24 /7 వైద్య సేవలు కలే!
గజ్వేల్: పీహెచ్‌సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)ల్లో 24గంటల వైద్య సేవలు కలగా మిగిలాయి. వైద్యులు, సిబ్బంది ఎప్పుడు వస్తారో, ఎప్పుడో వెళతారో తెలియని పరిస్థితి నెలకొంది. సిబ్బంది కొరత కూడా కేంద్రాలను పట్టి పీడిస్తోంది. వర్గల్ పీహెచ్‌సీలో ఆరుగురు వైద్యులకుగానూ నలుగురు డిప్యుటేషన్‌పై వెళ్లగా ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
ఇందులో సోమవారం ఒకరు సెలవులో ఉండగా ఒక్కరు మాత్రమే వైద్య సేవలందించాల్సి రావడంతో రోగులు ఆసుపత్రిలో కిక్కిరిసి పోయారు. తూప్రాన్,తీగుల్,ములుగు లోనూ అదే పరిస్థితి. గజ్వేల్‌లోని ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది కొరత రోగులకు శాపంగా మారింది. ఈ ఆసుత్రిలో ఓపీ ఉదయం 9నుంచి 12గంటలకే పరిమితం చేయడం వల్ల ఇబ్బంది ఏర్పడుతోంది. ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేసిన తర్వాతా అదనపు సిబ్బందిని నియమించకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది.
సిబ్బంది.. ఇబ్బందులు
సిద్దిపేట అర్బన్: అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లకు సోమవారం సెలవటా! ఈ విషయాన్ని వైద్యాధికారులే చెప్పడం గమనార్హం. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సిద్దిపేటలోని అర్బన్ పీహెచ్‌సీతో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని, సిద్దిపేట మండలం నారాయణరావుపేట పీహెచ్‌సీని, చిన్నకోడూరు మండల కేంద్రంలోని పీహెచ్‌సీని, నంగునూరు మండలం కేంద్రంలోని పీహెచ్‌సీలలో సిబ్బంది సమయపాలన పాటించకుండా ఆలస్యంగా విధులకు హాజరయ్యారు.
సిద్దిపేట పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌తో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాలకు తాళాలు వేశారు. వాటిని తెరవకపోవడంతో అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి గౌరీశంకర్‌ను ఆరా తీయగా సోమవారం అర్బన్ హెల్త్ సెంటర్లకు సెలవని చెప్పారు. నారాయణరావుపేట పీహెచ్‌సీలో కీలక సిబ్బంది హాజరు కాలేదు. చిన్నకోడూరు , నంగునూరు మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీకి వైద్యులు సకాలంలో రాగా సిబ్బంది ఆలస్యంగా వచ్చారు.
వైద్య పరీక్షలకు రోగుల నిరీక్షణ
జోగిపేట: అందోలు నియోజవకర్గం పరిధిలోని అందోలు, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి, టేక్మాల్, రాయికోడ్ మండలాల్లో పీహెచ్‌సీలు ఉన్నాయి. అందోలు మండలం తాలెల్మ గ్రామంలోని పీహెచ్‌సీలో రెగ్యులర్ డాక్టర్ లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం రోగులు డాక్టర్, వైద్య సిబ్బంది కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం ఫార్మాసిస్టు, నర్సుతో పాటు మరొకరు మాత్రమే విధుల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఇంచార్జి డాక్టర్‌గా డాక్టర్ మేరీ పనిచేస్తున్నారు.
పీహెచ్‌సీ పరిధిలోని సిబ్బందితో జరిగే సమావేశానికి ఆమె హాజరయ్యేందుకు ఉదయం 11.30 ప్రాంతంలో ఆసుపత్రికి వచ్చారు. తాను జోగిపేట పీపీ యూనిట్‌లో పనిచేస్తున్నానని, మంగళ, గురు, శుక్రవారాల్లో మాత్రమే పీహెచ్‌సీకి వస్తానని తెలిపారు. పీహెచ్‌సీలల్లో డెలివరీలు చేసేందుకు సిబ్బంది సాహసించడంలేదని సమాచారం.
పీహెచ్‌సీల్లో అందని సేవలు
Published Tue, Nov 25 2014 1:03 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement