కరీంనగర్ హెల్త్ : పట్టణ పేదలకు వైద్య సేవలందించే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల రూపురేఖలు మారనున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించడంతోపాటు పట్టణంలోని పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న సర్కారు ఆస్పత్రులకు తోడు పట్టణాలు, నగరాల్లోని పేదల కోసం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
యాభై వేలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో పట్టణ ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్‌సీ), రెండు లక్షల జనాభా ఉన్న నగరాల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(యూసీహెచ్‌సీ) నిర్మిస్తారు. ప్రస్తుతం జిల్లాలోని పట్టణాల్లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లు నామమాత్రంగా మారాయి. ఈ సెంటర్ల బాధ్యతలు స్వచ్చంద సంస్థలు నిర్వహిస్తుండటంతో వీటి పనితీరు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. జాతీయ ఆరోగ్యమిషన్ ఆధ్వర్యంలో జాతీయ పట్టణ ఆరోగ్యమిషన్ అర్బన్ పీహెచ్‌సీల నిర్వాహణకు శ్రీకారం చుట్టింది.
ఇప్పటికే జిల్లాలో ఏయే ప్రాంతాల్లో అర్బన్ పీహెచ్‌సీలు ఏర్పాటు చేయవచ్చు అనే విషయంపై చర్యలు ప్రారంభించింది. జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల, మెట్‌పల్లితోపాటు పట్టణాల తరహాలో ఉన్న మేజర్ గ్రామపంచాయతీల జనాభా, అక్కడి మురికివాడలు, ఆరోగ్య సమస్యలు, సౌకర్యాలపై జిల్లా అధికారులు ఇప్పటికే సమగ్ర నివేదిక తయారు చేసి పంపించారు.
అవసరమైతే అద్దె భవనాల్లో...
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు వెంటనే భవన నిర్మాణాలు చేపట్టాలని, ఒకవేళ నిర్మాణ పనులు ఆలస్యమైతే అద్దెకు తీసుకుని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు. ఒక్కో సెంటర్‌ను రూ.25 లక్షలతో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటిని త్వరగా ప్రారంభించాలనే యత్నాల్లో భాగంగా అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్వహణ బాధ్యతల నుంచి స్వచ్ఛంద సంస్థలను తప్పించేందుకు చర్యలు చేపట్టింది.
ఇకనుంచి అర్బన్ పీహెచ్‌సీ బాధ్యతలు డీఎంహెచ్‌వోకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. స్వచ్ఛంద సంస్థల ద్వారా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిబ్బందికి ప్రభుత్వం డిస్ట్రిక్ట్ హెల్త్ సెంటర్ నుంచి వేతనాలు చెల్లించి ఆయా సంస్థలకు చెక్ పెట్టింది. అందుకు సిబ్బంది నుంచి బ్యాంకు అకౌంట్ ఖాతాలు తెరిపించి వాటిలో వేతనాలు జమ చేసింది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న వాటిలో మార్చి వరకు వేతనాలు బ్యాంకు ఖాతా ద్వారా చెల్లించింది.
జిల్లాలో కరీంనగర్ 3, రామగుండంలో 6, జగిత్యాలలో 3, సిరిసిల్ల 2, కోరుట్ల 1, మెట్‌పల్లిలో 1 మొత్తం 16 అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. వీటిలో కరీంనగర్, రామగుండంలోని యూహెచ్‌పీల స్థానంలో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. పీహెచ్‌సీల తరహాలోనే ఇక్కడ పూర్తి స్థాయి వైద్యులు, సిబ్బందిని నియమిస్తారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంతోపాటు వైద్య సేవల్లో మోడల్ జిల్లాగా కరీంనగర్‌ను తీర్చిదిద్దడంలో భాగంగా వీటిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతిపాదనలకు ఆమోదం లభించగానే పనులు మొదలు కానున్నాయి.
అర్బన్ హెల్త్‌సెంటర్లకు మెరుగులు
Published Thu, May 21 2015 2:51 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement