సాక్షి, హైదరాబాద్: హైస్పీడ్ రైళ్లుగా పేరుగాంచిన శతాబ్ది, దురంతో, రాజధాని రైళ్లలో భోజనం ధర మరింత ఖరీదు కానుంది. తరగతుల వారీగా భోజనం ధరలను రైల్వే బోర్డు తాజాగా సవరించింది. గురువారం నుంచే కొత్త ధరలు అమల్లోకి రానున్నట్టు రైల్వేవర్గాలు తెలిపాయి. మొదటి తరగతి ఏసీ, ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో బ్రేక్‌ఫాస్ట్ ధర 35 శాతం, లంచ్, డిన్నర్ రేట్లు 15 శాతం పెరగనున్నాయి. రెండవ తరగతి ఏసీ, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్‌లో బ్రేక్‌ఫాస్ట్ 60 శాతం, లంచ్, డిన్నర్ 50 శాతం మేర పెరగనున్నాయి. పెరిగిన భోజనం ధరలు పాత ధరలతో పోల్చితే ఒక్కొక్క దానికి రూ.25 నుంచి రూ. 27 వరకు ఉంటుందని అంచనా. అయితే, టీ ధరలను మాత్రం తగ్గించారు. రెండవ తరగతి ఏసీ, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్‌లలో ఉదయం టీ ధర 40 శాతం, సాయంత్రం టీ ధర 10 శాతం మేర తగ్గించారు. రైల్వే బోర్డు అఖరిగా 1999లో భోజనం ధరలను పెంచింది.