భారీ కాయంతో.. భారీ మూల్యం..
‘ఊబకాయం, బేరియాట్రిక్ సర్జరీ’ అనే అంశాలపై.. ‘సాక్షి’, జీఎస్‌ఎల్ ఆస్పత్రుల ఆధ్వర్యాన రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీ హోటల్‌లో ఆదివారం అవగాహన సదస్సు జరిగింది.
రాజ్యసభ మాజీ సభ్యుడు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జీఎస్‌ఎల్, స్వతంత్ర వైద్య సంస్థల వ్యవస్థాపకుడు గన్ని భాస్కరరావు, సాక్షి ప్రకటనల విభాగం ఏజీఎం రంగనాథ్ సదస్సును ప్రారంభించారు.
* ఒకే వేదికపై 12 విభాగాల వైద్య నిపుణుల సలహాలు
* ‘సాక్షి’, జీఎస్‌ఎల్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ఊబకాయాన్ని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వైద్యనిపుణులు పేర్కొన్నారు. ‘సాక్షి’, జీఎస్‌ఎల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఊబకాయం, బేరియాట్రిక్ సర్జరీ అనే అంశాలపై రాజమహేంద్రవరంలోని ఆనంద్ రీజెన్సీలో ఆదివారం అవగాహన సదస్సు జరిగింది.
రాజ్యసభ మాజీ సభ్యుడు, పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జీఎస్‌ఎల్, స్వతంత్ర వైద్య సంస్థల వ్యవస్థాపకుడు గన్ని భాస్కరరావు, సాక్షి అడ్వర్టైజ్‌మెంట్ ఏజీఎమ్ రంగనాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఊబకాయంతో అనేక సమస్యలు వచ్చాయని, తనకు బీపీ, షుగర్ మెండుగా ఉండడంతో అధికబరువు తగ్గించుకునే యోచనపై అయిష్టంగానే ఉండేవాడినన్నారు. దీనికి కారణం బేరియాట్రిక్ సర్జరీపై లేనిపోని అపోహాలు, అనుమానాలేనన్నారు. అయితే కొంతమంది వైద్యనిపుణుల సూచనలతో ఈ సర్జరీ చేయించుకున్నానని, దాని ఫలితం ఇప్పుడు తెలుస్తోందన్నారు. తిరిగి తన జీవితం నూతనత్వంలోకి వచ్చినట్టుందన్నారు.
జీఎఎస్‌ఎల్ వ్యవస్థాపకులు గన్ని భాస్కరరావు మాట్లాడుతూ బేరియాట్రిక్ సర్జరీ అంటే చాలామందిలో ఎన్నో అపోహలున్నాయని, దీనిని పోగొట్టి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ఇది చాలా ఖరీదైనదని, చాలా సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయనే ధోరణిలో ప్రజలున్నారన్నారు. అవన్నీ అపోహలేనన్నారు. అమెరికా వంటి దేశాల్లో ఈ సర్జరీ రూ.10 లక్షలపైనే ఉంటుందని, తాము కేవలం రూ.2 లక్షలకు అందిస్తున్నామని అన్నారు. ఈ సర్జరీ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్‌ఐ) 40 ఉన్నవారికి, ఎక్సర్‌సైజులు, ఆహారం మార్పుతో పాటు బరువు తగ్గే అన్నిరకాల వ్యాయామాలు చేసినా ఫలితం లేనివారికి మంచి ఫలితాలిస్తుందన్నారు.
సదస్సుకు వచ్చిన వారికి ఉచితంగా ఆర్‌బీఎస్, ఎఫ్‌బీఎస్, బీఎంఐ పరీక్షలతో పాటు డైట్ కంట్రోల్ కౌన్సెలింగ్, వెయిట్ కంట్రోల్ కౌన్సెలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ మహీధర్, డాక్టర్ హిమబిందు, డాక్టర్ హరిబాబు, డాక్టర్ సోమనాథ్ దాస్, సాక్షి అడ్వర్టైజ్‌మెంట్ ఆర్‌ఎం కొండలరావు, యాడ్ ఆఫీసర్ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
వంశపారంపర్య వ్యాధులను తగ్గించుకోవచ్చు
వంశపారంపర్యంగా క్యాన్సర్ ఉన్నపుడు తమకూ ఆ వ్యాధి సోకుతుందనే భయంతోనే ఆ కుటుంబీకులు బతుకుతారు. అయితే ఈ సర్జరీతో ఆ భయాన్ని చాలావరకూ పొగొట్టుకోవచ్చు. దాని బారినపడే అవకాశాలు బాగా తగ్గుతాయి. ఊబకాయం కేన్సర్ ఎందుకువస్తుందనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.
- డాక్టర్ ఆనందరావు, కేన్సర్ వైద్యనిపుణుడు
నాలో ఉన్న భయం పోయింది
ఈ అవగాహన సదస్సుతో అనేక విషయాలు తెలిశాయి. నాలో ఉన్న భయం పోయింది. కేన్సర్, వంశపారంపర్యం అనే అంశంపై వైద్య నిపుణులు చక్కని సూచనలతో కూడిన సలహాలను ఇచ్చారు. ఇప్పటివరకూ ఏవేవో బ్యూటీసెంటర్లు, డైట్‌కంట్రోల్ ట్రీట్‌మెంట్లు తీసుకున్నా. ఫలితం లేదు. ఈ సర్జరీ ఫలితాలు బాగా తెలుసుకున్నాను.
- యు.మంగాదేవి, తాళ్లూరు
ఒకే వేదికపై ఇంతమంది డాక్టర్లు
మనకున్న సమస్యలను తెలుసుకోవాలంటే అనేకమంది డాక్టర్లను కలవాలి. అయితే ‘సాక్షి, జీఎఎస్‌ఎల్ ఆసుపత్రి వారు ఒకే వేదికపై 12 విభాగాల వైద్యులను తీసుకువచ్చారు. ఇది చాలా మంచి అవకాశం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మహిళలకు ఈ చికిత్సపై రాయితీలు అందిస్తే బాగుంటుంది.
- ప్రియాహాసిని, రాజమహేంద్రవరం
ఊబకాయం తగ్గించుకుంటే సమస్యలు దూరం
ఊబకాయం తగ్గించుకుంటే శరీరంలో ఉత్పన్నమయ్యే సమస్యలు దూరమౌతాయి. అధికబరువు వల్ల ఎముక సంబంధ సమస్యలతో పాటు కీళ్ల వ్యాధులు వస్తాయి, వీటినుంచి ఎదురయ్యే జబ్బులకు అధిక బరువు తగ్గించుకోవడంతో చెక్ పెట్టవచ్చు. వంశపారంపర్యంగా ఉన్న జబ్బుల నుంచి సైతం ఈ చికిత్సతో కాపాడుకునే అవకాశం ఉంది.
- డాక్టర్ సుధీర్‌శాండిల్య, అధికబరువు, కీళ్ల వ్యాధులు వైద్య నిపుణులు
వ్యాధుల పుట్టిల్లు ఊబకాయం
శరీర బరువు పెరిగిందంటే అనేక సమస్యలకు మనమే దారిచూపించినట్టు. దీన్ని ఆదిలోనే ఆపాలి. చాలామంది ఎన్నో రకాల పద్ధతులు ఉపయోగించి దీన్ని అధిగమించేందుకు పలు ప్రయత్నాలు చేసి విఫలమైన కేసులు ఎన్నో ఉన్నాయి. వారందరికీ బేరియాట్రిక్ సర్జరీ మంచి అవకాశం. ఈ సర్జరీ తర్వాత అనేక రకాల జబ్బులు, సమస్యల నుంచి బయటపడవచ్చు.
- డాక్టర్ సమీర్ రంజన్‌నాయక్
ముందు సంకల్పం ఉండాలి
ఏ పనైనా ప్రారంభించాలంటే ముందు సంకల్పం ఉండాలి. ఇక్కడికి రావడం వల్ల చాలా విషయాలు తెలిశాయి. చాలా బాగుంది. దీనిపై ప్రత్యేకదృష్టి పెట్టాలి. చికిత్సవల్ల కలిగే లాభాలను తెలుసుకోగలిగాం.
- ఆర్.నాగలక్ష్మి, కొవ్వూరు
ఇటువంటి సదస్సులు ఇంకా జరగాలి
ప్రజలకు ఉపయోగపడే ఈ సదస్సులు మరిన్ని జరగాలి. మంచి కార్యక్రమం. ఇది జనంలోకి వెళితే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అపోహలు తొలగిపోయాయి. బేరియాట్రిక్ సర్జరీ ఖరీదు కూడా చాలా తక్కువగా ఉంది.
- ఎస్.రాంబాబు, రాజమహేంద్రవరం