ఈ ఫొటోలో ఉన్న కొరి డిసిల్వా వయసు 40 ఏళ్లు. వాయువ్య ఇంగ్లాండ్‌లోని చెషి అనే ప్రాంతంలో ఉంటోంది. ఇద్దరు పిల్లల తల్లి. కాని తనకు తాను కొన్నాళ్లుగా నచ్చట్లేదు. అందుకు కారణం స్థూలకాయం. కొరి డిసిల్వాకు వెన్ను సర్జరీ జరిగింది. దాని వల్ల ఆమె ఎక్కువగా విశ్రాంతిలో ఉండాల్సి వచ్చేది. ‘డాక్టర్లు నన్ను జిమ్ వైపు పొరపాటున కూడా వెళ్లొద్దు అని చెప్పారు’ అంటుందామె. కదలక మెదలక ఉండేసరికి క్రమంగా ఆమె బరువు పెరిగింది. ఆఖరుకు అది 94 కిలోల వద్ద స్థిరపడింది. ‘నన్ను నేను చూసుకుంటే చాలా కష్టంగా అనిపించింది’ అని కొరి అంది.
వెంటనే బరువు తగ్గాలనుకుంది. అయితే దానికి పూర్తి వ్యాయామం చేసే పరిస్థితి లేదు. మరి ఎలా తగ్గడం. కొరికి జంక్ ఫుడ్ ఇష్టం. రోజూ బయటి నుంచి ఆహారం రావాల్సిందే. లేకుంటే తానే వెళ్లి తినాల్సింది. ఆమె జంక్ ఫుడ్ ఖర్చు నెలకు దాదాపు లక్ష రూపాయలు. దానిని మానేయాలి అని మొదట ఆమె నిశ్చయించుకుంది. అలాగే ఆమెకు రోజూ రాత్రి పూట వైన్ తాగే అలవాటు ఉంది. దానిని కూడా మానేయాలని అనుకుంది. రెండూ కష్టమైన పనులే. కాని గట్టిగా చేయాలని నిశ్చయించుకుంది.
ఇంట్లోనే వండుకున్న ఆహారం, పరిమిత వ్యాయామం, పాజిటివ్ ఆలోచనలు... ఇవన్నీ కొరి డిసిల్వా బరువును మెల్లగా తగ్గించడం మొదలెట్టాయి. 14 వారాల్లో ఆమె తగ్గిన బరువు ఎంత తెలుసా. అక్షరాలా 19 కిలోలు. ‘డబ్బు మిగిలింది. అరోగ్యమూ వచ్చింది. అందంగా తయారయ్యాను’ అని కొరి మురిసిపోతోంది. మనం ఎంత తింటున్నాం, ఏది తింటున్నాం చెక్ చేసుకుంటే కొన్ని మానేస్తే మరికొన్ని అదుపుచేస్తే అదనపు బరువు రాదని కొరి ఉదాహరణ అందంగా సలహా ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment