మంచానపడ్డ ఉచితవైద్యం | NTR Medical Services Stops In Private Hospitals | Sakshi
Sakshi News home page

మంచానపడ్డ ఉచితవైద్యం

Published Sat, Jan 5 2019 7:13 AM | Last Updated on Sat, Jan 5 2019 7:13 AM

NTR Medical Services Stops In Private Hospitals - Sakshi

తణుకులో నెట్‌వర్క్‌ ఆస్పత్రిలో ఎన్టీఆర్‌ వైద్య సేవ విభాగం

పశ్చిమగోదావరి, భీమవరం :  పేదోడి జబ్బుకు ప్రభుత్వమే వైద్యం చేస్తుందంటూ రాజన్న ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ వైద్యసేవగా పేరుమార్చి నీరుగారుస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా పేదోడికి అందాల్సిన ఖరీదైన వైద్యం మంచానపడింది. బకాయిలు పేరుకుపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో (ప్రైవేటు ఆస్పత్రులు) అందుతున్న వైద్యసేవలు ఈనెల 1వ తేదీ నుంచి పూర్తిగా మూతపడ్డాయి. గడిచిన నాలుగున్నరేళ్లుగా పడుతూ లేస్తూ అందుతున్న వైద్యసేవలను జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు యాజ మాన్యాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సేవలు నిలిపేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న కొద్దిపాటి సేవలు అందుతుండగా ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం గుండెకు సంబంధించిన అత్యవసర సేవలు మాత్రమే అందిస్తున్నారు.

ఐదు ఆసుపత్రుల్లో నిలిచిన వైద్య సేవలు
జిల్లాలో 35 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్‌ వైద్య సేవలు సౌకర్యం ఉంది. జిల్లాలో ఎన్టీఆర్‌ వైద్య సేవలు నిలుపుదల చేసిన ఆసుపత్రులు తణుకులోని యాపిల్, సుధ, సాయిశ్వేత, శ్రీసాయి ఆసుపత్రులు, ఏలూరులోని ఆంధ్రా హాస్పిటల్‌ల్లో ఎన్టీఆర్‌ వైద్య సేవలు నిలిపివేశారు. అత్యవసర కేసులే తప్ప సాధారణ కేసులను చూడడం లేదు. ఈ ఆసుపత్రులకు తెల్లరేషన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారు వెళ్లినా వారికి వైద్యం అందడం లేదు. చేతిలో సొమ్ము లేక ఆస్పత్రులలో వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో మిగిలిన అన్ని ఆసుపత్రుల్లోనూ ఎన్టీఆర్‌ వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. అదే జరిగితే జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు వైద్య సేవలు అందక విలవిలాడే పరిస్థితి వస్తుంది. జిల్లా ఎన్టీఆర్‌ వైద్య సేవ సౌకర్యం ఉన్న ఆసుపత్రులకు ప్రతి రోజు 30 నుంచి 40 వరకు ఓపీ (వైద్యం కోసం వచ్చేవారు), అత్యవసర కేసులు ఇద్దరు నుంచి నలుగురికి వైద్యం అందుతోంది. ప్రభుత్వం ఆయా ఆసుపత్రులకు 6 నెలలుగా బిల్లులు చెల్లించకపోయినా వారు ఎన్టీఆర్‌ వైద్య సేవలు అందించారు.

రూ. 50 కోట్లపైగా బిల్లులు పెండింగ్‌
జిల్లాలో 35 ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా అందుతున్న ఎన్టీఆర్‌ వైద్యసేవలకు సంబంధించి ఆయా ఆస్పత్రులకు సుమారుగా రూ. 50 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌ పడినట్లు తెలుస్తోంది. వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోని ఏలూరు జిల్లా ఆస్పత్రి, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో అందుబాటులో ఉన్న వైద్యులతో ఆర్థో, జనరల్‌ సర్జన్, ఈఎన్‌టీ, పీడియాట్రిక్‌ వైద్యసేవలు అందిస్తున్నారు. ఖరీదైన యూరాలజీ, కార్డియాలజీ, న్యూరో, ప్లాస్టిక్‌ సర్జరీ, నేత్రాలు, పళ్లు, అగ్నిప్రమాద కేసులు, పాలిడ్రోమ్, మెదడు, వెన్నెముక, ఛాతీ, ఊపిరితిత్తులు విభాగాల్లో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.

10 శాతం మాత్రమే చెల్లింపులు
ఆరు నెలలుగా పెండింగ్‌  పడిన బిల్లులకు సంబంధించి డిసెంబరు మొదటి వారంలో కేవలం 10 శాతం మాత్రమే ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిగాయని ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నారు. మామూలుగా ఎన్టీఆర్‌ వైద్యసేవల్లో చేసే శస్త్రచికిత్సలకు ప్రభుత్వం నుంచి వస్తున్న తక్కువ మొత్తం కిట్టుబాటు కానప్పటికీ కేసుల సంఖ్య నమోదు దృష్ట్యా వైద్యం చేస్తున్నామని వీటికి ప్రభుత్వం ఇంత భారీగా బిల్లులు పెండింగ్‌ పెట్టడం దారుణమని వారంటున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు సక్రమంగా రాకపోవడంతో కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఎన్టీఆర్‌ వైద్యసేవ పరిధిలోకి వచ్చే కేసులను కూడా నిరాకరిస్తూ డబ్బులు తీసుకుని వైద్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

అవినీతి ఆరోపణలు
ఈ విభాగానికి శాస్వత సీఈవో నియామకం లేకపోవడంతో తాత్కాలిక అధికారి పూర్తిస్థాయి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని అంతేకాకుండా జిల్లాస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ప్రైవేటు యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. గతంలో లేనిది ఈ ప్రభుత్వ హయాంలో ఈ విభాగంలో చేయి తడపనిదే పని జరగని పరిస్థితులు ఏర్పడ్డాయని వాపోతున్నారు.

ఇదేనా ఎన్టీఆర్‌ వైద్యసేవ ?
తక్కువ బరువుతో పుట్టిన మా ఇద్దరు పిల్ల లను ఇంక్యుబేటర్‌లో పెట్టి వైద్యం చేసేందుకు ఎన్టీఆర్‌ వైద్యసేవలో అర్హత ఉన్నా మాకు ఆ ఆసేవలు అందలేదు. ఇద్దరు బిడ్డలను రూ. 1.30 లక్షలు ఖర్చుచేసి బతికించుకోవాల్సి వచ్చింది. ఇదేనా ఎన్టీఆర్‌ వైద్యసేవ అంటే. – గిద్దా లీలా సాయి, భీమవరం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement