సర్జరీ లేకుండానే బరువు తగ్గవచ్చా?
నా వయసు 45 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. బీపీ, షుగర్ ఉన్నాయి. నేను స్థూలకాయంతో చాలా బాధపడుతున్నాను. నా బరువు 115 కిలోలు. బరువు తగ్గాలనే ఉద్దేశంతో చాలామంది డాక్టర్లను కలిశాను. కొందరు బరువు తగ్గడానికి శస్త్రచికిత్స చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. కానీ దాని వల్ల ఒక్కోసారి మరణం సంభవించవచ్చని కూడా విన్నాను. ఈ స్థూలకాయం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. సర్జరీ లేకుండానే బరువు తగ్గే ఉపాయం చెప్పండి.
- డి. మాధురి, కరీంనగర్
ప్రస్తుతం మన సమాజంలో స్థూలకాయం సమస్య ఎక్కువగానే ఉంది. మనలో ఉండాల్సిన కొవ్వు కంటే అధికంగా శరీరంలో పేరుకుపోతే స్థూలకాయం వస్తుంది. మనమెంత స్థూలకాయులమో తెలియాలంటే ముందుగా మన బాడీ మాస్ ఇండెక్స్‌ను పరీక్షించుకోవాలి. మన బరువును కేజీల్లో తీసుకొని దాన్ని మీ ఎత్తు స్క్వేర్‌తో భాగించాలి. ఇక్కడ మీ ఎత్తును మీటర్లలో తీసుకోవాలి. ఇలా భాగించగా వచ్చిన విలువ మన బీఎమ్‌ఐ అవుతుంది. ఉదాహరణకు మీ బరువు 115 కేజీలని చెప్పారు గానీ మీ ఎత్తును చెప్పలేదు. ఉదాహరణకు మీ ఎత్తు 1.60 మీటర్లు అనుకుందాం. అప్పుడు మీ బీఎమ్‌ఐను తెలుసుకోవాలంటే 115 / 1.60 ఇంటూ 1.60 అని లెక్కవేయాలి. అప్పుడు వచ్చే విలువ మీ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్‌ఐ) అవుతుందన్నమాట. ఒకవేళ మీ ఎత్తు మీటర్లలో 1.60 అయితే మీ బీఎమ్‌ఐ విలువ 44.92 అవుతుందన్నమాట.
సాధారణంగా బీఎమ్‌ఐ విలువ వచ్చాక ఆయా విలువలను కొన్ని ప్రామాణిక విలువలతో పోల్చి చూస్తారు. ఈ బీఎమ్‌ఐ 25 కంటే ఎక్కువ ఉంటే మీరు ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువున్నారని అర్థం. అదే 30 కంటే ఎక్కువ ఉంటే మీరు స్థూలకాయులని అర్థం.
ఇక్కడ డాక్టర్లు స్థూలకాయులైనంత మాత్రాన వెంటనే శస్త్రచికిత్సను సూచించరు. మీరు బరువు కాస్త ఎక్కువైనా దాని వల్ల మీరు కనిపించే తీరు బాగానే ఉండి, మీ పనులన్నీ మీరు సక్రమంగా చేసుకోగలుగుతుంటే మీకు బరువు తగ్గే శస్త్రచికిత్స అవసరం లేదు. కానీ మీ బరువు మీ పనులకూ, మీ దైనందిన కార్యకలాపాలకూ, మీ వృత్తి నిర్వహణకూ ఆటంకంగా పరిణమించినప్పుడు... అలాంటి సందర్భాల్లో మీ అధిక బరువును ఒక వ్యాధిగా పరిణిస్తారు.
అలాంటి సమయాల్లో బరువే వ్యాధి అయినప్పుడు అది శరీరంలోని కీలక అవయవాలపై తన దుష్ర్పభావం చూపుతుంది. జీవన నాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) తగ్గుతుంది. ఈ బరువుకు కొన్నిసార్లు డయాబెటిస్, రక్తపోటు, గురక (స్లీప్ ఆప్నియా), గుండెజబ్బులు, పక్షవాతం, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చేందుకు ఒక రిస్క్‌ఫ్యాక్టర్‌గా పనిచేస్తుంది. బీఎమ్‌ఐ 25 కంటే ఎక్కువ ఉన్నప్పుడు వారి బరువును సాంప్రదాయిక విధానాలైన వ్యాయామం, ఆహారనియమాలు, కొన్ని రకాల మందులతో నియంత్రణలోకి తేచ్చేందుకే మొదట డాక్టర్లు ప్రయత్నిస్తారు. అయితే అది మీ బరువే ఒక వ్యాధిగా పరిణమించి అది మీకు ప్రాణాంతకమయ్యే రిస్క్‌ను కలగజేసినప్పుడు మాత్రమే శస్త్రచికిత్సను సిఫార్సు చేస్తారు.
ఒబేసిటీ కౌన్సెలింగ్
Published Fri, Jul 3 2015 11:26 PM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM
Advertisement
Advertisement