తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో హైదరాబాద్‌లో నివాసముంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవు పెడితే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు నిర్ణయించాయి.
19న సాధారణ సెలవు పెడితే ఓకే
Published Thu, Aug 14 2014 3:28 AM | Last Updated on Sat, Aug 11 2018 7:54 PM
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో హైదరాబాద్‌లో నివాసముంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవు పెడితే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు నిర్ణయించాయి. అయితే ఆ రోజున ప్రత్యేకంగా ఉద్యోగులకు సెలవు ప్రకటించడం మాత్రం సాధ్యపడదని ప్రభుత్వం అభిప్రాయపడింది. 19న నిర్వహించే కుటుంబ సర్వేకు హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సైతం వివరాలు అందజేయాల్సి ఉంటుందని, లేనిపక్షంలో భవిష్యత్తులో వారు ఇబ్బందులకు గురయ్యే వీలుందని, అందువల్ల సెలవు కోరిన వారికి మంజూరు చేయాలని నిర్ణయించినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తిగతంగా సాధారణ సెలవు పెడితే అనుమతించనున్నారు. అయితే 18వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలున్నందున చాలామంది ఉద్యోగులు 19న సాధారణ సెలవుకు దరఖాస్తు చేసుకుంటే ఇబ్బందేనని, అయినప్పటికీ తప్పదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆంధ్ర సర్కార్ 19న సెలవు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల 19న తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సామాజిక సర్వే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అక్కడి ఉద్యోగులకు సెలవు ప్రకటించి సర్వేకు సహకరించాలని టీఎన్జీఓ నేత, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ప్రభుత్వ పథకాలు అసలైన లబ్ధిదారులకు అందేందుకు ఆంధ్ర ప్రభుత్వం సహకరించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం నిజమైన పేదలను గుర్తించేందుకు సర్వేను నిర్వహిస్తుంటే, దీనిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఫిర్యాదు చేయడం ఏమిటి? అని ప్రశ్నించారు. బుధవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.
Advertisement
Advertisement