ఒంగోలు: జిల్లాలో రైతాంగమే కాదు...అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతులు, సామాన్య ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వైఎస్సార్‌సీపీ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు యంవీఎస్ నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డిలు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వివరాలతో కూడిన నివేదిక అందజేశారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జోన్-1 పరిధిలో అనధికార ఆయకట్టు లక్ష ఎకరాలకుపైగా ఉండడంతో జోన్-2 పరిధిలోని ప్రకాశం భూములకు నీరందడం లేదన్నారు. యద్దనపూడి, నూతలపాడు, పమిడిపాడు మేజర్ల పరిధిలో 80 వేల ఎకరాలకు నేటికీ నీరు ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.4 వేల కోట్లు అవసరం కాగా కేవలం రూ.70 కోట్లు మాత్రమే కేటాయించడం, గుండ్లకమ్మ ప్రాజెక్టు పునరావాస నష్టపరిహారం పంపిణీ పట్ల నిర్లక్ష్యం, ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడం చూస్తుంటే మాటలు చెప్పడమే కానీ పనులు మాత్రం పూర్తయ్యే దాఖలాలు లేవన్నారు.
జిల్లాలోని కోల్డు స్టోరేజీల్లో 17.33 లక్షల క్వింటాళ్ల శనగలు నిల్వ ఉన్నాయని, వాటిని మద్దతు ధరకు కొంటామంటూ ఆర్భాటంగా మార్కెటింగ్ శాఖ ప్రకటించినా ఆచరణలో విఫలమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కనిగిరి ప్రాంతంలో 18 వేల ఎకరాల్లో నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ జోన్‌ను మంజూరు చేసిందని, కానీ నేటికీ దాని నిర్మాణంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. రామాయపట్నం పోర్టు సాధ్యమైతే ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఆర్థిక స్వరూపం మారిపోతుందని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రామాయపట్నం పోర్టు సాధించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేశామన్నారు.
జిల్లాలో 2010 నుంచి 2013 వరకు లైలా, జల్, థానే, నీలం వంటి తుఫానులతోపాటు భారీ వర్షాలు కూడా కురిశాయన్నారు. వీటికి సంబంధించి జిల్లా రైతాంగానికి ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందజేస్తామని ప్రకటించిన రూ.57.91 కోట్లు నేటికీ అందకపోవడం బాధాకరంగా ఉందన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు, ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తమ నివేదికలో వివరించినట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు యంవీఎస్ నాగిరెడ్డి, మారెడ్డి సుబ్బారెడ్డి తెలిపారు.
సాగునీరు అందడం లేదు
Published Tue, Nov 25 2014 2:06 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement