కడుపు కోత | bariatric surgery is surgery on the stomach shrinkage | Sakshi
Sakshi News home page

కడుపు కోత

Published Wed, Jun 7 2017 11:23 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM

కడుపు కోత

కడుపు కోత

బేరియాట్రిక్‌ సర్జరీ... బాగా లావుగా ఉన్న వాళ్లకు,ఆ స్థూలకాయం వల్ల ప్రాణహాని ఉన్నవాళ్లకు చేసే శస్త్రచికిత్సా విధానం. అందంగా ఉండటానికి చేయించుకునే చికిత్స కానే కాదిది. ఈ బేరియాట్రిక్‌ సర్జరీల్లో ప్రధానమైనవి కడుపు సైజ్‌ను కుదించే సర్జరీ, కడుపు– పేగును బైపాస్‌ చేసే సర్జరీ.ఆకలి తగ్గడం వల్ల, కడుపులో చోటు లేకపోవడం వల్ల, ఈ శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు చాలా మితంగానే తినగలరు. ఇక్కడివరకూ బాగానే ఉంది. లావు ఉన్న వారు ఈ పేగు, కడుపు కోతలతో జాగ్రత్త పడకపోతే, కడుపుకోత తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.ఈ కడుపుకోతల వల్ల అరుదుగానైనా కలిగే కొన్ని అనర్థాల గురించి కూడాడాక్టర్లు చెబుతున్నారు.ఈ శస్త్రచికిత్సలతో ఉన్న ప్రయోజనాలు, ప్రమాదాల గురించి అవగాహన కోసం ఈ ప్రత్యేక కథనం.

మీరు లావా?... అయితే ఎంత?
ఒక వ్యక్తి స్థూలకాయుడా, కాదా అని నిర్ధారణ చేయడానికి ‘బాడీ మాస్‌ ఇండెక్స్‌’ (బీఎమ్‌ఐ) అనే ప్రమాణాన్ని ఎంచుకుంటాం. దీన్ని కొలిచే పద్ధతి ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి బరువును కిలోగ్రాములలో కొలవాలి. ఆ విలువను తన ఎత్తు (మీటర్లలో)  స్క్వేర్‌తో భాగించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 120 కిలోలు. అతడి ఎత్తు 1.7 మీటర్లు. అప్పుడు అతడి బీఎమ్‌ఐ విలువ... 120/1.7 ్ఠ 1.7 = 41.52 కేజీ/మీ2. విదేశీయులతో పోల్చి చూస్తే మనకు శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ, కండరాల పరిమాణం తక్కువ. అందువల్ల బీఎమ్‌ఐ విలువల ఆధారంగా నిర్ధారణ చేసే స్థూలకాయ వర్గీకరణ విదేశీయులకు, భారతీయులకు వేరువేరుగా ఉంటుంది.

భారతీయులలో స్థూలకాయం ఎంతంటే...
భారతీయుల్లో బీఎమ్‌ఐ విలువ 25 – ఆపైన ఉంటే స్థూలకాయం ఉన్నట్లే. ఒకవేళ ఈ విలువ 30 – ఆ పైన ఉంటే తీవ్ర స్థూలకాయం ఉన్నట్టుగా పరిగణించాలి. స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి బీఎమ్‌ఐతో పాటు నడుము చుట్టుకొలత, నడుమూ–హిప్‌ చుట్టుకొలతల నిష్పత్తి మొదలైన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. నడుము చుట్టుకొలత మహిళల్లో 80 సెం.మీ. కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 90 సెం.మీ. కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం సమస్య ఉన్నట్లు. ఇక నడుమూ–హిప్‌ చుట్టుకొలతల నిష్పత్తి మహిళల్లో 0.8 కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 0.9 కంటే ఎక్కువగానూ ఉంటే స్థూలకాయ సమస్య ఉన్నట్లుగా పరిగణించాలి.

సెట్‌పాయింట్‌ ఫర్‌ ఫ్యాట్‌ స్టోరేజ్‌ అంటే ఏమిటి?
ఒక వ్యక్తి శరీరంలో ఎంత కొవ్వు నిలువ ఉండాలనే అంశాన్ని (సెట్‌ పాయింట్‌ ఫర్‌ ఫ్యాట్‌ స్టోరేజ్‌ను) అనేక హార్మోన్లు నిర్ణయిస్తాయి. ఇందులో జీర్ణవ్యవస్థలో తయారయ్యే హార్మోన్లయిన గ్రెలిన్, జీఎల్‌పీ–1 అనేవి ప్రధానమైనవి. ఈ సెట్‌ పాయింట్‌ అనేది మన మనసు అధీనంలో ఉండదు. గ్రెలిన్‌ జీర్ణాశయం పైభాగంలో తయారవుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది. ‘జీఎల్‌పీ–1’ అనే హార్మోన్‌ చిన్న పేగు చివరిభాగంలో తయారవుతుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. కొంతమంది తక్కువగా తింటున్నప్పటికీ లావుగా ఉంటారు. ఇంకొంతమంది ఎక్కువగా తింటున్నప్పటికీ సన్నగానే ఉంటారు. దీనికి కారణం... లావుగా ఉన్నవారిలో కొవ్వు సెట్‌పాయింట్‌ ఎక్కువగానూ, సన్నగా ఉన్నవారిలో కొవ్వు సెట్‌పాయింట్‌ తక్కువగానూ ఉంటుందన్నమాట. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కొవ్వు సెట్‌పాయింట్‌ పెరుగుతుంది. ఇది ఒకసారి పెరిగితే మళ్లీ అంత తేలికగా తగ్గదు.

బరువు తగ్గించుకోడానికి మార్గాలు...
అధిక బరువు (బీఎమ్‌ఐ 23 – 24.99) ఉన్నవారు, స్వల్ప స్థూలకాయం (బీఎమ్‌ఐ 25 – 29.99) ఉన్నవారు రోజూ క్రమం తప్పకుండా కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం (బ్రిస్క్‌ వాకింగ్‌), ఆహారంలో కొవ్వు పాళ్లు తగ్గించుకోవడం, క్రమం తప్పకుండా వేళకు తినడం, తక్కువ మోతాదుల్లో తినడం, చిరుతిండ్లకూ, కూల్‌డ్రింక్స్‌కూ, ఆల్కహాల్‌కూ దూరంగా ఉండటం  వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితో బరువు తగ్గించుకోవచ్చు. ఇది అధిక బరువు ఉన్నవారికే గాక... అందరికీ బరువును అదుపులో ఉంచుకోడానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన ప్రక్రియ.

విజ్ఞతతో వ్యవహరించండి
స్థూలకాయులలో నూటికి 50 మందిలో లైఫ్‌ రిస్క్‌ ఉంటుంది. వంద మందికి బేరియాట్రిక్‌ ఆపరేషన్స్‌ చేస్తే 99 మంది బతికి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు కేవలం ఒక్క శాతం మాత్రమే. దుష్ప్రభావాలను భూతద్దంలో చూస్తే ఆపరేషన్‌ అవసరమైన వారు కూడా భయపడి ఆపరేషన్‌ చేయించుకోకుండా ప్రాణం మీదికి తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది.

బీఎమ్‌ఐ 30 ఆ పైన ఉంటే...
బీఎమ్‌ఐ 30 లేదా ఆ పైన ఉంటే (అంటే తీవ్ర స్థూలకాయానికి చేరితే) కేవలం  ఆహార నియమాలు, వ్యాయామం వంటి ప్రక్రియల ద్వారా బరువు తగ్గడం సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి వారిలో నూటికి నలుగురు మాత్రమే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామాలతో బరువు తగ్గగలరు. మిగతా 96 మంది బరువు తగ్గడంలో విఫలమౌతారు. బీఎమ్‌ఐ 30 – ఆపైన ఉంటే డైటింగ్, వ్యాయామాలను మొదలుపెట్టిన వెంటనే కొవ్వు సెట్‌ పాయింట్‌ను నియంత్రించే హార్మోన్లు శరీరంలో ప్రతికూల మార్పులను తీసుకొస్తాయి. ఆకలిని పెంచే గ్రెలిన్‌ హార్మోన్‌ పెరుగుతుంది, ఆకలిని తగ్గించే జీఎల్‌పీ–1 హార్మోన్‌ తగ్గుతుంది. కాబట్టి ఆకలి పెరుగుతుంది. మెటబాలిజం తగ్గుతుంది. చివరికి ఆకలికి తట్టుకోలేక ఎక్కువగా తినేస్తారు. అందువల్ల తిరిగి బరువు పెరుగుతారు.

మరి పరిష్కారం ఏమిటి...?
డైటింగ్, వ్యాయామాల ప్రభావం కొవ్వు సెట్‌ పాయింట్‌ మీద అంతంత మాత్రమే. అందువల్ల బీఎమ్‌ఐ 30 – ఆపైన ఉన్నవారిలో... ఈ ప్రక్రియలు శాశ్వతంగా బరువును తగ్గించలేవు. బరువును నియంత్రించడానికి మందులు ఉన్నప్పటికీ వాటి పాత్ర పరిమితం. ఒకవేళ వాటిని వాడినా... ఆపివేయగానే తిరిగి బరువు పెరుగుతారు. కాబట్టి శాశ్వతంగా బరువు తగ్గడానికీ, స్థూలకాయంతో వచ్చే అనర్థాలైన గుండెపోటు, డయాబెటిస్, అధికరక్తపోటు వంటి వాటిని తగ్గించుకుని, ఆయుఃప్రమాణాన్ని పెంచుకోడానికి అనువైన మార్గం బేరియాట్రిక్‌ సర్జరీ. అయితే బేరియాట్రిక్‌ సర్జరీలను అందరికీ చేయరు. భారతీయులలో బీఎమ్‌ఐ 30 – ఆ పైన ఉండి, షుగర్‌ లాంటి జబ్బులు ఉంటే వారికి బేరియాట్రిక్‌ సర్జరీ చేస్తారు. షుగర్‌ లాంటి ఇతర జబ్బులేమీ లేకపోయినా బీఎమ్‌ఐ 35 – ఆ పైన ఉంటే...  బేరియాట్రిక్‌ సర్జరీ చేయవచ్చు. ఈ పరిమితులను ఇంటర్నేషనల్‌∙డయాబెటిస్‌ ఆర్గనైజేషన్స్‌... ఏషియన్స్‌లో 32.5, 37.5గా నిర్ణయించారు. (విదేశీయుల్లో ఈ పరిమితులు 35 మరియు 40). గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఒంటి బరువు వారి ప్రాణాలకు ముప్పు తెస్తుందనుకున్నప్పుడే బేరియాట్రిక్‌ సర్జరీకి అర్హులవుతారు.

బేరియాట్రిక్‌విధానాలలో రకాలు
బేరియాట్రిక్‌ విధానాల్లో అసలు శస్త్రచికిత్స లేకుండా చేసే ‘గ్యాస్ట్రిక్‌ బెలూన్‌’ ప్రక్రియ  మొదలుకొని... చిన్న గాట్లతో, లాపరోస్కోపీ విధానంలో చేసేశస్త్రచికిత్సల వరకు అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.

గ్యాస్ట్రిక్‌ బెలూన్‌ ప్రక్రియ...
గ్యాస్ట్రిక్‌ బెలూన్‌... ఎండోస్కోపిక్‌ ప్రక్రియ.   బేరియాట్రిక్‌ శస్త్రచికిత్స చేయడానికి వీలు లేనివారిలో  ఈ విధానాన్ని అవలంబిస్తారు. ఒక మోస్తరు స్థూలకాయ సమస్య ఉన్నవారిలో, శస్త్రచికిత్సల పట్ల విముఖత ఉన్నవారిలో, టీనేజర్లలో, పెళ్లికాని యువతులలో కూడ ఈ విధానాన్ని పరిగణించవచ్చు.ఇటీవల మృతిచెందిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావుకు నిర్వహించిన చికిత్స ప్రక్రియ ఇది. ఈ పద్ధతిలో బెలూన్‌ను అన్నవాహిక ద్వారా జీర్ణాశయంలోకి ప్రవేశపెడతారు. ఇందులో ఆర్బెరా బెలూన్, ఓబెలాన్‌ బెలూన్‌లను జీర్ణాశయంలో ఆర్నెల్ల పాటు ఉంచుతారు. అదే స్పాట్జ్‌–3 అడ్జెస్టబుల్‌ బెలూన్‌ను అయితే ఏడాది కాలం పాటు ఉంచుతారు. మిథిలిన్‌ బ్లూ అనే నీలం రంగు మందును కలిపిన సెలైన్‌తో బెలూన్‌ను నింపుతారు. మామూలుగా గాలి నింపిన బెలూన్‌ లాగా ఇది పేలిపోయే అవకాశం ఉండదు.

ఈ బెలూన్‌ నేరుగా బరువును తగ్గించదు. దీన్ని జీర్ణాశయంలో ఉంచటం వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. అలా ఇది భోజనం ఎక్కువ మోతాదులో తీసుకోకుండా కట్టడి చేస్తుంది. అంతేగానీ దీని వల్ల కొవ్వు సెట్‌ పాయింట్‌లో ఎలాంటి మార్పులూ రావు. ఉంచాల్సిన వ్యవధి తర్వాత ఈ బెలూన్‌ను తొలగిస్తారు. అయితే ఈ వ్యవధిలో ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, వ్యాయామం లాంటి ఇతర బరువు తగ్గే ప్రక్రియలను పాటించాల్సి ఉంటుంది. బెలూన్‌ తీసిన తర్వాత తగ్గిన బరువు తిరిగి పెరగకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం తప్పనిసరి. అయితే నూటికి 80 మంది ఇవి పాటించకపోవడం వల్ల తిరిగి బరువు పెరిగిపోతారు. ఇలా తిరిగి బరువు పెరిగిన వారికి బేరియాట్రిక్‌ శస్త్రచికిత్సలు తప్పకపోవచ్చు.

ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల బేరియాట్రిక్‌ సర్జరీలకు అర్హులు కాని వారికి బెలూన్‌ అమర్చి, కొంత బరువును తగ్గించాక అవసరాన్ని బట్టి బేరియాట్రిక్‌ సర్జరీలను చేస్తారు. అంటే ఇలాంటివారిలో బెలూన్‌ ప్రక్రియ బేరియాట్రిక్‌ సర్జరీకి ముందు ఒక వారధిగా మాత్రమే ఉపయోగపడుతుంది. వ్యవధిని మించి బెలూన్‌ను జీర్ణాశయంలో ఉంచితే నెమ్మదిగా అది లీక్‌ అయి, బెలూన్‌ పేగుల్లోకి జారి అడ్డం పడే అవకాశం ఉంటుంది. లీక్‌ కావడం మొదలైన వెంటనే మూత్రం నీలం రంగులోకి మారుతుంది. ఇలా మనకు బెలూన్‌ లీక్‌ అవుతున్నట్లు తెలుస్తుంది. వెంటనే బెలూన్‌ తీయించేసుకుంటే ఇతర సమస్యలు రావు.

బేరియాట్రిక్‌ శస్త్రచికిత్సల తర్వాత బరువు తగ్గడానికి అసలు కారణం...
బేరియాట్రిక్‌ సర్జరీలలో స్లీవ్‌ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్‌ బైపాస్, డియోడినల్‌ స్విచ్‌ వంటి అనేక ప్రక్రియలు ఉన్నాయి. వీటిని లాపరోస్కోపీ విధానంలో చేస్తారు. బేరియాట్రిక్‌ సర్జరీలు చేయించుకున్న వారు ఆహారం ఎక్కువగా తినలేరు. కొన్ని బేరియాట్రిక్‌ సర్జరీల తర్వాత ఆహారం శరీరంలోకి ఇంకిపోయే ప్రక్రియ మందగిస్తుంది. నిజానికి ఈ రెండు కారణాల వల్లనే బరువు తగ్గుతారని అందరూ అనుకుంటారు. వాస్తవానికి బేరియాట్రిక్‌ ఆపరేషన్ల తర్వాత బరువు తగ్గడానికి అసలు కారణం... హార్మోన్లలో మార్పుల వల్ల (ఆకలిని పెంచే గ్రెలిన్‌ తగ్గడం, ఆకలిని తగ్గించే జీఎల్‌పీ–1 పెరగడం) ‘కొవ్వు సెట్‌ పాయింట్‌’ తగ్గడమే. ఈ సర్జరీల తర్వాత ఆకలి తగ్గుతుంది, మెటబాలిక్‌ రేట్‌ పెరుగుతుంది.

బేరియాట్రిక్‌ సర్జరీల వల్ల ఇతర ప్రయోజనాలు
బేరియాట్రిక్‌ సర్జరీలు చేయించుకున్న వారు బరువు తగ్గడమే కాకుండా డయాబెటిస్‌ (షుగర్‌), హైబీపీ వంటి సమస్యలనుంచి బయటపడే అవకాశం ఉంది. స్లీవ్‌ గ్యాస్ట్రెక్టమీతో పోలిస్తే గ్రాస్ట్రిక్‌ బైపాస్, డియోడినల్‌ స్విచ్‌ వంటి పేగు బైపాస్‌ పద్ధతులలో హార్మోన్లలో మార్పులు ఎక్కువ. డయాబెటిస్‌ను నయం చేయడానికి మినీ గ్యాస్ట్రిక్‌ బైపాస్, స్లీవ్‌ గ్యాస్ట్రెక్టమీ విత్‌ లూప్‌ డియోడినో–జెజునల్‌ బైపాస్, సింగిల్‌ అనాస్టమోసిస్‌ స్లీవ్‌ ఇలియల్‌ బైపాస్‌ మొదలైన ఆధునిక బేరియాట్రిక్‌ సర్జరీలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ నూతన శస్త్రచికిత్సలను రీసెర్చ్‌లో భాగంగా మాత్రమే చేస్తున్నారు. స్థూలకాయం లేకపోయినా డయాబెటిస్‌ తీవ్రంగా ఉన్నవారికి స్లీవ్‌ గ్యాస్ట్రెక్టమీ విత్‌ డియోడినో–ఇలియల్‌ ఇంటర్‌–పొజిషన్‌ అనే మెటబాలిక్‌ సర్జరీ అందుబాటులో ఉంది.

బేరియాట్రిక్‌ సర్జరీలతో దుష్ప్రభావాలు
బేరియాట్రిక్‌ సర్జరీతో సాధారణంగా ఎలాంటి ప్రమాదాలు ఉండవు. తమ బరువే తమకు ముప్పుగా పరిణమించేంత ఎక్కువ బరువు ఉన్నవారికి బేరియాట్రిక్‌ శస్త్రచికిత్సలు చేయకపోతేనే ప్రమాదం కాబట్టి వీటిని చేస్తారు. అయితే సాధారణ శస్త్రచికిత్సల్లో ఉండే రిస్క్‌లే వీటిలోనూ ఉంటాయి. ఈ ప్రమాదాల్లో కొన్ని...
     
కొన్ని సందర్భాల్లో రక్తస్రావం అయ్యేందుకు అవకాశం ఉంది. కత్తిరించిన జీర్ణాశయం, పేగులు సరిగ్గా అతుక్కోకుండా లీకయ్యే ప్రమాదం అరుదుగా జరగవచ్చు. కానీ హైఎండ్‌ సాంకేతిక పరిజ్ఞానం, హైడెఫినిషన్‌ కెమెరాలు, అడ్వాన్స్‌డ్‌ వెసెల్‌ సీలింగ్‌ సిస్టమ్స్, హై క్వాలిటీ స్టాప్లర్లతో నిపుణులైన సర్జన్లు ఈ శస్త్రచికిత్సలు చేయడం వల్ల ఈ సమస్యలు వచ్చే అవకాశం చాలా అరుదు.
   
ఆపరేషన్‌ అయిన మొదటి కొన్ని వారాల్లో కాళ్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం కొందరిలో ఉంటుంది. దీన్ని అడ్డుకునే మందులు (యాంటీకోయాగ్యులెంట్స్‌), పరికరాలు (నూమాటిక్‌ కంప్రెషన్‌ స్టాకింగ్స్‌) ఉపయోగించి ఈ సమస్యను నివారించవచ్చు.  

బరువు వేగంగా తగ్గినందువల్ల జుట్టురాలడం, అప్పటివరకు సాగిన చర్మం ముడతలు పడటం వంటి చిన్నపాటి సమస్యలు రావచ్చు. బరువు తగ్గడం ఆగిన కొంతకాలానికి ఈ సమస్యలు సర్దుకుంటాయి.
     
బేరియాట్రిక్‌ శస్త్రచికిత్సల తర్వాత తొలినాళ్లలో విటమిన్‌లు, ఖనిజలవణాల లోపాలు రావచ్చు. అయితే వీటిని విటమిన్లు, మినరల్స్‌ సప్లిమెంట్‌ల ద్వారా అధిగమించవచ్చు.
డాక్టర్‌ వి. అమర్‌
చీఫ్‌ కన్సల్టెంట్‌ మెటబాలిక్‌ అండ్‌ బేరియాట్రిక్‌ సర్జన్, కాంటినెంటల్‌ హాస్పిటల్స్, హైదరాబాద్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement