సాక్షి, బంజారాహిల్స్: తాజా మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్ అధికారులతో పాటు సంపన్న వ్యాపార, పారిశ్రామికవేత్తలు తమకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే బడా కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తారని అంతా భావిస్తారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.72లోని ప్రశాసన్‌నగర్‌లో నివసిస్తున్న తాజా, మాజీ బ్యూరోక్రాట్లు మాత్రం తమ కాలనీలో ఉన్న బస్తీ దవాఖానాను సద్వినియోగం చేసుకుంటున్నారు. బీపీ, షుగర్ తదితర పరీక్షలతో పాటు అందుకు సంబంధించిన మందులను కూడా వీరంతా ఈ బస్తీ దవాఖానాలోనే పొందుతున్నారు.
వైద్యం కోసం వచ్చిన అధికారి సురేష్ చందా..
2018 మార్చిలో ఇక్కడ బస్తీ దవాఖానా ఏర్పాటు చేశారు. ఇక్కడున్న సౌకర్యాలతో ఐఏఎస్, ఐపీఎస్‌లు ఆకర్షితులయ్యారు. సమీపంలోనే కార్పొరేట్ వైద్యం లభిస్తుండటంతో మెల్లమెల్లగా అధికారులంతా ఇక్కడే వైద్య సేవలు పొందుతున్నారు. ప్రతిరోజూ 20 నుంచి 30 మంది అధికారులు ఇక్కడ షుగర్, బీపీ పరీక్షలతో పాటు లివర్ ఫంక్షన్ టెస్టులు, రెనాల్ ప్రొఫైల్ టెస్టులు, సీరం కాల్షియం, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించుకుంటున్నారు. దీంతో బస్తీ దవాఖానా కాస్తా కాలనీ దవాఖానాగా వరిపోయింది. ఇక్కడ సామాన్యులతో పాటు సంపన్నులు వైద్య పరీక్షలు నిర్వహించుకుంటుండటంతో బస్తీ దవాఖానా కార్పొరేట్ ఆస్పత్రి తరహాగా సేవలు అందిస్తోంది.
బస్తీ దవాఖానాలో పరీక్షలు చేయించుకుంటున్న ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్
అన్ని పరీక్షలూ ఇక్కడే..
డ్రైవర్లు, పని మనుషుల కోసం మాత్రమే ఏర్పాటైన బస్తీ దవాఖానాలో లభిస్తున్న వైద్య సేవలు సంపన్నులను సైతం ఆకర్షిస్తున్నాయి. నాణ్యమైన మందులతో పాటు వైద్య సేవలు కూడా అందుబాటులో ఉండటంతో ప్రతిరోజూ 20 నుంచి 30 మంది వరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పరీక్షల కోసం వస్తున్నారు. ప్రతి వైద్య పరీక్షను ఇక్కడే చేయించుకుంటున్నారు. వీరితో పాటు కాలనీకి చెందిన పని మనుషులు, డ్రైవర్లు, సమీప బస్తీల నుంచి ప్రతిరోజూ 80 నుంచి 100 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు.
– డాక్టర్ అమూల్య, ప్రశాసన్‌నగర్ బస్తీ దవాఖానా
Comments
Please login to add a commentAdd a comment