అయ్యో హనీఫ్‌! | NTR Health Scheme Stopped in Andhrapradesh | Sakshi
Sakshi News home page

అయ్యో హనీఫ్‌!

Published Thu, Dec 20 2018 1:37 PM | Last Updated on Thu, Dec 20 2018 1:37 PM

NTR Health Scheme Stopped in Andhrapradesh - Sakshi

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హనీఫ్‌ ,భార్యతో హనీఫ్‌(ఫైల్‌)

ఈ ఫొటోలోని వ్యక్తి పేరు ఎస్‌కే హనీఫ్‌. ఇతను పూల దుకాణంలో పనిచేస్తూ తల్లిదండ్రులతోపాటు భార్య, ఇద్దరు చిన్న పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పనులు ముగించుకుని స్నేహితునితో కలసి బైక్‌పై ఇంటికి వెళుతుండగా ఆటోను ఢీకొన్న ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. దీంతో అతనిని హుటాహుటిన గూడూరులోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో నెల్లూరు నారాయణ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడికెళ్లాక దీనికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, కానీ ఖర్చుల నిమిత్తం రోజుకు రూ.5 వేలు కట్టాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. దీంతో తమను, తమ కుటుంబాన్ని దివంగత మహానేత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఆదుకుందని ఆ కుటుంబంతోపాటు, వారి బంధువులు సైతం భావింంచారు. అయితే ఐదో రోజున వైద్యులు వారి వద్దకు వచ్చి ఇకపై ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయలేమని, రోజుకు రూ.20 వేల వంతున చెల్లించాలని తెలిపారు. గాయపడ్డ హనీఫ్‌ను స్పెషల్‌ వార్డు నుంచి బయటకు పంపేశారు. మొత్తం చెల్లించకుంటే ఆస్పత్రి నుంచే పంపేయాల్సి వస్తుందని, దీనికి మేమేం చేయలేమని చేతులెత్తేశారు. దీంతో ‘అయ్యో భగవంతుడా.. ఇప్పుడేం చేయాలంటూ’ అతని భార్య సుమేరా తన ఐదేళ్ల జాస్మిన్, రెండేళ్ల ఇమ్రాన్‌లను దగ్గరకు తీసుకుని బోరున విలపించింది. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం ఆపేయడంతో ఇలా ఒక్క హనీఫ్‌ మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల కుటుంబాలు తమవారిని కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఇలా పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించిన దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి బతికుంటే మాకు ఈ బాధలు ఉండేవి కాదని ఆ కుటుంబం కన్నీరుపెట్టుకుంది.

నెల్లూరు, గూడూరు: దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేదల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో అంపశయ్యపైకి చేర్చింది. కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలకు ప్రభుత్వం రూ.500 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. దీంతో యాజమాన్యాలు విధిలేని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలను ఈ నెల 17వ తేదీ నుంచి నిలిపివేస్తున్నామంటూ తేల్చి చెప్పేశారు. అత్యవసరమైన కీమో, డయాలసిస్‌ మినహా అన్ని సేవలూ ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన రాష్ట్రంలోని లక్షల కుటుంబాలకు పిడుగుపాటైంది. ఈ క్రమంలో గూడూరు పట్టణ సమీపంలోని ఎస్‌కే హానీఫ్‌ కుటుంబాన్ని నిలువునా కూల్చేసింది. వైద్యానికి అయ్యే మొత్తాన్ని చెల్లించలేక, కుటుంబ భారాన్ని మోసే వ్యక్తిని పోగొట్టుకోలేక, భార్యాపిల్లలతోపాటు, వారి బంధువుల సైతం కుంగిపోతున్నారు. గూడూరు పట్టణ సమీపంలో ఇందిరానగర్‌ ప్రాంతంలో పూలదుకాణంలో పనిచేసే ఎస్‌కే హనీఫ్‌ భార్య సుమేరాతోపాటు తన ఇద్దరు పిల్లలు జాస్మిన్, ఇమ్రాన్‌లతో కలసి జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీ రాత్రి పనులు పూర్తి చేసుకుని స్నేహితుడు కరీముల్లాతో కలసి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. మలుపు తిరుగుతుండగా ఆటోను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో హనీఫ్‌ వెనక్కుపడిపోయాడు. దీంతో అతని తలకు బలమైన గాయమైంది. దీంతో హుటాహుటిన 108లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు హనీఫ్‌ మెదడుకు గాయమైందని, వెంటనే నెల్లూరుకు తీసుకెళ్లాలని సూచించారు. నెల్లూరులోని నారాయణ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి చిన్న మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నరాలు దెబ్బతిన్నాయని, వైద్యానికి రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో వారు తమకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని తెలిపగా వైద్యులు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, కానీ ఇతర ఖర్చుల నిమిత్తం రోజుకు రూ.5 వేల వరకూ అవుతుందని తెలిపారు. హనీఫ్‌ తల్లిదండ్రులు, బంధువులతోపాటు ఇరుగుపొరుగు వారు సైతం ఎలాగోలా అప్పులు చేసి ఆ మొత్తాన్ని చెల్లిస్తామని నిర్ధారణకు వచ్చారు. ఇలా నాలుగు రోజులు గడిచింది.

పిడుగులాంటి వార్త
కార్పొరేట్‌ ఆస్పత్రులు ఆదివారం ప్రకటించిన పిడుగులాంటి వార్త ఆ కుటుంబాన్ని నిలువునా కుప్పుకూలేలా చేసింది. ఈ మేరకు సోమవారం ఆస్పత్రి సిబ్బంది హనీఫ్‌ భార్య వద్దకు వచ్చి ‘ఆరోగ్యశ్రీని నిలిపివేశారని.. ఇకపై రోజుకు రూ.20 వేలు చెల్లించాలని.. ఏమాత్రం ఆలస్యం చేసినా బయటకు పంపేస్తామని’ చెప్పారు. దీంతో వారంతా బోరున విలపిస్తూ ఏం చేయలో దిక్కుతోచక దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలో మంగళవారం రూ.20 వేలు చెల్లించలేదని హనీఫ్‌ను ఐసీయూ నుంచి బయటకు పంపేశారు. విషయం తెలుసుకున్న బంధువులు దొరికినచోటల్లా అప్పులు చేసి, ఇరుగుపొరుగు వారు కొంత చందాలు వేసుకుని ఎలాగోలా రూ.20 వేలు సర్దుబాటు చేశారు. అలా వారు మొత్తం చెల్లిస్తేనే అతనిని ఐసీయూలోకి తీసుకెళ్లారని,  రోజు గడిస్తే రూ.20 వేలు ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ వారంతా ఏమీ చేయలేని దయనీయ స్థితిలో ఉండిపోయారు. హనీఫ్‌ తండ్రి అమీర్‌జాన్‌కి మూడేళ్ల క్రితమే కాలు తీసేశారు. దీంతో ఆయన ప్రస్తుతం ఏపనీ చేయలేని స్థితిలో ఉన్నాడు. హనీఫ్‌ పనిచేస్తేనే ఆ కుటుంబం ఆకలి తీరేది. ఈ క్రమంలో రోజుకు రూ.20 వేలు తీసుకురాలేక.. చూస్తూ చూస్తూ తమ బిడ్డను పోగొట్టుకోలేక వారు పడుతున్న వేదన వర్ణనాతీతంగా ఉంది. తమలాంటి పేదలకు సంజీవనిలా ఉన్న ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం ఎందుకిలా చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను కాపాడుకోవాలంటే అది తమ వల్ల అయ్యే పనికాదని, పేదలపై ఈ ప్రభుత్వానికి ఎందుకింత చిన్న చూపని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. దాతలు ముందుకొచ్చి తమ బిడ్డను ఆదుకోవాలని హనీఫ్‌ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement