ప్రోత్సాహం ఏదీ? | Education Department Not Encourage Inspire Science Fair | Sakshi
Sakshi News home page

ప్రోత్సాహం ఏదీ?

Published Wed, Aug 14 2019 10:40 AM | Last Updated on Wed, Aug 14 2019 10:58 AM

Education Department Not Encourage Inspire Science Fair - Sakshi

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక వెలికి తీయాలి. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలి. నిరంతరం పుస్తకాలతో కుస్తీ సరికాదు. అందుకు అనుగుణంగా ఆనందవేదిక...  నోబ్యాగ్‌ డే వంటివాటిని సర్కారు ఎంతగానో ప్రోత్సహిస్తోంది. కానీ కేంద్రమా నవ వనరుల శాఖ చేపడుతున్న ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ప్రదర్శన పోటీలపై మాత్రం  పాఠశాలలనుంచి ప్రోత్సాహం కరువవుతోంది. గత ప్రభుత్వ హయాంలోనే దానిపై చిత్తశుద్ధి కొరవడింది. ఇప్పుడు ప్రోత్సహించే సర్కారు ఉన్నా... వాటిని వినియోగించుకోవడంలో ఎందుకో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.

విజయనగరం అర్బన్‌: తరగతి గదిలోని విద్యార్థి ఆలోచనకు గుర్తింపు తేవాలంటే ఉపాధ్యాయుల ప్రోత్సాహం తప్పనిసరి. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుల ప్రేరణ తోడయితే వారు రూపొందించే ఆవిష్కరణలకు  కేంద్ర మానవ వనరుల శాఖ చేపడుతున్న ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ప్రదర్శనల జాతీయ స్థాయిలో పోటీలపై జిల్లా పాఠశాల నిర్వాహకులు శ్రద్ధ చూపటం లేదనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా నుంచి ఈ పోటీలకు ప్రతి ఉన్నత, ప్రాధమికోన్నత పాఠశాల నుంచి నమూనాలు రావాలనే నిబంధన పాటించడంలో జిల్లా విద్యాశాఖ విఫలమయింది. అందుకే గత రెండేళ్లుగా అత్యల్ప సంఖ్యలో జిల్లా నుంచి పోటీలకు వెళ్లాల్సివస్తోంది.

ప్రస్తుత సర్కారు ప్రోత్సహిస్తున్నా...
విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను వెలికి తీయడానికి ప్రస్తుత ప్రభుత్వ అధికంగా ప్రాధాన్యమిస్తోంది. అందులో భాగంగానే పాఠశాల విద్యలో పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ఆనందవేదిక, బ్యాగ్‌కు సెలవు, అలా, రా (ఆర్‌ఏఏ), ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ప్రదర్శన వంటి పోటీలు పాఠ్యాంశాలతో పాటు ప్రవేశ పెట్టారు. చిన్నారుల్లో మొలకెత్తిన ఆలోచనలు సాకారం చేసుకునే వేదికే ‘ఇన్‌స్పైర్‌’. ఏటా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సమాజానికి భావి శాస్త్రవేత్తలను అం దించే గురుతర బాధ్యత పడకేసింది. ఎంతో ఉ న్నత ఆశయంతో చేపట్టిన ఈ ప్రక్రియపైప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయుల్లో నిర్లక్ష్యంనెలకొం ది. ఫలితంగా విద్యార్థుల శాస్త్ర విజ్ఞాన ఆలోచనలు నాలుగు గోడలకే పరిమితం అవుతున్నాయి.

వేలల్లో అర్హులు... వందల్లోనే ప్రతిపాదనలు..
జిల్లాలోని అన్ని యాజమాన్య పరిధిలోని 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు నమూనాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలో ఉన్న 3,441 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 920 ఉన్నత, ప్రాధమికోన్న పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో లక్ష 30 వేల మంది విద్యార్థులు 6 నుంచి 10వ తరగతి చదువుతున్నారు. స్కూల్‌కి ఐదు నమూనాలతో సుమారు 5 వేల మంది విద్యార్థుల వివరాలు నమోదు చేయాల్సి ఉన్నా... ఈ ఏడాదికి ఇప్పటివరకు 308 స్కూళ్ల నుంచి కేవలం 1,205 మంది వివరాలు మాత్రమే నమోదు చేశారు. గత రెండేళ్లలో కూడా ఇదే నిర్లక్ష్యంతో గడువు చివరి తేదీలలో 1,250, 1,600 సంఖ్యలో విద్యార్థులు నమూనాలు అన్‌లైన్‌లో పంపారు. అయితే వాటిలో తొలి ఏడాది 54, గత ఏడాది 48 నమూనాలు మాత్రమే పోటీ ప్రదర్శనలకు ఎంపికయ్యాయి.  జాతీయ స్థాయిలో జరిగే ఈ ఎంపిక ప్రక్రియలో ప్రకటన వెలువడిన తొలి తేదీల్లో వచ్చినవాటికే ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో జిల్లా నుంచి చివరి తేదీల్లో నమోదు కావడం కారణంగా ఎంపిక సంఖ్య తగ్గిందనే వాదన లేకపోలేదు. గత నెల 31వ తేదీలోగా ఇన్‌స్పైర్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఉపాధ్యాయుల నుంచి జాతీయ స్థాయిలో స్పందన లభించకపోవడంతో ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచారు. అయినా ఫలితం కన్పించడం లేదు.

ప్రతి నమూనాకు రూ.10 వేలు..
ఉపాధ్యాయులు విద్యార్థుల ఆలోచనకు తమ వంతు సహకారం అందించి ఆన్‌లైన్‌లో ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంది. ఎంపికైన ప్రతి ప్రాజెక్టుకు రూ.10 వేలు మంజూరవుతుంది. ఆ నిధులతో నమూనాకు అవసరమైన పరికరాలు సమకూర్చుకోవచ్చు. జిల్లా స్థాయిలో నిర్వహించే ఇన్‌స్పైర్‌ పోటీ ప్రదర్శనకు హాజరుకావడానికి అవసరమైన చార్జీలు వెచ్చించుకునే వెసులు బాటు ఉంది. విద్యార్థుల ఆలోచనల ఆవిష్కరణను ‘ఇన్‌స్పైర్‌అవార్డ్స్‌డీఎస్‌టీ.జీఓవి’వెబ్‌ సైట్లో నమోదు చేస్తే ఎంపికైన ప్రతి ప్రాజెక్టుకు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయి.

పెంచిన గడువు వినియోగించుకోవాలి..
జిల్లాలో ఇంతవరకు 308 స్కూళ్ల నుంచి 1,205 మంది విద్యార్థులు నమూనాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. గతేడాది 1,250 మంది నమోదు చేసుకుంటే కేవలం 54 మాత్రమే ప్రదర్శన పోటీకి ఎంపికయ్యా యి. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే క్షేత్రస్థాయిలో సైన్స్‌ ఉపాధ్యాయులకు అవగాహన కలిగించాం. ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఉపాధ్యాయులు దానిని ఉపయోగించుకోవాలి.          
  – కె.సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్‌ కో–ఆర్డినేటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement