అరకు రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది గిరిజన పేద పిల్లలే. వీరికి మూడు పూటలా కడుపు నిండా భోజనం దొరకడం కష్టమే. పౌష్టికాహరం అంటే ఏమిటో తెలియదు. ఇలాంటి వారికి ఏదైనా సుస్తీ చేస్తే మంచి ఆస్పత్రుల్లో చేర్పించి వైద్యం చేయించే శక్తి వారి తల్లిదండ్రులకు ఉండదు. అందుకే గత ప్రభుత్వం 2010 నవంబర్ నెలలో ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష’ అనే వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైతే మందులు, చికిత్స అందించాలన్నది ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. దీనితో పాటు చిన్నారుల విద్య ప్రగతిపై కూడ వివరాలు నమోదు చేయాలని నిర్ణయించారు. మండల స్థాయిలో ఎంపీడీఓ చైర్మన్‌గా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, ఎంఈఓ సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేశారు.
ప్రతి మంగళవారం ఆరోగ్య రోజుగా పాటించి, అవసరమైన వారిని రిఫరల్ ఆస్పత్రులకు తరలించాలి. వైద్య పరీక్షల విషయంలో ఉపాధ్యాయులు, హెచ్‌ఎం కూడా బాధ్యత తీసుకొని సమీక్షించాలి. విద్యార్థులు తరగతిలో సాధించిన మార్కులు గ్రేడుల వివరాలు ప్రగతి రికార్డులో నమోదయ్యాయో లేదో పరిశీలించేలా కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ పథకంపై అప్పట్లో ప్రశంసల జల్లు కురిసింది. కానీ ఇదంతా మూణాళ్ల ముచ్చటగా మారింది. ప్రచారార్భాటాల కోసం కోట్ల రుపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం తర్వాత ఈ పథకాన్ని విస్మరించింది. ప్రభుత్వ చిత్తశుద్ధి లోపం వల్ల ఏ విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతున్నాడో ముందుగానే కనుగొనే అవకాశం లేకుండా పోయింది.
హాజరు శాతం పెంచడం కూడా లక్ష్యమే:
గిరి గ్రామాల్లోని పిల్లలు సక్రమంగా బడికి వెళ్లకుండా తల్లిదండ్రులతో కలసి వ్యవసాయ పనులు, కూలీ పనులకు వెళ్లి పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో ఇలాంటి పిల్లలు సాధారణంగా అనారోగ్యం పాలవుతుంటారు. కల్తీ ఆహారం తీసుకోవడం కూడా సమస్యగా మారుతుంది. ఈ కారణాల వల్ల పిల్లలు పాఠశాలలకు సక్రమంగా హాజరు కాలేకపోతున్నారు. దీన్ని నివారించి హాజరు శాతం పెంచాలంటే ముందుగా విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా కల్పించాలి.
అందుకు ప్రభుత్వం ‘ఆరోగ్య రక్ష’ కార్డులు జారీ చేసింది. వసతి గృహాల్లో 3 నుంచి 10వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థులకు ప్రతి నెలా, ప్రతి ఒక్కరి వైద్య వివరాలు కార్డులో నమోదు చేయాలని ఆదేశించింది. ప్రారంభంలో ఆర్భాటంగా కార్డులు అందజేసిన అధికారులు ఆ తరువాత దాని గురించి మరిచిపోయారు. అలాగే అడపా దడపా పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఇప్పుడేమో ఆస్పత్రులకు పరిమితమయ్యారు. ప్రత్యేక కమిటీలు కూడా ఏమయ్యాయో ఎవ్వరికీ తెలియడం లేదు.
40శాతం మందికే కార్డులు
అరకులోయ మండలంలోని ఏడు గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో నాలుగు వేల మంది విద్యార్థులు ఉన్నారు. మొదటి సంవత్సరంలో ఇచ్చిన ఆరోగ్య రక్ష కార్డులు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. ఆ తరువాత ఏ ఒక్క విద్యార్థికి కార్డులు ఇవ్వలేదు. అప్పట్లో 8,9,10వ తరగతులు చదివిన విద్యార్థులు ఆయా పాఠశాలల స్థాయి నుంచి కళాశాల స్థాయికి వెళ్లారు. దీంతో ప్రస్తుతం ఏ పాఠశాలలో కూడా 40 శాతం మందికి మాత్రమే ఈ కార్డులున్నాయి.
ఈ కార్డులున్నప్పటికి వీటిలో ఆరోగ్య పరీక్షలు జరిపిన వివరాలు కానీ, చికిత్స అందించిన వివరాలు వంటివి పొందుపర్చలేదు. విద్యా ప్రగతికి సంబంధించిన వివరాలు కూడా ఏ విద్యార్థి కార్డులోనూ కనబడడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రతి విద్యార్థికి ఆరోగ్య రక్ష కార్డులు జారీ చేసి, వీరి వివరాలు నమోదు చేయాల్సి ఉన్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అవసరమైన వారిని రిఫరల్ అస్పత్రులకు తీసుకువెళ్లి మెరుగైన వైద్య పరీక్షలు చేయాల్సి ఉన్నా...ఎవ్వరికీ పట్టడం లేదు. కంఠబౌంషుగుడ గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో 606 మంది ఉండగా 300 మందికి ఆరోగ్య కార్డులు లేవని హెచ్‌ఎం జానకమ్మ తెలిపారు.
బాలల ఆరోగ్యానికి ఏదీ ‘రక్ష’
Published Sun, Jun 29 2014 3:12 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement