్రతిభావంతులైన వికలాంగులకు చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం వీరి అభ్యున్నతి పట్ల పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. వికలాంగులకు ట్రైసైకిల్స్, వీల్చైర్లు, వినికిడి యంత్రాలు కనీస అవసరాలు. ప్రభుత్వం వీటిని కూడా ఇవ్వని పరిస్థితిలో ఉండటం వల్ల వికలాంగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అర్హులైనవారికి పింఛన్లు కరువు... జిల్లాలో శారీరక, మానసిక, తదితర వికలాంగులు లక్షకుపైగా ఉన్నారు. ఇందులో పింఛన్లకు అర్హత కల్గిన వారు 50 వేల మంది వరకు ఉన్నారు. కానీ ప్రస్తుతం 35 వేల మందికి మాత్రమే పింఛన్లు వస్తున్నాయి. అర్హత ఉన్నా దాదాపు 15 వేల మందికి పింఛన్లు లేవు. వీరిలో 80 శాతం మంది సదరం క్యాంపులకు వెళ్లారు. 80 శాతంపైగా వికలత్వం ఉన్నట్లు నిర్ధారణ అయింది. కానీ పింఛన్ల మంజూరులో ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. 40 నుంచి 80 శాతం వైకల్యం ఉన్నవారికి రూ.1000, ఆపైన వైకల్యం ఉన్నవారికి రూ.1500 పింఛన్ ఇవ్వాల్సి ఉంది. కానీ తాజాగా ప్రభుత్వం దాదాపు 15 వేల మందిని పింఛన్లకు దూరం చేసింది. ఆర్థిక పునరావాస పథకం అమలు ఏదీ.. పట్టణ ప్రాంతాల్లోని వికలాంగులు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే గరిష్టంగా రూ.లక్ష వరకు సబ్సిడీ ఇస్తారు. ఇందుకు అవసరమైన రుణాలు బ్యాంకులు ఇవ్వాలి. యూనిట్ కాస్ట్లో 50 శాతం సబ్సిడీని రూ.లక్షకు మించకుండా ఇస్తారు. ఈ ఏడాది ఇంతరకు ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. వృత్తి, విద్యా కోర్సులు, పోస్టుగ్రాడ్యుయేట్, ఇతర ఉన్నత చదువులు చదివే వికలాంగులకు 50 శాతం సబ్సిడీపై మూడు చక్రాల మోటర్ సైకిల్ ఇవ్వాల్సి ఉంది. దీనిపై వికలాంగులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ఉన్నత విద్య అభ్యసించే వికలాంగులకు పూర్తి సబ్సిడీతో ల్యాప్‌టాప్‌లు, ఐ-పాడ్లు ఇవ్వాల్సి ఉన్నా అధికారులు తూతూమంత్రంగానే అమలు చేస్తున్నారు. వికలాంగుల గ్రూపులకు చేయూత ఏది.. డీఆర్డీఏ-వెలుగు ద్వారా వికలాంగులతో 2,070 పొదుపు గ్రూపులు ఏర్పాటు చేశారు. ఇందులో 15,716 మంది వికలాంగులు సభ్యులుగా ఉన్నారు. 2014-15లో ఈ వికలాంగుల సంఘాలకు రూ.1.58 కోట్లు రుణాలు ఇప్పించాల్సి ఉన్నా ఇంతవరకు కేవలం రూ.68 లక్షలు మాత్రమే రుణాలు ఇప్పించినట్లు తెలుస్తోంది. చేయూత ఇస్తే ఉన్నత శిఖరాలకు ఎదిగే వికలాంగులు ఎందరో ఉన్నా ప్రభుత్వం పట్టనట్లు వివరిస్తుండటం దారుణం. 2013-14 నుంచి వివాహ ప్రోత్సాహాలు లేవు... వికలాంగులను సకలాంగులైనవారు వివాహం చేసుకుంటే ప్రోత్సాహకంగా రూ.50 వేలు ఇస్తుంది. 2011 జులై 22 నుంచి ఇది అమలులోకి వచ్చింది. 2012లో వచ్చిన దరఖాస్తులే ఇప్పటికీ పెండింగ్‌లో ఉండిపోయాయి. వివాహ ప్రోత్సాహకాల కోసం వచ్చిన దరఖాస్తులు 280 పెండింగ్‌లో ఉండిపోయాయి. 2012లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులకే ప్రోత్సాహకాలు ఇవ్వడం పెండింగ్‌లో ఉందంటే 2014లోని వారికి ఎప్పటికి చేయూత అందుతుందో ఊహించుకోవచ్చు. కనీస అవసరాలు తీర్చని ప్రభుత్వం... వికలాంగులకు కనీస అవసరాలు ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, వినికిడి యంత్రాలు. ఇవి కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. 2014-15లో ఒక్కరికి కూడా కనీస అవసరాలను తీర్చిన జాడ లేదు. ట్రైసైకిళ్ల కోసం 600 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీల్‌చైర్ దరఖాస్తులు 90, వినికిడి యంత్రాల దరఖాస్తులు 120 పెండింగ్‌లో ఉన్నాయి. వికలాంగుల హాస్టల్లో తిష్ట వేసిన సమస్యలు... వికలాంగులకు 3వ తరగతి నుంచి పీజీ చదివే వారికి హాస్టల్ సదుపాయం ఉంది. వికలాంగులకు సి.క్యాంప్ సెంటర్లో వసతి గృహం ఉంది. ఇందులో సమస్యలు తిష్టవేశాయి. తాగు నీరు లేదు. ఇచ్చే భోజనంలో నాణ్యత లేదు. మరుగుదొడ్లు లేవు. మొత్తంగా సమస్యలు చుట్టుముట్టాయి. 100 మంది వరకు హాస్టల్లో ఉండి చదువుకునే అవకాశం ఉన్న 55 మంది మాత్రమే ఉన్నారు. సౌకర్యాలు లేకపోవడం భోజనం సరిగా ఉండకపోవడం వల్ల హాస్టల్లో ఉండేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా వికలాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నేడు భారీ ర్యాలీ.. వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, డీఆర్డీఏ, సర్వశిక్ష అభియాన్, మెప్మా, డ్వామా సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు వికలాంగులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. -
బరితెగింపు
వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిపై టీడీపీ నేత దాడి - తమ్ముడిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ .. ఒట్టి చేతులతో వచ్చాడని కట్టెలతో దాడి - 24 గంటల్లో రూ.5 లక్షలు లేదా ఇల్లు రాసివ్వకపోతే భార్య, పిల్లలను చంపుతానని హెచ్చరిక - రక్షణ కల్పించాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఎస్పీకి వినతి అనంతపురం రూరల్ : వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిపై టీడీపీ నాయకుడు తన అనుచరులతో కలిసి దాడి చేసి గాయపరిచాడు. అంతటితో ఆగక 24 గంటల్లోగా రూ.5 లక్షలు ఇవ్వాలని లేదా ఇంటిని తన పేర రాసివ్వాలని హుకుం జారీ చేశాడు. గడువులోపు అడిగింది ఇవ్వకపోతే భార్య, పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు... కక్కలపల్లి కాలనీలో నివాసముంటున్న భవన నిర్మాణ కాంట్రాక్టర్ ఒంగోలు హనుమంతరావు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిగా ఉంటూ ఎన్నికల్లో చురుగ్గా ప్రచారం చేశాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో టీడీపీ నేత మనోహర్‌నాయుడు తన అనుచరులతో కలిసి అక్రమ వసూళ్లు.. వైఎస్సార్సీపీకి చెందిన వారిపై దాడులకు తెగబడ్డాడు. పోలీసుల దృష్టికి వెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో మనోహర్‌నాయుడు మరింత రెచ్చిపోయాడు. రెండు రోజుల క్రితం హనుమంతరావుకు ఫోన్ చేసి తనకు 24 గంటల్లో రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే నీ తమ్ముడు మారుతిని చంపుతామని బెదిరించాడు. తాను డబ్బు ఇచ్చుకోలేనని చెప్పడంతో ఆదివారం రాత్రి మారుతిని కిడ్నాప్ చేసి.. డబ్బు తీసుకుని పలానా చోటుకు రావాలంటూ ఫోన్లో చెప్పాడు. హనుమంతరావు ఒట్టి చేతులతో రావడంతో ఆగ్రహించిన మనోహర్‌నాయుడు అనుచరులతో కలిసి కట్టెలతో చితకబాదాడు. మరో 24 గంటలు సమయం ఇస్తున్నానని, ఈసారి డబ్బు లేదా ఇటీవల నిర్మించిన కొత్త ఇంటిని తన పేరిట రాసివ్వాలని.. ఈసారి మొండిచేయి చూపితే భార్య, పిల్లలను చంపుతామని హెచ్చరించాడు. తీవ్రంగా గాయపడిన హనుమంతరావును తమ్ముడు మారుతి అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్చాడు. చికిత్స పొందుతున్న బాధితుడిని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ధనుంజయయాదవ్ పరామర్శించారు. భౌతికదాడులు, అక్రమ అరెస్టులు నిరోధించండి అనంతపురం జిల్లా పరిషత్ : వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ నేతల నుంచి భౌతికదాడులు, పోలీసుల నుంచి అక్రమ అరెస్టులు నిరోధించాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ ఎస్పీ సెంథిల్‌కుమార్‌ని కోరారు. ఈ మేరకు సోమవారం ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. కక్కలపల్లి కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనను కూడా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను కట్టడి చేసి.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో పార్టీ అధికార ప్రతినిధి సీపీ వీరన్న, రూరల్ మండలం కన్వీనర్ ధనుంజయయాదవ్తో పాటు మరికొందరు బాధితులు ఉన్నారు.