Urban Primary Health Centre
-
అది బస్తీ దవాఖానా.. కానీ అక్కడికి ఐఏఎస్‌లూ వస్తారు
సాక్షి, బంజారాహిల్స్: తాజా మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులతో పాటు సంపన్న వ్యాపార, పారిశ్రామికవేత్తలు తమకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే బడా కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తారని అంతా భావిస్తారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.72లోని ప్రశాసన్‌నగర్‌లో నివసిస్తున్న తాజా, మాజీ బ్యూరోక్రాట్లు మాత్రం తమ కాలనీలో ఉన్న బస్తీ దవాఖానాను సద్వినియోగం చేసుకుంటున్నారు. బీపీ, షుగర్ తదితర పరీక్షలతో పాటు అందుకు సంబంధించిన మందులను కూడా వీరంతా ఈ బస్తీ దవాఖానాలోనే పొందుతున్నారు. వైద్యం కోసం వచ్చిన అధికారి సురేష్ చందా.. 2018 మార్చిలో ఇక్కడ బస్తీ దవాఖానా ఏర్పాటు చేశారు. ఇక్కడున్న సౌకర్యాలతో ఐఏఎస్, ఐపీఎస్‌లు ఆకర్షితులయ్యారు. సమీపంలోనే కార్పొరేట్ వైద్యం లభిస్తుండటంతో మెల్లమెల్లగా అధికారులంతా ఇక్కడే వైద్య సేవలు పొందుతున్నారు. ప్రతిరోజూ 20 నుంచి 30 మంది అధికారులు ఇక్కడ షుగర్, బీపీ పరీక్షలతో పాటు లివర్ ఫంక్షన్ టెస్టులు, రెనాల్ ప్రొఫైల్ టెస్టులు, సీరం కాల్షియం, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించుకుంటున్నారు. దీంతో బస్తీ దవాఖానా కాస్తా కాలనీ దవాఖానాగా వరిపోయింది. ఇక్కడ సామాన్యులతో పాటు సంపన్నులు వైద్య పరీక్షలు నిర్వహించుకుంటుండటంతో బస్తీ దవాఖానా కార్పొరేట్ ఆస్పత్రి తరహాగా సేవలు అందిస్తోంది. బస్తీ దవాఖానాలో పరీక్షలు చేయించుకుంటున్న ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ అన్ని పరీక్షలూ ఇక్కడే.. డ్రైవర్లు, పని మనుషుల కోసం మాత్రమే ఏర్పాటైన బస్తీ దవాఖానాలో లభిస్తున్న వైద్య సేవలు సంపన్నులను సైతం ఆకర్షిస్తున్నాయి. నాణ్యమైన మందులతో పాటు వైద్య సేవలు కూడా అందుబాటులో ఉండటంతో ప్రతిరోజూ 20 నుంచి 30 మంది వరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పరీక్షల కోసం వస్తున్నారు. ప్రతి వైద్య పరీక్షను ఇక్కడే చేయించుకుంటున్నారు. వీరితో పాటు కాలనీకి చెందిన పని మనుషులు, డ్రైవర్లు, సమీప బస్తీల నుంచి ప్రతిరోజూ 80 నుంచి 100 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. – డాక్టర్ అమూల్య, ప్రశాసన్‌నగర్ బస్తీ దవాఖానా -
అర్బన్ హెల్త్‌సెంటర్లకు మెరుగులు
కరీంనగర్ హెల్త్ : పట్టణ పేదలకు వైద్య సేవలందించే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల రూపురేఖలు మారనున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించడంతోపాటు పట్టణంలోని పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న సర్కారు ఆస్పత్రులకు తోడు పట్టణాలు, నగరాల్లోని పేదల కోసం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. యాభై వేలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో పట్టణ ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్సీ), రెండు లక్షల జనాభా ఉన్న నగరాల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(యూసీహెచ్‌సీ) నిర్మిస్తారు. ప్రస్తుతం జిల్లాలోని పట్టణాల్లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లు నామమాత్రంగా మారాయి. ఈ సెంటర్ల బాధ్యతలు స్వచ్చంద సంస్థలు నిర్వహిస్తుండటంతో వీటి పనితీరు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. జాతీయ ఆరోగ్యమిషన్ ఆధ్వర్యంలో జాతీయ పట్టణ ఆరోగ్యమిషన్ అర్బన్ పీహెచ్‌సీల నిర్వాహణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలో ఏయే ప్రాంతాల్లో అర్బన్ పీహెచ్‌సీలు ఏర్పాటు చేయవచ్చు అనే విషయంపై చర్యలు ప్రారంభించింది. జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల, మెట్‌పల్లితోపాటు పట్టణాల తరహాలో ఉన్న మేజర్ గ్రామపంచాయతీల జనాభా, అక్కడి మురికివాడలు, ఆరోగ్య సమస్యలు, సౌకర్యాలపై జిల్లా అధికారులు ఇప్పటికే సమగ్ర నివేదిక తయారు చేసి పంపించారు. అవసరమైతే అద్దె భవనాల్లో... కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు వెంటనే భవన నిర్మాణాలు చేపట్టాలని, ఒకవేళ నిర్మాణ పనులు ఆలస్యమైతే అద్దెకు తీసుకుని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు. ఒక్కో సెంటర్‌ను రూ.25 లక్షలతో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటిని త్వరగా ప్రారంభించాలనే యత్నాల్లో భాగంగా అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్వహణ బాధ్యతల నుంచి స్వచ్ఛంద సంస్థలను తప్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇకనుంచి అర్బన్ పీహెచ్సీ బాధ్యతలు డీఎంహెచ్‌వోకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. స్వచ్ఛంద సంస్థల ద్వారా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిబ్బందికి ప్రభుత్వం డిస్ట్రిక్ట్ హెల్త్ సెంటర్ నుంచి వేతనాలు చెల్లించి ఆయా సంస్థలకు చెక్ పెట్టింది. అందుకు సిబ్బంది నుంచి బ్యాంకు అకౌంట్ ఖాతాలు తెరిపించి వాటిలో వేతనాలు జమ చేసింది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న వాటిలో మార్చి వరకు వేతనాలు బ్యాంకు ఖాతా ద్వారా చెల్లించింది. జిల్లాలో కరీంనగర్ 3, రామగుండంలో 6, జగిత్యాలలో 3, సిరిసిల్ల 2, కోరుట్ల 1, మెట్పల్లిలో 1 మొత్తం 16 అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. వీటిలో కరీంనగర్, రామగుండంలోని యూహెచ్‌పీల స్థానంలో కమ్యూనిటీ హెల్త్సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. పీహెచ్‌సీల తరహాలోనే ఇక్కడ పూర్తి స్థాయి వైద్యులు, సిబ్బందిని నియమిస్తారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంతోపాటు వైద్య సేవల్లో మోడల్ జిల్లాగా కరీంనగర్‌ను తీర్చిదిద్దడంలో భాగంగా వీటిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతిపాదనలకు ఆమోదం లభించగానే పనులు మొదలు కానున్నాయి. -
పీహెచ్‌సీల్లో అందని సేవలు
24 /7 వైద్య సేవలు కలే! గజ్వేల్: పీహెచ్సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)ల్లో 24గంటల వైద్య సేవలు కలగా మిగిలాయి. వైద్యులు, సిబ్బంది ఎప్పుడు వస్తారో, ఎప్పుడో వెళతారో తెలియని పరిస్థితి నెలకొంది. సిబ్బంది కొరత కూడా కేంద్రాలను పట్టి పీడిస్తోంది. వర్గల్ పీహెచ్సీలో ఆరుగురు వైద్యులకుగానూ నలుగురు డిప్యుటేషన్‌పై వెళ్లగా ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో సోమవారం ఒకరు సెలవులో ఉండగా ఒక్కరు మాత్రమే వైద్య సేవలందించాల్సి రావడంతో రోగులు ఆసుపత్రిలో కిక్కిరిసి పోయారు. తూప్రాన్,తీగుల్,ములుగు లోనూ అదే పరిస్థితి. గజ్వేల్‌లోని ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది కొరత రోగులకు శాపంగా మారింది. ఈ ఆసుత్రిలో ఓపీ ఉదయం 9నుంచి 12గంటలకే పరిమితం చేయడం వల్ల ఇబ్బంది ఏర్పడుతోంది. ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేసిన తర్వాతా అదనపు సిబ్బందిని నియమించకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. సిబ్బంది.. ఇబ్బందులు సిద్దిపేట అర్బన్: అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు సోమవారం సెలవటా! ఈ విషయాన్ని వైద్యాధికారులే చెప్పడం గమనార్హం. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సిద్దిపేటలోని అర్బన్ పీహెచ్‌సీతో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని, సిద్దిపేట మండలం నారాయణరావుపేట పీహెచ్‌సీని, చిన్నకోడూరు మండల కేంద్రంలోని పీహెచ్‌సీని, నంగునూరు మండలం కేంద్రంలోని పీహెచ్సీలలో సిబ్బంది సమయపాలన పాటించకుండా ఆలస్యంగా విధులకు హాజరయ్యారు. సిద్దిపేట పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌తో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాలకు తాళాలు వేశారు. వాటిని తెరవకపోవడంతో అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి గౌరీశంకర్‌ను ఆరా తీయగా సోమవారం అర్బన్ హెల్త్ సెంటర్లకు సెలవని చెప్పారు. నారాయణరావుపేట పీహెచ్సీలో కీలక సిబ్బంది హాజరు కాలేదు. చిన్నకోడూరు , నంగునూరు మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీకి వైద్యులు సకాలంలో రాగా సిబ్బంది ఆలస్యంగా వచ్చారు. వైద్య పరీక్షలకు రోగుల నిరీక్షణ జోగిపేట: అందోలు నియోజవకర్గం పరిధిలోని అందోలు, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి, టేక్మాల్, రాయికోడ్ మండలాల్లో పీహెచ్‌సీలు ఉన్నాయి. అందోలు మండలం తాలెల్మ గ్రామంలోని పీహెచ్సీలో రెగ్యులర్ డాక్టర్ లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం రోగులు డాక్టర్, వైద్య సిబ్బంది కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం ఫార్మాసిస్టు, నర్సుతో పాటు మరొకరు మాత్రమే విధుల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఇంచార్జి డాక్టర్‌గా డాక్టర్ మేరీ పనిచేస్తున్నారు. పీహెచ్సీ పరిధిలోని సిబ్బందితో జరిగే సమావేశానికి ఆమె హాజరయ్యేందుకు ఉదయం 11.30 ప్రాంతంలో ఆసుపత్రికి వచ్చారు. తాను జోగిపేట పీపీ యూనిట్లో పనిచేస్తున్నానని, మంగళ, గురు, శుక్రవారాల్లో మాత్రమే పీహెచ్‌సీకి వస్తానని తెలిపారు. పీహెచ్‌సీలల్లో డెలివరీలు చేసేందుకు సిబ్బంది సాహసించడంలేదని సమాచారం.