ముందుకు సాగని మరుగుదొడ్ల నిర్మాణాలు
►గుంటూరు రీజియన్‌లో మంజూరు చేసినవి 4,01,354
►ప్రారంభానికి నోచుకోనివి : 2,09,675
►పూర్తయినవి : కేవలం 55,175 మాత్రమే
కారణాలు..
►చాలీచాలని సొమ్ము.. స్థల సమస్య.. ఇసుక లభ్యత లేకపోవడం
►క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపం... బిల్లుల చెల్లింపులో జాప్యం
సాక్షి, గుంటూరు : ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పని సరిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటోంది. ఇందులో భాగంగా మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ, నిర్మల్ భారత్ అభియాన్ పథకాల కింద ప్రభుత్వం మరుగుదొడ్లు మంజూరు చేసింది. క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడి నిర్మాణాలు ముందుకు సాగడంలేదు. లబ్ధిదారులను చైతన్యపరచి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రభుత్వం మాత్రం ఈ నెల 31వ తేదీ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణాలను చూస్తే గడువులోగా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
►రీజియన్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 4,01,354 వ్యక్తిగత మరుగు దొడ్లు మంజూరు చేసింది. ఇప్పటికీ 55,175 మాత్రమే పూర్తయ్యాయి. దాదాపు 2,09,675 మరుగుదొడ్లు అసలు ప్రారంభమే కాలేదు.
►మరుగుదొడ్ల నిర్మాణాలకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. దీంతో కొన్నిచోట్ల నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోతున్నాయి.
►నగరాలు, పట్టణాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు స్థల సమస్య అడ్డంకిగా మారుతోంది.
►ప్రభుత్వం ఇచ్చే రూ.పదివేలు సరిపోక కొన్ని చోట్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఇసుక లభ్యత లేకపోవడం కూడా సమస్యగా మారింది.
► క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇలాంటి ఇబ్బందులను పరిష్కరించడంలో డ్వామా, డీఆర్‌డీఏ, ఆర్‌డబ్ల్యూస్ అధికారులు విఫలమవుతున్నారు.
►మరుగుదొడ్ల నిర్మాణ విలువ పెంపు విషయమై ఆలోచిస్తున్నామని అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నప్పటికీ దీనిపై ఇంత వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు.
సొమ్ముల్లేక చతికిల..
Published Fri, Aug 15 2014 1:48 AM | Last Updated on Mon, Oct 8 2018 7:16 PM
Advertisement
Advertisement