సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అన్యాయం జరిగిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. బడ్జెట్ ప్రసంగం అనంతరం వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.
ఏపీకి ఒరిగిందేమీ లేదు: వైవీ సుబ్బారెడ్డి
2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పెదవి విరిచారు. ఏపీకి సంబంధించి బడ్జెట్‌లో ఒరగబెట్టిందేమీ లేదని ఆయన
విమర్శించారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... ‘బడ్జెట్ చూసి నిరాశకు గురయ్యాం. విభజన చట్టంలోని హామీలు అమలవుతాయని ఆశించాం. కానీ అమలు కాలేదు. ప్రత్యేక హోదా లేక పరిశ్రమలు ఒక్కటీ రాలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు మీద క్లారిటీ ఇవ్వలేదు. విశాఖ రైల్వే జోన్ ప్రస్తావనే రాలేదు. దుగరాజపట్నం 2018 పూర్తి చేసి ఇవ్వాలని ఉంది.. పట్టించుకోలేదు. అయితే రైతులకు మద్ధతు ధరను 1.5 రెట్లు పెంచుతామని చెప్పిన హామీ కొంచెం ఊరట కల్పించింది.
2005లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి పూనుకోవడం సంతోషించాల్సిన విషయం. రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయమే అయినా ఏపీకి సంబంధించి ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం అవుతోంది. మహిళలకు కొంతమేరకు చొరవ చూపింది. స్వయం సహాయ సంఘాలకు మేలు చేసేదిగా ఉన్నా.. ఇవన్నీ దివంగత మహానేత వైఎస్‌ఆర్ అద్భుతంగా ఆచరించి చూపించారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించకపోవడం చాలా దారుణం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే అన్న మాట ప్రకారం రాజీనామా చేయడానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. మేం రాజీనామా చేస్తే ఇప్పుడే ప్రత్యేకహోదా వస్తుందంటే మే సిద్ధమే. కేంద్రంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ దీనిపై సమాధానం చెప్పాలి. రుణమాఫీపై క్లారిటీ వస్తుందని దేశవ్యాప్తంగా రైతులు ఎదురు చూశారు. కానీ ఎలాంటి ప్రకటన రాలేదు.’ అని అన్నారు.
బడ్జెట్‌లో ఏపీ గురించి ప్రస్తావనే లేదు: విజయసాయి రెడ్డి
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావనే లేదని వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వెనుకడుగు వేశారని ఆయన ఆక్షేపించారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విజయసాయి రెడ్డి స్పందిస్తూ, విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ స్పష్టత లేదని, రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండా, అది లాభదాయకం కాదంటూ తప్పించుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఆసక్తి ప్రదర్శించకపోవడం బాధాకరమన్నారు.
పునర్విభజన చట్టంలో షెడ్యూల్ 13లో 11 కేంద్రత ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, అయితే ఇంతవరకు రెండు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన నివేదిక ప్రకారం 9 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయాలంటే రూ. 11,267 కోట్లు నిధులు అవసరం అవుతాయని అన్నారు. గత నాలుగేళ్లలో జరిగిన కేటాయింపులు చూస్తే 421 కోట్లు మాత్రమే ఇచ్చారని, ఇలాగైతే అభివృద్ధి ఎలా జరుగుతుందని నమ్మగలమని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి రాబోయే సమావేశాల్లో చట్టం తీసుకొస్తామని చెప్పారని, 70 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని, కానీ లెక్కలు చూస్తే మాత్రం నిరాశాజనకంగా ఉన్నాయని సాయిరెడ్డి అన్నారు.
గడిచిన మూడేళ్లలో జరిగింది కూడా ఏమీలేదని, పైగా 1.2 శాతం తగ్గుదల కనిపించిందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటే.. చాలా ఊహించుకున్నారనీ, ఇప్పుడున్న కనీస మద్ధతు ధర చూస్తే పెట్టుబడులకు కూడా చాలడం లేదని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే దిగుబడిని పెంచుతామని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారని, ఇప్పుడేమో 1.5 శాతం అంటున్నారన్నారు. ఇప్పుడున్న మద్ధతు ధరలు చూస్తే కనీసం పెట్టుబడికి కూడా సరిపోవడం లేదన్నారు. రాబోయే ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలంటే కనీసం మద్ధతు ధర 20 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. అప్పటికి గానీ 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతల ఆదాయాన్ని చూడగలమని సాయిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment