వైద్యసేవలందేనా?
- పీహెచ్‌సీ నిర్మాణానికి నిధులు మంజూరు
- నాలుగేళ్లైనా పూర్తికాని వైనం
- వైద్యసేవల కోసల గ్రామీణుల ఎదురుచూపులు
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించి భవన నిర్మాణం చేపట్టింది. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నాలుగేళ్లుగా నిర్మాణంపూర్తికాలేదు. అధికారులు కూడా చర్యలు తీసుకోకపోవడంతో నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. తమకు మరింత దగ్గరలో వైద్యసేవలు పొందవచ్చకున్న గ్రామీణుల ఆశలు నెరవేరేలా కనబడటంలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కోహీర్:మండలంలోని బిలాల్‌పూర్ గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పనులు ప్రారంభించి నాలుగేళ్లవుతున్నా ఇంతవరకు నిర్మాణం పూర్తికాలేదు. వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయనుకొన్న ప్రజల ఆశలు ఆవిరవుతున్నాయి. బిలాల్‌పూర్ గ్రామంలో 2011-12 ఆర్థిక సంవత్సరంలో పీహెచ్‌సీ నిర్మాణం కోసం రూ. 48 లక్షలు మంజూరైయ్యాయి.
ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ విభాగం అధికారులకు పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. అదే సంవత్సరంలో టెండరు ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించారు. దీంతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఎంతో సంబరపడ్డారు. పనులకు శంకుస్థాపన చేయకుండానే పనులు ప్రారంభించారని అప్పటి అధికార పార్టీ నాయకులు కినుక వహించి సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పనులకు బ్రేక్ పడింది.
అప్పటి నుంచి పనులు కొనసాగించిన దాఖాలు లేవని స్థానికులు చెబుతున్నారు. మిగిలిన పనులు పూర్తిచేస్తే భవనం వినియోగంలోకి వస్తుంది. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి వస్తే స్థానిక బిలాల్‌పూర్‌తో పాటు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మనియార్‌పల్లి, మాణిక్యనాయక్ తండా, బడంపేటతో బాటు కర్ణాటకలోని శివరాంపురం ప్రజలకు సైతం వైద్యసేవలందే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆయా గ్రామాల ప్రజలు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కోహీర్‌కు రావాల్సి వస్తోంది. ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తే దిగ్వాల్ పీహెచ్‌సీపై భారం తగ్గుతుంది. మరింత మెరుగైన వైద్యసేవలు అందే అవకావం ఉంది. ప్రస్తుతం దిగ్వాల్ పీహెచ్‌సీ ద్వారా మండలంలోని 20 గ్రామ పంచాయతీలు ఆరు ఆమ్లెట్ గ్రామాల సబ్‌సెంటర్లను నియంత్రించాల్సి వస్తోంది.
భవనంతోపాటు రోడ్డు నిర్మాణం చేపట్టాలి
పీహెచ్‌సీ భవన నిర్మాణానికి గ్రామ కంఠంలో స్థలం అందుబాటులో లేకపోవడంతో గ్రామానికి దూరంగా ఉన్న ప్రభుత్వ స్థలం కేటాయించి నిర్మాణంచేపట్టారు. అయితే ఈ పీహెచ్‌సీకి బిలాల్‌పూర్ ప్రజలు రావాలంటే రహదారి సౌకర్యం లేదు. అలాగే మనియార్‌పల్లి, మాణిక్యనాయక్ తండావాసులకు కూడా ఇబ్బందే. వీరు వచ్చే మార్గం బండి కచేరలు, గుంతలమయం. ఆరోగ్య కేంద్రంతోపాటు రోడ్లను సైతం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
జాప్యం తగదు.
బిలాల్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తిచేయకుంటే కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాల్సి ఉండగా ఆ దిశగా ప్రయత్నాలు జరగడంలేదు. ఇప్పటికైన నిర్మాణంపై దృష్టిసారించి పనులను వెంటనే పూర్తి చేయించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలి.
- శ్రీనివాస్, మనియార్‌పల్లి
వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వైద్య సేవల నిమిత్తం మండల కేంద్రమైన కోహీర్ ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిని వెళ్లడానికి వ్యయప్రయాసకు గురికావాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలందర మృత్యువాతపడుతున్నారు. పీహెచ్‌సీ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తేవాలి.
- రాజు, ఎంపీటీసీ, బిలాల్‌పూర్.
సహనం నశిస్తోంది
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణంలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై సహనం నశిస్తోంది. త్వరితగతిన పనులను పూర్తి చేయించాలని ప్రజలు మాపై ఒత్తిడి తెస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదు. ఫోన్ ద్వారా కాంట్రాక్టర్‌ను సంప్రదించినా ఫలితం లేకుండాపోతోంది. వైద్యఆరోగ్య శాఖ, ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పనులను పూర్తి చేయించాలి.
- పంతులు అశోక్, సర్పంచ్, బిలాల్‌పూర్
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే బిలాల్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణంలో జాప్యం జరుగుతుంది. కాంట్రాక్టర్ పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. సంబంధిత శాఖ అధికారులకు లేఖద్వారా తెలియజేశాం. సాధ్యమైనంత తొందరగా నిర్మాణం పూర్తి చేసి అప్పగించాలని కోరాం.
అమర్‌సింగ్, జిల్లా వైద్యాధికారి.