ntr health service trust
-
మంచానపడ్డ ఉచితవైద్యం
పశ్చిమగోదావరి, భీమవరం : పేదోడి జబ్బుకు ప్రభుత్వమే వైద్యం చేస్తుందంటూ రాజన్న ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ వైద్యసేవగా పేరుమార్చి నీరుగారుస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా పేదోడికి అందాల్సిన ఖరీదైన వైద్యం మంచానపడింది. బకాయిలు పేరుకుపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రుల్లో (ప్రైవేటు ఆస్పత్రులు) అందుతున్న వైద్యసేవలు ఈనెల 1వ తేదీ నుంచి పూర్తిగా మూతపడ్డాయి. గడిచిన నాలుగున్నరేళ్లుగా పడుతూ లేస్తూ అందుతున్న వైద్యసేవలను జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు యాజ మాన్యాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సేవలు నిలిపేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న కొద్దిపాటి సేవలు అందుతుండగా ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం గుండెకు సంబంధించిన అత్యవసర సేవలు మాత్రమే అందిస్తున్నారు. ఐదు ఆసుపత్రుల్లో నిలిచిన వైద్య సేవలు జిల్లాలో 35 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు సౌకర్యం ఉంది. జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలుపుదల చేసిన ఆసుపత్రులు తణుకులోని యాపిల్, సుధ, సాయిశ్వేత, శ్రీసాయి ఆసుపత్రులు, ఏలూరులోని ఆంధ్రా హాస్పిటల్‌ల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేశారు. అత్యవసర కేసులే తప్ప సాధారణ కేసులను చూడడం లేదు. ఈ ఆసుపత్రులకు తెల్లరేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారు వెళ్లినా వారికి వైద్యం అందడం లేదు. చేతిలో సొమ్ము లేక ఆస్పత్రులలో వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో మిగిలిన అన్ని ఆసుపత్రుల్లోనూ ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. అదే జరిగితే జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు వైద్య సేవలు అందక విలవిలాడే పరిస్థితి వస్తుంది. జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం ఉన్న ఆసుపత్రులకు ప్రతి రోజు 30 నుంచి 40 వరకు ఓపీ (వైద్యం కోసం వచ్చేవారు), అత్యవసర కేసులు ఇద్దరు నుంచి నలుగురికి వైద్యం అందుతోంది. ప్రభుత్వం ఆయా ఆసుపత్రులకు 6 నెలలుగా బిల్లులు చెల్లించకపోయినా వారు ఎన్టీఆర్ వైద్య సేవలు అందించారు. రూ. 50 కోట్లపైగా బిల్లులు పెండింగ్ జిల్లాలో 35 ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా అందుతున్న ఎన్టీఆర్ వైద్యసేవలకు సంబంధించి ఆయా ఆస్పత్రులకు సుమారుగా రూ. 50 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్ పడినట్లు తెలుస్తోంది. వైద్యవిధాన పరిషత్ పరిధిలోని ఏలూరు జిల్లా ఆస్పత్రి, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అందుబాటులో ఉన్న వైద్యులతో ఆర్థో, జనరల్ సర్జన్, ఈఎన్టీ, పీడియాట్రిక్ వైద్యసేవలు అందిస్తున్నారు. ఖరీదైన యూరాలజీ, కార్డియాలజీ, న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ, నేత్రాలు, పళ్లు, అగ్నిప్రమాద కేసులు, పాలిడ్రోమ్, మెదడు, వెన్నెముక, ఛాతీ, ఊపిరితిత్తులు విభాగాల్లో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. 10 శాతం మాత్రమే చెల్లింపులు ఆరు నెలలుగా పెండింగ్ పడిన బిల్లులకు సంబంధించి డిసెంబరు మొదటి వారంలో కేవలం 10 శాతం మాత్రమే ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిగాయని ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నారు. మామూలుగా ఎన్టీఆర్ వైద్యసేవల్లో చేసే శస్త్రచికిత్సలకు ప్రభుత్వం నుంచి వస్తున్న తక్కువ మొత్తం కిట్టుబాటు కానప్పటికీ కేసుల సంఖ్య నమోదు దృష్ట్యా వైద్యం చేస్తున్నామని వీటికి ప్రభుత్వం ఇంత భారీగా బిల్లులు పెండింగ్ పెట్టడం దారుణమని వారంటున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు సక్రమంగా రాకపోవడంతో కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలోకి వచ్చే కేసులను కూడా నిరాకరిస్తూ డబ్బులు తీసుకుని వైద్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అవినీతి ఆరోపణలు ఈ విభాగానికి శాస్వత సీఈవో నియామకం లేకపోవడంతో తాత్కాలిక అధికారి పూర్తిస్థాయి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని అంతేకాకుండా జిల్లాస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ప్రైవేటు యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. గతంలో లేనిది ఈ ప్రభుత్వ హయాంలో ఈ విభాగంలో చేయి తడపనిదే పని జరగని పరిస్థితులు ఏర్పడ్డాయని వాపోతున్నారు. ఇదేనా ఎన్టీఆర్ వైద్యసేవ ? తక్కువ బరువుతో పుట్టిన మా ఇద్దరు పిల్ల లను ఇంక్యుబేటర్‌లో పెట్టి వైద్యం చేసేందుకు ఎన్టీఆర్ వైద్యసేవలో అర్హత ఉన్నా మాకు ఆ ఆసేవలు అందలేదు. ఇద్దరు బిడ్డలను రూ. 1.30 లక్షలు ఖర్చుచేసి బతికించుకోవాల్సి వచ్చింది. ఇదేనా ఎన్టీఆర్ వైద్యసేవ అంటే. – గిద్దా లీలా సాయి, భీమవరం -
అయ్యో హనీఫ్!
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు ఎస్కే హనీఫ్. ఇతను పూల దుకాణంలో పనిచేస్తూ తల్లిదండ్రులతోపాటు భార్య, ఇద్దరు చిన్న పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పనులు ముగించుకుని స్నేహితునితో కలసి బైక్‌పై ఇంటికి వెళుతుండగా ఆటోను ఢీకొన్న ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. దీంతో అతనిని హుటాహుటిన గూడూరులోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో నెల్లూరు నారాయణ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడికెళ్లాక దీనికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, కానీ ఖర్చుల నిమిత్తం రోజుకు రూ.5 వేలు కట్టాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. దీంతో తమను, తమ కుటుంబాన్ని దివంగత మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఆదుకుందని ఆ కుటుంబంతోపాటు, వారి బంధువులు సైతం భావింంచారు. అయితే ఐదో రోజున వైద్యులు వారి వద్దకు వచ్చి ఇకపై ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయలేమని, రోజుకు రూ.20 వేల వంతున చెల్లించాలని తెలిపారు. గాయపడ్డ హనీఫ్‌ను స్పెషల్ వార్డు నుంచి బయటకు పంపేశారు. మొత్తం చెల్లించకుంటే ఆస్పత్రి నుంచే పంపేయాల్సి వస్తుందని, దీనికి మేమేం చేయలేమని చేతులెత్తేశారు. దీంతో ‘అయ్యో భగవంతుడా.. ఇప్పుడేం చేయాలంటూ’ అతని భార్య సుమేరా తన ఐదేళ్ల జాస్మిన్, రెండేళ్ల ఇమ్రాన్‌లను దగ్గరకు తీసుకుని బోరున విలపించింది. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం ఆపేయడంతో ఇలా ఒక్క హనీఫ్ మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల కుటుంబాలు తమవారిని కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఇలా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే మాకు ఈ బాధలు ఉండేవి కాదని ఆ కుటుంబం కన్నీరుపెట్టుకుంది. నెల్లూరు, గూడూరు: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో అంపశయ్యపైకి చేర్చింది. కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు ప్రభుత్వం రూ.500 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. దీంతో యాజమాన్యాలు విధిలేని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలను ఈ నెల 17వ తేదీ నుంచి నిలిపివేస్తున్నామంటూ తేల్చి చెప్పేశారు. అత్యవసరమైన కీమో, డయాలసిస్ మినహా అన్ని సేవలూ ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన రాష్ట్రంలోని లక్షల కుటుంబాలకు పిడుగుపాటైంది. ఈ క్రమంలో గూడూరు పట్టణ సమీపంలోని ఎస్కే హానీఫ్ కుటుంబాన్ని నిలువునా కూల్చేసింది. వైద్యానికి అయ్యే మొత్తాన్ని చెల్లించలేక, కుటుంబ భారాన్ని మోసే వ్యక్తిని పోగొట్టుకోలేక, భార్యాపిల్లలతోపాటు, వారి బంధువుల సైతం కుంగిపోతున్నారు. గూడూరు పట్టణ సమీపంలో ఇందిరానగర్ ప్రాంతంలో పూలదుకాణంలో పనిచేసే ఎస్కే హనీఫ్ భార్య సుమేరాతోపాటు తన ఇద్దరు పిల్లలు జాస్మిన్, ఇమ్రాన్‌లతో కలసి జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీ రాత్రి పనులు పూర్తి చేసుకుని స్నేహితుడు కరీముల్లాతో కలసి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. మలుపు తిరుగుతుండగా ఆటోను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో హనీఫ్ వెనక్కుపడిపోయాడు. దీంతో అతని తలకు బలమైన గాయమైంది. దీంతో హుటాహుటిన 108లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు హనీఫ్ మెదడుకు గాయమైందని, వెంటనే నెల్లూరుకు తీసుకెళ్లాలని సూచించారు. నెల్లూరులోని నారాయణ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి చిన్న మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నరాలు దెబ్బతిన్నాయని, వైద్యానికి రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో వారు తమకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని తెలిపగా వైద్యులు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, కానీ ఇతర ఖర్చుల నిమిత్తం రోజుకు రూ.5 వేల వరకూ అవుతుందని తెలిపారు. హనీఫ్ తల్లిదండ్రులు, బంధువులతోపాటు ఇరుగుపొరుగు వారు సైతం ఎలాగోలా అప్పులు చేసి ఆ మొత్తాన్ని చెల్లిస్తామని నిర్ధారణకు వచ్చారు. ఇలా నాలుగు రోజులు గడిచింది. పిడుగులాంటి వార్త కార్పొరేట్ ఆస్పత్రులు ఆదివారం ప్రకటించిన పిడుగులాంటి వార్త ఆ కుటుంబాన్ని నిలువునా కుప్పుకూలేలా చేసింది. ఈ మేరకు సోమవారం ఆస్పత్రి సిబ్బంది హనీఫ్ భార్య వద్దకు వచ్చి ‘ఆరోగ్యశ్రీని నిలిపివేశారని.. ఇకపై రోజుకు రూ.20 వేలు చెల్లించాలని.. ఏమాత్రం ఆలస్యం చేసినా బయటకు పంపేస్తామని’ చెప్పారు. దీంతో వారంతా బోరున విలపిస్తూ ఏం చేయలో దిక్కుతోచక దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలో మంగళవారం రూ.20 వేలు చెల్లించలేదని హనీఫ్‌ను ఐసీయూ నుంచి బయటకు పంపేశారు. విషయం తెలుసుకున్న బంధువులు దొరికినచోటల్లా అప్పులు చేసి, ఇరుగుపొరుగు వారు కొంత చందాలు వేసుకుని ఎలాగోలా రూ.20 వేలు సర్దుబాటు చేశారు. అలా వారు మొత్తం చెల్లిస్తేనే అతనిని ఐసీయూలోకి తీసుకెళ్లారని, రోజు గడిస్తే రూ.20 వేలు ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ వారంతా ఏమీ చేయలేని దయనీయ స్థితిలో ఉండిపోయారు. హనీఫ్ తండ్రి అమీర్జాన్కి మూడేళ్ల క్రితమే కాలు తీసేశారు. దీంతో ఆయన ప్రస్తుతం ఏపనీ చేయలేని స్థితిలో ఉన్నాడు. హనీఫ్ పనిచేస్తేనే ఆ కుటుంబం ఆకలి తీరేది. ఈ క్రమంలో రోజుకు రూ.20 వేలు తీసుకురాలేక.. చూస్తూ చూస్తూ తమ బిడ్డను పోగొట్టుకోలేక వారు పడుతున్న వేదన వర్ణనాతీతంగా ఉంది. తమలాంటి పేదలకు సంజీవనిలా ఉన్న ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం ఎందుకిలా చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను కాపాడుకోవాలంటే అది తమ వల్ల అయ్యే పనికాదని, పేదలపై ఈ ప్రభుత్వానికి ఎందుకింత చిన్న చూపని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. దాతలు ముందుకొచ్చి తమ బిడ్డను ఆదుకోవాలని హనీఫ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
పాత్రికేయుల హెల్త్‌పాలసీ పొడిగింపు
అమరావతి: రాష్ట్రంలో పాత్రికేయులకు ఇచ్చే ఆరోగ్య పథకం మరో ఏడాది (2017-18) కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సమాచార ప్రజా సంబంధాల కమిషనర్ ఇచ్చిన వినతి మేరకు జర్నలిస్టులకు వర్తించే హెల్త్ స్కీమును ఏడాది పొడిగించామని, ఈమేరకు ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ సీఈఓ చర్యలు తీసుకోవాలని సూచించారు.