
స్థూలకాయం మానవాళిని చిరకాలంగా చిరాకుపెడుతున్న సమస్య. ఇప్పుడంటే శస్త్రచికిత్స చేసి, ఒంట్లోని కొవ్వును తీసేయడం వంటి పద్ధతులు పుట్టుకొచ్చాయి గాని, ఇదివరకటి కాలంలో స్థూలకాయులు రకరకాల చిత్రవిచిత్రమైన పద్ధతుల్లో బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు. అలాంటి పద్ధతుల్లో కొన్ని ప్రాణాంతకంగా కూడా ఉండేవి. వైద్యశాస్త్రం ఆధునికత సంతరించుకుంటున్న పంతొమ్మిదో శతాబ్దిలో స్థూలకాయానికి విరుగుడుగా పాషాణం (ఆర్సెనిక్) కలిపి తయారు చేసిన మాత్రలను, ఇతర ఔషధాలను విరివిగా వాడేవారు. ఆర్సెనిక్ వల్ల జీవక్రియ వేగం పెరిగి ఒంట్లో అదనపు కొవ్వు త్వరగా కరిగిపోతుందని వెర్రిగా నమ్మేవారు. కొందరు తయారీదారులు తమ ఔషధాల్లో ఆర్సెనిక్ కలిపినట్టు బాహాటంగానే చెప్పుకొని మరీ ప్రకటనలు కూడా ఇచ్చేవారు.
ఇంకొందరు ఆర్సెనిక్ కలిపిన విషయాన్ని మరుగునపెట్టి ఆర్సెనిక్‌తో తయారు చేసిన ఔషధాలను అంటగట్టేవారు. ఆర్సెనిక్ వల్ల ఒంట్లో కొవ్వు కరగడం ఎలా ఉన్నా, అంతకంటే ముందే ప్రాణాలు హరించుకుపోతాయనేది వాస్తవం. పంతొమ్మిదో శతాబ్ది వైద్యులకు ఈ సంగతి తెలియదంటే నమ్మలేం. ఎందుకంటే అంతకు శతాబ్దాలకు ముందే ఆర్సెనిక్‌ను శత్రువులను కడతేర్చేందుకు విషప్రయోగాలలో ఉపయోగించేవారు. ఆర్సెనిక్ ఎంత భయంకరమైన విషం అంటే అది చాలా వేగంగా ప్రాణాలు తీస్తుంది. అయినా అప్పటి మోసకారులు దీన్ని ఔషధం అంటూ అమ్మారు.
Comments
Please login to add a commentAdd a comment