బరితెగింపు
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడిపై టీడీపీ నేత దాడి
- తమ్ముడిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ .. ఒట్టి చేతులతో వచ్చాడని కట్టెలతో దాడి
- 24 గంటల్లో రూ.5 లక్షలు లేదా ఇల్లు రాసివ్వకపోతే భార్య, పిల్లలను చంపుతానని హెచ్చరిక
- రక్షణ కల్పించాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఎస్పీకి వినతి
అనంతపురం రూరల్ : వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడిపై టీడీపీ నాయకుడు తన అనుచరులతో కలిసి దాడి చేసి గాయపరిచాడు. అంతటితో ఆగక 24 గంటల్లోగా రూ.5 లక్షలు ఇవ్వాలని లేదా ఇంటిని తన పేర రాసివ్వాలని హుకుం జారీ చేశాడు. గడువులోపు అడిగింది ఇవ్వకపోతే భార్య, పిల్లలను చంపేస్తానని బెదిరించాడు.
అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు... కక్కలపల్లి కాలనీలో నివాసముంటున్న భవన నిర్మాణ కాంట్రాక్టర్ ఒంగోలు హనుమంతరావు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడిగా ఉంటూ ఎన్నికల్లో చురుగ్గా ప్రచారం చేశాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో టీడీపీ నేత మనోహర్‌నాయుడు తన అనుచరులతో కలిసి అక్రమ వసూళ్లు.. వైఎస్సార్‌సీపీకి చెందిన వారిపై దాడులకు తెగబడ్డాడు. పోలీసుల దృష్టికి వెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో మనోహర్‌నాయుడు మరింత రెచ్చిపోయాడు. రెండు రోజుల క్రితం హనుమంతరావుకు ఫోన్ చేసి తనకు 24 గంటల్లో రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే నీ తమ్ముడు మారుతిని చంపుతామని బెదిరించాడు. తాను డబ్బు ఇచ్చుకోలేనని చెప్పడంతో ఆదివారం రాత్రి మారుతిని కిడ్నాప్ చేసి.. డబ్బు తీసుకుని పలానా చోటుకు రావాలంటూ ఫోన్‌లో చెప్పాడు.
హనుమంతరావు ఒట్టి చేతులతో రావడంతో ఆగ్రహించిన మనోహర్‌నాయుడు అనుచరులతో కలిసి కట్టెలతో చితకబాదాడు. మరో 24 గంటలు సమయం ఇస్తున్నానని, ఈసారి డబ్బు లేదా ఇటీవల నిర్మించిన కొత్త ఇంటిని తన పేరిట రాసివ్వాలని.. ఈసారి మొండిచేయి చూపితే భార్య, పిల్లలను చంపుతామని హెచ్చరించాడు. తీవ్రంగా గాయపడిన హనుమంతరావును తమ్ముడు మారుతి అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్చాడు. చికిత్స పొందుతున్న బాధితుడిని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ధనుంజయయాదవ్ పరామర్శించారు.
భౌతికదాడులు, అక్రమ అరెస్టులు నిరోధించండి
అనంతపురం జిల్లా పరిషత్ : వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ నేతల నుంచి భౌతికదాడులు, పోలీసుల నుంచి అక్రమ అరెస్టులు నిరోధించాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ ఎస్పీ సెంథిల్‌కుమార్‌ని కోరారు. ఈ మేరకు సోమవారం ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. కక్కలపల్లి కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనను కూడా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను కట్టడి చేసి.. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో పార్టీ అధికార ప్రతినిధి సీపీ వీరన్న, రూరల్ మండలం కన్వీనర్ ధనుంజయయాదవ్‌తో పాటు మరికొందరు బాధితులు ఉన్నారు.