అనంతపురం అర్బన్ : రాయలసీమ ప్రాంతంపై మీకు ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా.. ఈ ప్రాంత రైతుల యోగ క్షేమాలు గురించి మీరు ఆలోచిస్తుంటే వెంటనే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపి.. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వైఎస్సార్‌సీపీ నాయకులు సూచించారు. హంద్రీ-నీవా పూర్తి చేయడానికి కనీసం రూ.2 వేల కోట్ల రూపాయలు కావాలి.. బడ్జెట్‌లో కేవలం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు హంద్రీనీవాను రూ.100 కోట్లతో ఎలా పూర్తి చేస్తారని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నించారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ, పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులు బి.ఎర్రిస్వామిరెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవసరమైనన్ని నిధులు కేటాయించకుండా ఏడాదిలో హంద్రీ-నీవాను పూర్తి చేస్తామని మంత్రులు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. హంద్రీ-నీవా పూర్తి చేయడానికి ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయని వాటిని అవరోధించడానికి కనీసం రెండు సంవత్సరాల కాలం పడుతుందన్నారు. రెండో దశ నిర్మాణం పూర్తి కావడానికి రూ. 1700లు కోట్ల రూపాయలతో పాటు.. పెరిగిన ధరలతో కాంట్రాక్టు పనులు చేపట్టడానికి మరో రూ. 300 కోట్లు కలిపితే మొత్తం రూ. 2 వేల కోట్లు ప్రాజె క్టు నిర్మాణానికి కావాలన్నారు.
హంద్రీ-నీవాకు అవసరమయ్యే భూసేకరణ పనులకే సంవత్సరం పాటు పడుతుందన్నారు. రాప్తాడు, బుక్కపట్నం, పెనుకొండ, ప్రాంతాల్లో, హంద్రీ-నీవా కోసం 500 నుండి 600 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. అటవీశాఖ అనుమతులు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు. అయితే.. ఇంత వరకు దానిపై ఏలాంటి చర్చ జరగలేదన్నారు. చంద్రబాబు తన 9 ఏళ్ల పాలనలో తాగునీటి కోసం హంద్రీ-నీవాకు 2 నుంచి 3 కోట్లు ఖర్చు చేసి చేతులేత్తేశాడన్నారు. 2004లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దివంగత ముఖ్యమంత్రి కరవు ప్రాంతాల రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా హంద్రీ-నీవాను పూర్తి చేసి సాగునీరు అందించి ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని ఒక సంకల్పానికి శ్రీకారం చుట్టారన్నారు.
వెనువెంటనే హంద్రీ-నీవా నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించి సుమారు రూ.5,600 కోట్లు ఖర్చు చేసి పనులను వేగవంతంగా చేపట్టారన్నారు. అలాగే జీడిపల్లి రిజర్వాయర్ ద్వారా జిల్లాలోని ప్రధాన చెరువులకు నీళ్లు అందించిన ఘనత మహానేతకే దక్కిందన్నారు. ఈరోజు పీఏబీఆర్ నుండి ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాలలోని చెరువులకు నీళ్లు వచ్చాయి అంటే... అది వైఎస్ చలవేనన్నారు. ఇలాంటి ప్రాజెక్టును హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ హంద్రీ-నీవా తన తండ్రి ఎన్టీఆర్ మానసపుత్రిక అనడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికే రెండో దశలో కూడా 70 శాతం పనులు పూర్తి కావచ్చయని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో పలు ప్యాకేజీలకు సంబంధించి కోర్టులో సమస్య కొనసాగుతోందన్నారు.
కోర్టులో పెండింగ్‌లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుయాయుల కోసం ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. కోర్టులో కొనసాగుతున్న పలు ప్యాకేజీలకు సంబంధించిన పరిష్కారం కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఇన్ని అవరోధాలు దాటుకుని ఏడాది లోగా హంద్రీ-నీవా పూర్తి చేస్తామని ఈ మంత్రులు ఎలా అపద్ధాలు చెప్పగల్గుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే నికర జలాలు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. నీటి కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకుండా.. తమ మంత్రుల ఆర్థిర పరపుష్టికి పునాదులు వేసేందుకు పట్టిసీమ, ఎత్తిపోతల పథకానికి రూ. 1150 కోట్లు కేటాయించడం బాధకరమన్నారు. పోలవరాన్ని పూర్తి చేయకుండా, శ్రీశైలం ప్రాజెక్టు నుండి సీమ ప్రాంతానికి నీళ్లు రాకుండా చంద్రబాబు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు.
ఈ సమావేశంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సోమశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నరేంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ధనుంజయ యాదవ్, అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, మహిళ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి, విభజన విభాగం నగర అధ్యక్షుడు మారుతి నాయుడు, కణేకల్ లింగారెడ్డి పాల్గొన్నారు.
సీమ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఏదీ!
Published Thu, Mar 5 2015 2:04 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement