సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో మద్యాన్ని తెగతాగేస్తున్నారు. అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాదిలో జూలై వరకు రూ.504 కోట్లకు పైగా జరిగిన మద్యం అమ్మకాలే ఇందుకు నిదర్శనం. ఈ అమ్మకాలు ఈ ఏడాది సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. కాగా విక్రయాలు జోరందుకోవడంతో జిల్లాలో ప్రస్తుతమున్న మద్యం షాపులకు తోడు కొత్తగా మరో పది దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో లెసైన్సు అమ్మకం కాని దుకాణాలను మెదక్ జిల్లాలో అత్యధికంగా మద్యం అమ్మకాలున్న చోటుకు బదిలీ చేశారు.
ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు కలెక్టర్ శనివారం 36 దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మద్యం దుకాణాల లెసైన్స్‌ల కోసం వ్యాపారులు పోటీపడనున్నారు. వచ్చే ఏడు నెలల కాలానికి జిల్లాలో 36 మద్యం షాపులకు లెసైన్సుల జారీకి ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18 మద్యం దుకాణాలకు రూ.60,66,667 లెసైన్సు ఫీజుగా నిర్ణయించారు. మిగతా దుకాణాలకు ఆయా ప్రాంతాలను బట్టి రూ.24.50 లక్షల నుంచి రూ.18.95 లక్షల వరకు లెసైన్సు కోసం చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో 67 మద్యం దుకాణాలకు గాను జీహెచ్‌ఎంసీ పరిధిలో ఫీజు ఎక్కువగా ఉండటంతో 2012 జూలైలో నిర్వహించిన డ్రాలో 19 దుకాణాల లెసైన్సుల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు. యేడాదికోమారు వ్యాపారులు లెసైన్సు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. 2013 జూలైలో మరో ఏడుగురు లెసైన్సు దారులు రెన్యువల్‌కు ముందుకు రాలేదు.
దీంతో జిల్లాలో ప్రస్తుతం 26 మద్యం దుకాణాలకు లెసైన్సులు జారీ చేయాల్సి ఉంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో వేలం పాటకు నోచుకోని మరో పది దుకాణాలను పునర్వ్యవస్థీకరణలో భాగంగా మెదక్ జిల్లాకు కేటాయించారు. లెసైన్సు ఫీజుతో పోలిస్తే ఏడు రెట్లు మద్యం అమ్మకాలు (టర్నోవర్) సాగిన చోట కొత్త దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మొత్తంగా జిల్లాలో 36 మద్యం దుకాణాలకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. సంగారెడ్డి, సిద్దిపేట, రామాయంపేట, గజ్వేల్, మిరుదొడ్డి, అందోలు తదితర ప్రాంతాల్లో కొత్త దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.
రూ.700 కోట్లకుపైగా అమ్మకాలు?
గత ఏడాది జిల్లాలో రికార్డు స్థాయిలో రూ.504.22 కోట్ల విలువ చేసే మద్యం అమ్మకాలు జరిగాయి. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అమ్మకాలు రూ.770 కోట్లు దాటే అవకాశముందని మద్యం వ్యాపారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఏడు పర్యాయాలు నోటిఫికేషన్ జారీ చేసినా లెసైన్సు ఫీజు అధికంగా ఉందనే సాకుతో వ్యాపారులు ఎవరూ ముందుకు రాలేదు. లెసైన్సు అమ్మకాలు జరగని చోట ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నిర్వహిస్తామని ప్రకటించినా ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటయ్యే పది మద్యం దుకాణాలకు తీవ్ర పోటీ ఉంటుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.
‘ఫుల్’గా.. తాగుతుండ్రు!
Published Sun, Dec 1 2013 1:44 AM | Last Updated on Tue, Aug 21 2018 12:21 PM
Advertisement
Advertisement