local hospital
-
అది బస్తీ దవాఖానా.. కానీ అక్కడికి ఐఏఎస్‌లూ వస్తారు
సాక్షి, బంజారాహిల్స్: తాజా మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులతో పాటు సంపన్న వ్యాపార, పారిశ్రామికవేత్తలు తమకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే బడా కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తారని అంతా భావిస్తారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.72లోని ప్రశాసన్‌నగర్‌లో నివసిస్తున్న తాజా, మాజీ బ్యూరోక్రాట్లు మాత్రం తమ కాలనీలో ఉన్న బస్తీ దవాఖానాను సద్వినియోగం చేసుకుంటున్నారు. బీపీ, షుగర్ తదితర పరీక్షలతో పాటు అందుకు సంబంధించిన మందులను కూడా వీరంతా ఈ బస్తీ దవాఖానాలోనే పొందుతున్నారు. వైద్యం కోసం వచ్చిన అధికారి సురేష్ చందా.. 2018 మార్చిలో ఇక్కడ బస్తీ దవాఖానా ఏర్పాటు చేశారు. ఇక్కడున్న సౌకర్యాలతో ఐఏఎస్, ఐపీఎస్‌లు ఆకర్షితులయ్యారు. సమీపంలోనే కార్పొరేట్ వైద్యం లభిస్తుండటంతో మెల్లమెల్లగా అధికారులంతా ఇక్కడే వైద్య సేవలు పొందుతున్నారు. ప్రతిరోజూ 20 నుంచి 30 మంది అధికారులు ఇక్కడ షుగర్, బీపీ పరీక్షలతో పాటు లివర్ ఫంక్షన్ టెస్టులు, రెనాల్ ప్రొఫైల్ టెస్టులు, సీరం కాల్షియం, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించుకుంటున్నారు. దీంతో బస్తీ దవాఖానా కాస్తా కాలనీ దవాఖానాగా వరిపోయింది. ఇక్కడ సామాన్యులతో పాటు సంపన్నులు వైద్య పరీక్షలు నిర్వహించుకుంటుండటంతో బస్తీ దవాఖానా కార్పొరేట్ ఆస్పత్రి తరహాగా సేవలు అందిస్తోంది. బస్తీ దవాఖానాలో పరీక్షలు చేయించుకుంటున్న ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ అన్ని పరీక్షలూ ఇక్కడే.. డ్రైవర్లు, పని మనుషుల కోసం మాత్రమే ఏర్పాటైన బస్తీ దవాఖానాలో లభిస్తున్న వైద్య సేవలు సంపన్నులను సైతం ఆకర్షిస్తున్నాయి. నాణ్యమైన మందులతో పాటు వైద్య సేవలు కూడా అందుబాటులో ఉండటంతో ప్రతిరోజూ 20 నుంచి 30 మంది వరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పరీక్షల కోసం వస్తున్నారు. ప్రతి వైద్య పరీక్షను ఇక్కడే చేయించుకుంటున్నారు. వీరితో పాటు కాలనీకి చెందిన పని మనుషులు, డ్రైవర్లు, సమీప బస్తీల నుంచి ప్రతిరోజూ 80 నుంచి 100 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. – డాక్టర్ అమూల్య, ప్రశాసన్‌నగర్ బస్తీ దవాఖానా -
అక్కడ స్వీపర్లే నర్సులు..!
సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో వైద్యం కోసం వచ్చే వారికి పారిశుధ్య విభాగంలో పనిచేసే స్వీపర్లే సేవలందించాల్సిన దుస్థితి ఏర్పడింది. వైద్యశాలలో నర్సులు ఉన్నప్పటికీ రోగులను పట్టించుకోకుండా కుర్చీల్లో కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకే పరిమితమవుతున్నారు. వైద్యశాలల్లో ఐదుగురు డాక్టర్లు ఉన్నారు. వారు రోగులను పరీక్షించి మందులు, ఇంజక్షన్లు రాస్తారు. డాక్టర్ రాసిచ్చిన మందులు ఇంజక్షన్లను రోగులకు ఇవ్వాల్సిన నర్సులు.. ఆ పనిని స్వీపర్లతో చేయిస్తున్నారు. వైద్యశాలలో సుమారు 15 మంది వరకూ నర్సులు ఉన్నప్పటికీ రోగులకు అరకొరగా కూడా వైద్యసేవలు అందించకుండా తీవ్రస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులకు ఇంజక్షన్లు వేయడం, సెలైన్లు పెట్టడం వంటి పనులన్నింటినీ పారిశుధ్య కార్మికులతోనే చేయిస్తున్నారు. దీనిపై రోగులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్వీపర్లు మరుగుదొడ్లు, వార్డులు శుభ్రపరచి అపరిశుభ్రమైన చేతులతో తమకు ఇంజక్షన్లు చేయడం, సెలైన్లు ఇవ్వడమేంటని ఆగ్రహిస్తున్నారు. అంతేగాకుండా ఎలాంటి శిక్షణ లేని స్వీపర్లు వైద్యసేవలు అందించడం వలన కొన్నిసార్లు రోగులు తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంజక్షన్లు చేసే సమయంలో తీవ్రంగా నొప్పి, సెలైన్లు ఎక్కించే సమయంలో రక్తస్రావం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. నర్సులు చేయాల్సిన పనులను స్వీపర్లతో చేయించడం ఏంటని ఆయా సమయాల్లో నర్సులను నిలదీస్తున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోందని, వారిలో ఏ విధమైన మార్పూ రావడం లేదని రోగులు, వారి బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గాయాలకు కట్లు కట్టేది.. కుట్లు వేసేది కూడా స్వీపర్లే... రోడ్డు ప్రమాదాలు, తదితర సంఘటనల్లో గాయాలపాలై వైద్యశాలకు వచ్చిన క్షతగాత్రులకు కట్టుకట్టి వైద్యం చేయాల్సిన నర్సులు పట్టించుకోకపోవడంతో పాటు ఆ పనులను స్వీపర్లతో చేయిస్తున్నారు. గాయాలకు స్వీపర్లే డ్రస్సింగ్ చేసి కట్టు కడుతున్నారు. కొందరికి కుట్లు కూడా వారే వేస్తున్నారు. స్వీపర్లు వైద్యం అందించడంపై కొందరు రోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా.. ప్రమాద సమయంలో తప్పడం లేదని సర్దుకుపోతున్నారు. దీనిపై వైద్యశాల వైద్యులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రోగుల బంధువులు వాపోతున్నారు. డ్యూటీ డాక్టర్లైనా రోగులకు చేయి పట్టుకుని వైద్యం అందిస్తారుగానీ, నర్సులు మాత్రం రోగులను పట్టించుకోరన్న ఆరోపణలు ఈ వైద్యశాల నర్సులపై ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో నర్సులకు కౌన్సిలింగ్ ఇచ్చి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
కోహ్లిని చూసేందుకు ఆస్పత్రికి పోటెత్తారు!
-
కోహ్లిని చూసేందుకు ఆస్పత్రికి పోటెత్తారు!
మ్యాచ్‌ల సందర్భంగా టీమిండియా కెప్టెన్, డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి మైదానంలో తప్ప బయట పెద్దగా కనిపించడు. కానీ, రాంచీలో ఆస్ట్రేలియాతో రెండో టెస్టు తొలిరోజున భుజానికి గాయం కావడంతో రెండోరోజు పూర్తిగా మూడు సెషన్లలోనూ కోహ్లి మైదానంలో కనిపించలేదు. అయినప్పటికీ, కోహ్లి ఫిట్‌గా ఉన్నాడని, బ్యాటింగ్‌కు దిగుతాడని బీసీసీఐ, బౌలర్ ఉమేశ్ యాదవ్ స్పష్టం చేశారు. అయినప్పటికీ గాయం స్వభావాన్ని తెలుసుకోవడానికి కోహ్లికి జట్టు వైద్యబృందం రాంచీలోని ఓ స్థానిక ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించింది. ఈ సందర్భంగా ఆస్పత్రికి కోహ్లి వస్తున్నారన్న వార్త చుట్టుపక్కల దావాహనంలా వ్యాపించింది. దీంతో వేలాదిమంది ఆస్పత్రి వద్ద గుమిగూడి కోహ్లిని చూసేందుకు ఆరాటపడ్డారు. అభిమానులు ఎగబడకుండా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన వెళ్లిపోయారు. అయిన్పటికీ ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న కోహ్లిని చూసిన క్రికెట్ ప్రేమికులు కెరింతలతో తమ హర్షం వ్యక్తం చేశారు. గత గురువారం రాంచీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. A small insight into How Indian cricket players are bigger stars than Premier League Football players over here !!! https://t.co/QhIYgh46tw — Michael Vaughan (@MichaelVaughan) March 17, 2017 -
బకెట్లో పడి చిన్నారి మృతి
మహబూబాబాద్ : వరంగల్ జిల్లా మానుకోట శివారు ఎల్బీజీ నగర్ కాలనీలో బుధవారం 16 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు బకెట్లో పడి మృతి చెందింది. కాలనీకి చెందిన బానోత్ నరేష్- పద్మ రెండో కూతురు బిందు (16 నెలలు) బుధవారం ఉదయమే ఇంటి ఆవరణలో ఉన్న నీళ్ల బకెట్ వద్ద ఆడుకుంది. తల నీళ్లలో పెట్టి చూడటంతో ప్రమాదవశాత్తు తలకిందులై అందులో పడిపోరుుంది. అప్పటికే బహిర్భూమికని వెళ్లిన తల్లి పద్మ వచ్చి చూసేసరికి బిందు బకెట్లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. -
వ్యాధుల ముసురు
మన్యంపై ముప్పేట దాడి ఇంటింటా రోగులు ఆస్పత్రుల్లో చాలని వసతులు ఇంటిల్లిపాదికీ ఒకే బెడ్‌పై వైద్య సేవలు మన్యం మంచమెక్కింది.. ముసురుకున్న వ్యాధులతో సతమతమవుతోంది. ఒక్కసారిగా వ్యాధులు విజృంభించడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మునుపటి కథ పునరావృతమవుతోంది. వాతావరణ మార్పులు, మంచినీటికైనా దిక్కులేని పరిస్థితులు, గిరిజనుల్లో కొరవడ్డ జాగ్రత్తలు.. ఇలా అనేకానేక కారణాలు సమస్యను జటిలం చేస్తున్నాయి. మన్యవాసులను భయపెడుతున్నాయి. ఇంటింటా వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో వైద్యం కష్టమవుతోంది. వైద్యుల సంఖ్య తక్కువగా ఉన్న ఆస్పత్రుల్లో పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఒకే బెడ్‌పై కుటుంబం అంతటికీ చికిత్స చేస్తున్న ఉదంతాలు కనిపిస్తున్నాయంటే పరిస్థితి అర్ధమవుతుంది. పాడేరురూరల్, న్యూస్‌లైన్: మళ్లీ మన్యంలో ఆందోళనకర వాతావరణం కనిపిస్తోంది. వ్యాధుల విజృంభణతో నానాటికీ పరిస్థితి దిగజారుతోంది. వాతావరణ మార్పులకు ఇతర సమస్యలు తోడు కావడంతో ఏజెన్సీ వ్యాధుల సుడిగుండంలో విలవిలలాడుతోంది. ప్రతి గ్రామంలో వ్యాధిగ్రస్తుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతూ ఉండడంతో పాడేరులోని ప్రాంతీయ ఆస్పత్రిలో వార్డులన్నీ రోగులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు హుకుంపేట మండలంలోని రవ్వలమామిడి, గొల్లమామిడి, గిడ్డివలస గ్రామాల నుంచి డయేరియా బారిన పడి ఒకే సారి సుమారు 50 మందికి పైగా బాధితులు గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి రావటంతో రద్దీ మరిత పెరిగింది. స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో 60 మంచాలు మాత్రమే ఉన్నాయి. వైద్య చికిత్సలు పొందుతున్న రోగుల సంఖ్య 150 మందికి పై మాటే. దీంతో మంచాలు సర్దలేక వైద్య సిబ్బంది సతమతమవుతున్నారు. ఇంటిల్లిపాదినీ ఒకే మంచంపై పడుకోబెట్టి వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. ఆస్పత్రిలో సౌకర్యాలు పెంచాలని రోగులు కోరుతున్నారు. పెరుగుతున్న జ్వరాలు తమ గ్రామంలో జ్వరాల తీవ్రత నానాటికీ ఎక్కువవుతోందని, వైద్య శాఖ అధికారులు స్పందించి తక్షణమే వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కించూరు పంచాయతీ సర్పంచ్ అడపా పురుషోత్తంనాయుడు కోరారు. గ్రామానికి చెందిన కనీసం 20 మంది విష జ్వరాలు, ఇతర వ్యాధుల బారిన పడి వైద్య సేవల కోసం ఎదురుచూస్తున్నారని, వెంటనే తమ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరారు. గన్నేరుపుట్టును వీడని డయేరియా హుకుంపేట: మండలంలోని గన్నేరుపుట్టు పంచాయతీని డయేరియా వీడడం లేదు. ఈ వ్యాధి లక్షణాలతో పంచాయతీ పరిధిలోని గవ్వలమామిడి, శంపంగిపుట్టు, పొర్లు గ్రామాల్లో 46 మంది గురువారం అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఇదే పంచాయతీలోని గడ్డివలస గ్రామంలో మరో 36 మంది ఇదే లక్షణాలతో నీరసించిపోవడాన్ని శుక్రవారం అధికారులు గుర్తించారు. 108లో పాడేరు సీహెచ్‌సీకి ఎకాయెకిన తరలించారు. వరుసగా ఒక్కో గ్రామంలో డయేరియా ప్రబలడంతో గ్రామాల్లోని గిరిజనులు హడలెత్తిపోతున్నారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ ఏపీవో నాయుడు, ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్, ఎస్పీహెచ్వోలు గ్రామాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీవో నాయుడు మాట్లాడుతూ విషాహరమే ఇందుకు కారణంగా అనుమానిస్తున్నామన్నారు.