పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో నోటాకు చోటు కల్పించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాలెట్ పత్రాలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఇది పెద్ద తలనొప్పేనని నాయకులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఏప్రిల్‌లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నోటాకు కొన్ని ప్రధాన పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు రావడమే దీనికి కారణం. ఇప్పటివరకు ఈవీఎంలలో మాత్రమే నోటాకు చోటు ఉండేది. ఇప్పుడు బ్యాలెట్ పత్రాలలోనూ ఇది ప్రత్యక్షం కానుంది. అభ్యర్థుల ఎన్నికల గుర్తులు తరువాత ఈ నోటా గుర్తు ఉంటుంది. పోటీ చేసే వారు ఎవరూ నచ్చకపోతే ఈ గుర్తుకుఓటు వేయొచ్చు. ఇప్పటివరకు గత్యంతరం లేక ఎవరో ఒకరి వైపు ఓటర్లు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు నోటా ఉండడంతో దానిని ఉపయోగించుకోవడం వల్ల తమకు ఇబ్బందేనని నాయకులు చెబుతున్నారు. ఇది ఒక్కోసారి జయాపజయాలను నిర్దేశించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలకంటే ఎక్కువగా
♦ గత సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్లను పరిశీలిస్తే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల కంటే ఎక్కువ వచ్చాయి. దీంతో ఆ పార్టీల అభ్యర్థులు కంగుతిన్నారు.
నియోజకవర్గాల వారీగా నోటాకు పోలైన ఓట్లు ఇలా..
♦ కొవ్వూరులో 2165, నిడదవోలులో 1693, ఆచంటలో 1453, పాలకొల్లులో 1170, నరసాపురంలో 1143, భీమవరంలో 1492, ఉండిలో 1885, తణుకులో 1885, ఉంగుటూరులో 2321, దెందులూరులో 2546, ఏలూరులో 1524, గోపాలపురంలో 3998, పోలవరంలో 6004, చింతలపూడిలో 3477 ఓట్లు నోటాకు పోలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment