bariatric surgery
-
ఆ సర్జరీ చేయించుకుంటే .. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందా?
బేరియాట్రిక్ సర్జరీ వల్ల వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందా? పిల్లల్ని కనడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తుతాయా? – జి. పూర్ణిమ, వేములవాడ బాడీమాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) అంటే మీ ఎత్తుకు ఎంత బరువు ఉండాలో కాలిక్యులేట్ చేసే పద్ధతి. ఈ బీఎమ్ఐ 40 .. అంతకన్నా ఎక్కువ ఉన్నవారిలో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ. వైవాహిక జీవితంలో సమస్యలు? అధిక బరువుతో ఉండీ.. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నవారికి.. డయాబెటిస్, హై బీపీ, స్లీప్ ఆప్నియా వంటివి తగ్గించుకోవడానికి కొన్నిసార్లు బేరియాట్రిక్ సర్జరీని సూచిస్తున్నారు. బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న తరువాత వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలూ ఉండవు. కానీ భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి కనీసం ఏడాది నుంచి రెండేళ్లు గ్యాప్ ఇవ్వాలి. ప్రత్యేకంగా టెస్టులు విటమిన్ సప్లిమెంట్స్, మైక్రోన్యూట్రైంట్స్, ఫోలిక్ యాసిడ్ వంటివి ముందుగానే ఇవ్వాలి. హైరిస్క్ ప్రెగ్నెన్సీలాగా ప్రెగ్నెన్సీ టైమ్ అంతా మల్టీడిసిప్లినరీ టీమ్‌తో చూపించుకోవాలి. బీఎమ్ఐ తగ్గటం వల్ల హై బీపీ, హై సుగర్ చాన్సెస్ తగ్గుతాయి. జెస్టేషనల్ డయాబెటిస్ ఉందా అని అందరికీ చేసే టెస్ట్స్ కాకుండా వాళ్లకు ప్రత్యేకంగా టెస్ట్స్ చేస్తారు. బేరియాట్రిక్ సర్జరీ కాంప్లికేషన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. సర్జన్, డైటీషియన్, సైకాలజిస్ట్‌ల ఫాలో అప్‌లో ఉండాలి. డెలివరీ డెసిషన్ అనేది ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్‌ని బట్టి తీసుకోవాలి. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
వయసు రెండేళ్లు, బరువు 45 కిలోలు, దీంతో...
న్యూఢిల్లీ: ఆ పాప వయసు కేవలం రెండు సంవత్సరాలు. కానీ బరువు మాత్రం ఏకంగా 45 కేజీలు. సాధారణంగా, ఆ వయస్సు పిల్లల బరువు 12-15 కిలోలు. కానీ ఖ్యాతి వర్షిణి ఊబకాయంతో తీవ్రంగా బాధపడుతూ, అడుగులు వేయలేకపోయేది. సరిగ్గా పడుకోవడమూ కష్టమైపోయింది. దీంతో ఆ పాపకి ఒంట్లోంచి కొవ్వుని బయటకు తీసే అత్యంత క్లిష్టమైన బేరియాట్రిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఢిల్లీలోని పత్పర్గంజ్లోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు ఈ శస్త్ర చికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. బేరియాట్రిక్ సర్జరీతో ఆకలి మందగించి తీసుకునే ఆహారం తగ్గిపోతుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు. ‘‘ఖ్యాతి వర్షిణి పుట్టినప్పుడు సాధారణంగానే రెండున్నర కేజీల బరువుంది.. కానీ ఆ తర్వాత చాలా త్వరగా బరువు పెరిగిపోయింది. 6 నెలలు వచ్చేసరికి 14 కేజీలు ఉన్న ఆ పాప రెండేళ్లకి 45 కేజీలకు చేరుకుంది. అధిక బరువు కారణంగా ఆరోగ్యం క్షీణిస్తుండడంతో రిస్క్ తీసుకొని సర్జరీ చేయాల్సి వచ్చింది’’అని పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ కన్సల్టెంట్ మన్ ప్రీత్ సేథి వివరించారు. దేశంలో బరువు తగ్గించే శస్త్రచికిత్స చేయించుకున్న అతి పిన్నవయస్కురాలు ఖ్యాతియేనని వైద్యులు చెప్పారు. శస్త్రచికిత్స జరిగిన ఐదు రోజుల తర్వాత, ఖ్యాతి పరిస్థితి బాగా మెరుగు పడిందని, ప్రధాన లక్షణాలలో ఒకటైన గురక పూర్తిగా ఆగిపోయిందని మత్తుమందు నిపుణుడు డాక్టర్ అరుణ్ పురి చెప్పారు. అలాగే ఊబకాయంతో బాధపడుతున్నఇతర పిల్లలకు భవిష్యత్తులో ఇలాంటి శస్త్రచికిత్సలు చేయడానికి మార్గం మరింత సుగమమైందని \చెప్పారు. -
నేను పెళ్లి చేసుకుంటే ఇబ్బంది పడతానా?!
∙నాకు 27 ఏళ్లు. రెండేళ్ల కిందట బేరియాట్రిక్ సర్జరీ అయింది. ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడం వలన వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తవచ్చా? ప్రెగ్నెన్సీ, డెలివరీలో కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? – వృంద శాఖాయ్, నాందేడ్ అత్యధిక బరువు ఉండి, అలాగే బీపీ, సుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉండి, ఆరునెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామాలు చేసినా ఫలితం లేనప్పుడు, పిల్లలు కలగడానికి కూడా పీసీఓడీ, అధిక బరువు కారణమైతే బేరియాట్రిక్ సర్జరీ ద్వారా బరువు తగ్గవచ్చు. గ్యాస్ట్రిక్ బ్యాండింగ్, గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ వంటి పద్ధతుల ద్వారా బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. వీటిలో ఆహారం కొద్దిగా తినగానే పొట్ట నిండినట్లు అనిపించడం, ఇంకా ఎక్కువ తినలేకపోవడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, ఆహారంలోని కొవ్వు, ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ వంటి పదార్థాలు ఎక్కువగా రక్తంలోకి చేరకపోవడం వంటి ప్రక్రియల వల్ల ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి 10–20 కేజీల వరకు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీ వల్ల వైవాహిక జీవితంలో ఏమీ ఇబ్బందులు ఉండవు. బేరియాట్రిక్ సర్జరీ వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు విటమిన్–బీ12, విటమిన్–డి, ఐరన్, క్యాల్షియం వంటి అనేక పోషక పదార్థాల లోపం తలెత్తుతుంది. దీనివల్ల వీరిలో బరువు తగ్గడం ఒక స్టేజికి వచ్చాక పోషకాల లోపం కోసం డాక్టర్ల పర్యవేక్షణలో విటమిన్స్, సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి. కాబట్టి సర్జరీ జరిగిన ఏడాది తర్వాత గర్భం కోసం ప్రయత్నం చేయవచ్చు. ఈ జాగ్రత్తలు సరిగా తీసుకోనప్పుడు కొందరిలో రక్తహీనత, విటమిన్స్ లోపం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటప్పుడు గర్భం దాల్చటం వల్ల గర్భంలో పిండం సరిగా ఎదగకపోవడం, అబార్షన్లు, బిడ్డలో అవయవ లోపాలు, ఎదుగుదల లోపాలు, నెలలు నిండకుండా కాన్పు జరగడం, బిడ్డ గర్భంలోనే చనిపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు కూడా ఉండవచ్చు. అందువల్ల మీరు పెళ్లి తర్వాత గర్భం కోసం ప్రయత్నం చేసే ముందే సర్జరీ చేసిన డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు సీబీపీ, విటమిన్–డి వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకోవాలి. ఏవైనా పోషక లోపాలు ఉంటే వాటిని ఆహార నియమాలు, సప్లిమెంట్ల ద్వారా సరి చేసుకున్నాకనే గర్భం కోసం ప్లాన్ చేయడం మంచిది. గర్భం రాకముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మోతాదు అదనంగా తీసుకోవాలి. అలాగే మల్టీవిటమిన్లు తీసుకుంటూ ఉండాలి. అవసరమైతే మల్టీవిటమిన్లు ఇంజెక్షన్ రూపంలో తీసుకోవలసి ఉంటుంది. గర్భం దాల్చగానే గైనకాలజిస్టును సంప్రదించి, వారి సలహా మేరకు విటమిన్స్‌తో పాటు క్యాల్షియం, ఐరన్ మాత్రలు తీసుకుంటూ ఉండాలి. బిడ్డ ఎదుగుదలకు సంబంధించి రెండో నెలలో స్కానింగ్, మూడో నెలలో ఎన్టీ స్కాన్, ఐదో నెలలో బిడ్డ అవయవాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు టిఫా స్కాన్, ఏడో నెల నుంచి బిడ్డ బరువు పెరుగుదల తెలుసుకోవడానికి గ్రోత్ స్కానింగ్ వంటివి చేయించుకోవాలి. సమస్యలను బట్టి తగిన సమయంలో కాన్పు చేయించుకోవడం వల్ల ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా తల్లీబిడ్డా క్షేమంగా ఉంటారు. బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఆహారం ఎక్కువగా తినలేరు కాబట్టి న్యూట్రీషనిస్ట్ సలహా మేరకు క్రమ పద్ధతిలో కొద్ది కొద్దిగా రోజుకు ఆరుసార్లు పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ∙నాకు 28 ఏళ్లు. రెండు రొమ్ముల్లోనూ గడ్డలున్నాయి. డాక్టరుకి చూపిస్తే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అవి సహజమే అన్నారు. నాకింకా పెళ్లి కాలేదు. వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టవు కదా? – స్వర్ణలత, కాకినాడ కొందరిలో రొమ్ములో ఉన్న ఫైబ్రస్ టిష్యూ ఎక్కువగా పెరిగి గడ్డలా తయారవుతుంది. దీనినే ఫైబ్రో ఎడినోమా అంటారు. ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల, కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల, ఇంకా తెలియని కారణాల వల్ల ఇవి రావచ్చు. ఇవి బఠాణీగింజ అంత పరిమాణం నుంచి నిమ్మకాయంత పరిమాణం వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవి చిన్న గోలీలా ఉండి, పట్టుకుంటే చిక్కకుండా రొమ్ములో కదిలిపోతుంటాయి. వీటి వల్ల ప్రమాదం ఏమీ లేదు. కాకపోతే, పరిమాణం త్వరగా పెరగడం, మరీ పెద్దగా ఉండి నొప్పి పెడుతుంటే, చిన్న ఆపరేషన్ చేసి తొలగించి, దానిని ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపడం జరుగుతుంది. ఇవి సాధారణంగా 13–35 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అల్ట్రసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం వల్ల వాటి పరిమాణం కరెక్టుగా ఎంత ఉన్నదీ, అవి ఫైబ్రోఎడినోమా గడ్డలేనా లేక ఏవైనా తేడాగా ఉన్న గడ్డలా అనే సంగతి తెలుస్తుంది. దానిబట్టి తర్వాత మమోగ్రామ్, బయాప్సీ వంటి ఇతర పరీక్షలేవైనా అవసరమా లేదా అనేది తెలుస్తుంది. వీటి వల్ల వైవాహిక జీవితానికి ఇబ్బందేమీ లేదు. ఈ లోపల మీరు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ, బరువు పెరగకుండా ఉంటే అవి సైజు పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. డా‘‘ వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
కడుపు కోత
బేరియాట్రిక్ సర్జరీ... బాగా లావుగా ఉన్న వాళ్లకు,ఆ స్థూలకాయం వల్ల ప్రాణహాని ఉన్నవాళ్లకు చేసే శస్త్రచికిత్సా విధానం. అందంగా ఉండటానికి చేయించుకునే చికిత్స కానే కాదిది. ఈ బేరియాట్రిక్ సర్జరీల్లో ప్రధానమైనవి కడుపు సైజ్‌ను కుదించే సర్జరీ, కడుపు– పేగును బైపాస్ చేసే సర్జరీ.ఆకలి తగ్గడం వల్ల, కడుపులో చోటు లేకపోవడం వల్ల, ఈ శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు చాలా మితంగానే తినగలరు. ఇక్కడివరకూ బాగానే ఉంది. లావు ఉన్న వారు ఈ పేగు, కడుపు కోతలతో జాగ్రత్త పడకపోతే, కడుపుకోత తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.ఈ కడుపుకోతల వల్ల అరుదుగానైనా కలిగే కొన్ని అనర్థాల గురించి కూడాడాక్టర్లు చెబుతున్నారు.ఈ శస్త్రచికిత్సలతో ఉన్న ప్రయోజనాలు, ప్రమాదాల గురించి అవగాహన కోసం ఈ ప్రత్యేక కథనం. మీరు లావా?... అయితే ఎంత? ఒక వ్యక్తి స్థూలకాయుడా, కాదా అని నిర్ధారణ చేయడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎమ్ఐ) అనే ప్రమాణాన్ని ఎంచుకుంటాం. దీన్ని కొలిచే పద్ధతి ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి బరువును కిలోగ్రాములలో కొలవాలి. ఆ విలువను తన ఎత్తు (మీటర్లలో) స్క్వేర్తో భాగించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 120 కిలోలు. అతడి ఎత్తు 1.7 మీటర్లు. అప్పుడు అతడి బీఎమ్ఐ విలువ... 120/1.7 ్ఠ 1.7 = 41.52 కేజీ/మీ2. విదేశీయులతో పోల్చి చూస్తే మనకు శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ, కండరాల పరిమాణం తక్కువ. అందువల్ల బీఎమ్ఐ విలువల ఆధారంగా నిర్ధారణ చేసే స్థూలకాయ వర్గీకరణ విదేశీయులకు, భారతీయులకు వేరువేరుగా ఉంటుంది. భారతీయులలో స్థూలకాయం ఎంతంటే... భారతీయుల్లో బీఎమ్ఐ విలువ 25 – ఆపైన ఉంటే స్థూలకాయం ఉన్నట్లే. ఒకవేళ ఈ విలువ 30 – ఆ పైన ఉంటే తీవ్ర స్థూలకాయం ఉన్నట్టుగా పరిగణించాలి. స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి బీఎమ్ఐతో పాటు నడుము చుట్టుకొలత, నడుమూ–హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మొదలైన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. నడుము చుట్టుకొలత మహిళల్లో 80 సెం.మీ. కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 90 సెం.మీ. కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం సమస్య ఉన్నట్లు. ఇక నడుమూ–హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మహిళల్లో 0.8 కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 0.9 కంటే ఎక్కువగానూ ఉంటే స్థూలకాయ సమస్య ఉన్నట్లుగా పరిగణించాలి. సెట్‌పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్ అంటే ఏమిటి? ఒక వ్యక్తి శరీరంలో ఎంత కొవ్వు నిలువ ఉండాలనే అంశాన్ని (సెట్ పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్‌ను) అనేక హార్మోన్లు నిర్ణయిస్తాయి. ఇందులో జీర్ణవ్యవస్థలో తయారయ్యే హార్మోన్లయిన గ్రెలిన్, జీఎల్పీ–1 అనేవి ప్రధానమైనవి. ఈ సెట్ పాయింట్ అనేది మన మనసు అధీనంలో ఉండదు. గ్రెలిన్ జీర్ణాశయం పైభాగంలో తయారవుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది. ‘జీఎల్పీ–1’ అనే హార్మోన్ చిన్న పేగు చివరిభాగంలో తయారవుతుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. కొంతమంది తక్కువగా తింటున్నప్పటికీ లావుగా ఉంటారు. ఇంకొంతమంది ఎక్కువగా తింటున్నప్పటికీ సన్నగానే ఉంటారు. దీనికి కారణం... లావుగా ఉన్నవారిలో కొవ్వు సెట్‌పాయింట్ ఎక్కువగానూ, సన్నగా ఉన్నవారిలో కొవ్వు సెట్‌పాయింట్ తక్కువగానూ ఉంటుందన్నమాట. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కొవ్వు సెట్‌పాయింట్ పెరుగుతుంది. ఇది ఒకసారి పెరిగితే మళ్లీ అంత తేలికగా తగ్గదు. బరువు తగ్గించుకోడానికి మార్గాలు... అధిక బరువు (బీఎమ్ఐ 23 – 24.99) ఉన్నవారు, స్వల్ప స్థూలకాయం (బీఎమ్ఐ 25 – 29.99) ఉన్నవారు రోజూ క్రమం తప్పకుండా కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్), ఆహారంలో కొవ్వు పాళ్లు తగ్గించుకోవడం, క్రమం తప్పకుండా వేళకు తినడం, తక్కువ మోతాదుల్లో తినడం, చిరుతిండ్లకూ, కూల్‌డ్రింక్స్‌కూ, ఆల్కహాల్‌కూ దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితో బరువు తగ్గించుకోవచ్చు. ఇది అధిక బరువు ఉన్నవారికే గాక... అందరికీ బరువును అదుపులో ఉంచుకోడానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన ప్రక్రియ. విజ్ఞతతో వ్యవహరించండి స్థూలకాయులలో నూటికి 50 మందిలో లైఫ్ రిస్క్ ఉంటుంది. వంద మందికి బేరియాట్రిక్ ఆపరేషన్స్ చేస్తే 99 మంది బతికి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు కేవలం ఒక్క శాతం మాత్రమే. దుష్ప్రభావాలను భూతద్దంలో చూస్తే ఆపరేషన్ అవసరమైన వారు కూడా భయపడి ఆపరేషన్ చేయించుకోకుండా ప్రాణం మీదికి తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. బీఎమ్ఐ 30 ఆ పైన ఉంటే... బీఎమ్ఐ 30 లేదా ఆ పైన ఉంటే (అంటే తీవ్ర స్థూలకాయానికి చేరితే) కేవలం ఆహార నియమాలు, వ్యాయామం వంటి ప్రక్రియల ద్వారా బరువు తగ్గడం సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి వారిలో నూటికి నలుగురు మాత్రమే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామాలతో బరువు తగ్గగలరు. మిగతా 96 మంది బరువు తగ్గడంలో విఫలమౌతారు. బీఎమ్ఐ 30 – ఆపైన ఉంటే డైటింగ్, వ్యాయామాలను మొదలుపెట్టిన వెంటనే కొవ్వు సెట్ పాయింట్‌ను నియంత్రించే హార్మోన్లు శరీరంలో ప్రతికూల మార్పులను తీసుకొస్తాయి. ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ పెరుగుతుంది, ఆకలిని తగ్గించే జీఎల్పీ–1 హార్మోన్ తగ్గుతుంది. కాబట్టి ఆకలి పెరుగుతుంది. మెటబాలిజం తగ్గుతుంది. చివరికి ఆకలికి తట్టుకోలేక ఎక్కువగా తినేస్తారు. అందువల్ల తిరిగి బరువు పెరుగుతారు. మరి పరిష్కారం ఏమిటి...? డైటింగ్, వ్యాయామాల ప్రభావం కొవ్వు సెట్ పాయింట్ మీద అంతంత మాత్రమే. అందువల్ల బీఎమ్ఐ 30 – ఆపైన ఉన్నవారిలో... ఈ ప్రక్రియలు శాశ్వతంగా బరువును తగ్గించలేవు. బరువును నియంత్రించడానికి మందులు ఉన్నప్పటికీ వాటి పాత్ర పరిమితం. ఒకవేళ వాటిని వాడినా... ఆపివేయగానే తిరిగి బరువు పెరుగుతారు. కాబట్టి శాశ్వతంగా బరువు తగ్గడానికీ, స్థూలకాయంతో వచ్చే అనర్థాలైన గుండెపోటు, డయాబెటిస్, అధికరక్తపోటు వంటి వాటిని తగ్గించుకుని, ఆయుఃప్రమాణాన్ని పెంచుకోడానికి అనువైన మార్గం బేరియాట్రిక్ సర్జరీ. అయితే బేరియాట్రిక్ సర్జరీలను అందరికీ చేయరు. భారతీయులలో బీఎమ్ఐ 30 – ఆ పైన ఉండి, షుగర్ లాంటి జబ్బులు ఉంటే వారికి బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. షుగర్ లాంటి ఇతర జబ్బులేమీ లేకపోయినా బీఎమ్ఐ 35 – ఆ పైన ఉంటే... బేరియాట్రిక్ సర్జరీ చేయవచ్చు. ఈ పరిమితులను ఇంటర్నేషనల్∙డయాబెటిస్ ఆర్గనైజేషన్స్... ఏషియన్స్లో 32.5, 37.5గా నిర్ణయించారు. (విదేశీయుల్లో ఈ పరిమితులు 35 మరియు 40). గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఒంటి బరువు వారి ప్రాణాలకు ముప్పు తెస్తుందనుకున్నప్పుడే బేరియాట్రిక్ సర్జరీకి అర్హులవుతారు. బేరియాట్రిక్విధానాలలో రకాలు బేరియాట్రిక్ విధానాల్లో అసలు శస్త్రచికిత్స లేకుండా చేసే ‘గ్యాస్ట్రిక్ బెలూన్’ ప్రక్రియ మొదలుకొని... చిన్న గాట్లతో, లాపరోస్కోపీ విధానంలో చేసేశస్త్రచికిత్సల వరకు అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. గ్యాస్ట్రిక్ బెలూన్ ప్రక్రియ... గ్యాస్ట్రిక్ బెలూన్... ఎండోస్కోపిక్ ప్రక్రియ. బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయడానికి వీలు లేనివారిలో ఈ విధానాన్ని అవలంబిస్తారు. ఒక మోస్తరు స్థూలకాయ సమస్య ఉన్నవారిలో, శస్త్రచికిత్సల పట్ల విముఖత ఉన్నవారిలో, టీనేజర్లలో, పెళ్లికాని యువతులలో కూడ ఈ విధానాన్ని పరిగణించవచ్చు.ఇటీవల మృతిచెందిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావుకు నిర్వహించిన చికిత్స ప్రక్రియ ఇది. ఈ పద్ధతిలో బెలూన్ను అన్నవాహిక ద్వారా జీర్ణాశయంలోకి ప్రవేశపెడతారు. ఇందులో ఆర్బెరా బెలూన్, ఓబెలాన్ బెలూన్లను జీర్ణాశయంలో ఆర్నెల్ల పాటు ఉంచుతారు. అదే స్పాట్జ్–3 అడ్జెస్టబుల్ బెలూన్ను అయితే ఏడాది కాలం పాటు ఉంచుతారు. మిథిలిన్ బ్లూ అనే నీలం రంగు మందును కలిపిన సెలైన్‌తో బెలూన్ను నింపుతారు. మామూలుగా గాలి నింపిన బెలూన్ లాగా ఇది పేలిపోయే అవకాశం ఉండదు. ఈ బెలూన్ నేరుగా బరువును తగ్గించదు. దీన్ని జీర్ణాశయంలో ఉంచటం వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. అలా ఇది భోజనం ఎక్కువ మోతాదులో తీసుకోకుండా కట్టడి చేస్తుంది. అంతేగానీ దీని వల్ల కొవ్వు సెట్ పాయింట్లో ఎలాంటి మార్పులూ రావు. ఉంచాల్సిన వ్యవధి తర్వాత ఈ బెలూన్ను తొలగిస్తారు. అయితే ఈ వ్యవధిలో ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, వ్యాయామం లాంటి ఇతర బరువు తగ్గే ప్రక్రియలను పాటించాల్సి ఉంటుంది. బెలూన్ తీసిన తర్వాత తగ్గిన బరువు తిరిగి పెరగకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం తప్పనిసరి. అయితే నూటికి 80 మంది ఇవి పాటించకపోవడం వల్ల తిరిగి బరువు పెరిగిపోతారు. ఇలా తిరిగి బరువు పెరిగిన వారికి బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు తప్పకపోవచ్చు. ఫిట్నెస్ సమస్యల వల్ల బేరియాట్రిక్ సర్జరీలకు అర్హులు కాని వారికి బెలూన్ అమర్చి, కొంత బరువును తగ్గించాక అవసరాన్ని బట్టి బేరియాట్రిక్ సర్జరీలను చేస్తారు. అంటే ఇలాంటివారిలో బెలూన్ ప్రక్రియ బేరియాట్రిక్ సర్జరీకి ముందు ఒక వారధిగా మాత్రమే ఉపయోగపడుతుంది. వ్యవధిని మించి బెలూన్ను జీర్ణాశయంలో ఉంచితే నెమ్మదిగా అది లీక్ అయి, బెలూన్ పేగుల్లోకి జారి అడ్డం పడే అవకాశం ఉంటుంది. లీక్ కావడం మొదలైన వెంటనే మూత్రం నీలం రంగులోకి మారుతుంది. ఇలా మనకు బెలూన్ లీక్ అవుతున్నట్లు తెలుస్తుంది. వెంటనే బెలూన్ తీయించేసుకుంటే ఇతర సమస్యలు రావు. బేరియాట్రిక్ శస్త్రచికిత్సల తర్వాత బరువు తగ్గడానికి అసలు కారణం... బేరియాట్రిక్ సర్జరీలలో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్, డియోడినల్ స్విచ్ వంటి అనేక ప్రక్రియలు ఉన్నాయి. వీటిని లాపరోస్కోపీ విధానంలో చేస్తారు. బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకున్న వారు ఆహారం ఎక్కువగా తినలేరు. కొన్ని బేరియాట్రిక్ సర్జరీల తర్వాత ఆహారం శరీరంలోకి ఇంకిపోయే ప్రక్రియ మందగిస్తుంది. నిజానికి ఈ రెండు కారణాల వల్లనే బరువు తగ్గుతారని అందరూ అనుకుంటారు. వాస్తవానికి బేరియాట్రిక్ ఆపరేషన్ల తర్వాత బరువు తగ్గడానికి అసలు కారణం... హార్మోన్లలో మార్పుల వల్ల (ఆకలిని పెంచే గ్రెలిన్ తగ్గడం, ఆకలిని తగ్గించే జీఎల్పీ–1 పెరగడం) ‘కొవ్వు సెట్ పాయింట్’ తగ్గడమే. ఈ సర్జరీల తర్వాత ఆకలి తగ్గుతుంది, మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. బేరియాట్రిక్ సర్జరీల వల్ల ఇతర ప్రయోజనాలు బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకున్న వారు బరువు తగ్గడమే కాకుండా డయాబెటిస్ (షుగర్), హైబీపీ వంటి సమస్యలనుంచి బయటపడే అవకాశం ఉంది. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీతో పోలిస్తే గ్రాస్ట్రిక్ బైపాస్, డియోడినల్ స్విచ్ వంటి పేగు బైపాస్ పద్ధతులలో హార్మోన్లలో మార్పులు ఎక్కువ. డయాబెటిస్‌ను నయం చేయడానికి మినీ గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ విత్ లూప్ డియోడినో–జెజునల్ బైపాస్, సింగిల్ అనాస్టమోసిస్ స్లీవ్ ఇలియల్ బైపాస్ మొదలైన ఆధునిక బేరియాట్రిక్ సర్జరీలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ నూతన శస్త్రచికిత్సలను రీసెర్చ్‌లో భాగంగా మాత్రమే చేస్తున్నారు. స్థూలకాయం లేకపోయినా డయాబెటిస్ తీవ్రంగా ఉన్నవారికి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ విత్ డియోడినో–ఇలియల్ ఇంటర్–పొజిషన్ అనే మెటబాలిక్ సర్జరీ అందుబాటులో ఉంది. బేరియాట్రిక్ సర్జరీలతో దుష్ప్రభావాలు బేరియాట్రిక్ సర్జరీతో సాధారణంగా ఎలాంటి ప్రమాదాలు ఉండవు. తమ బరువే తమకు ముప్పుగా పరిణమించేంత ఎక్కువ బరువు ఉన్నవారికి బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు చేయకపోతేనే ప్రమాదం కాబట్టి వీటిని చేస్తారు. అయితే సాధారణ శస్త్రచికిత్సల్లో ఉండే రిస్క్‌లే వీటిలోనూ ఉంటాయి. ఈ ప్రమాదాల్లో కొన్ని... కొన్ని సందర్భాల్లో రక్తస్రావం అయ్యేందుకు అవకాశం ఉంది. కత్తిరించిన జీర్ణాశయం, పేగులు సరిగ్గా అతుక్కోకుండా లీకయ్యే ప్రమాదం అరుదుగా జరగవచ్చు. కానీ హైఎండ్ సాంకేతిక పరిజ్ఞానం, హైడెఫినిషన్ కెమెరాలు, అడ్వాన్స్డ్ వెసెల్ సీలింగ్ సిస్టమ్స్, హై క్వాలిటీ స్టాప్లర్లతో నిపుణులైన సర్జన్లు ఈ శస్త్రచికిత్సలు చేయడం వల్ల ఈ సమస్యలు వచ్చే అవకాశం చాలా అరుదు. ఆపరేషన్ అయిన మొదటి కొన్ని వారాల్లో కాళ్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం కొందరిలో ఉంటుంది. దీన్ని అడ్డుకునే మందులు (యాంటీకోయాగ్యులెంట్స్), పరికరాలు (నూమాటిక్ కంప్రెషన్ స్టాకింగ్స్) ఉపయోగించి ఈ సమస్యను నివారించవచ్చు. బరువు వేగంగా తగ్గినందువల్ల జుట్టురాలడం, అప్పటివరకు సాగిన చర్మం ముడతలు పడటం వంటి చిన్నపాటి సమస్యలు రావచ్చు. బరువు తగ్గడం ఆగిన కొంతకాలానికి ఈ సమస్యలు సర్దుకుంటాయి. బేరియాట్రిక్ శస్త్రచికిత్సల తర్వాత తొలినాళ్లలో విటమిన్లు, ఖనిజలవణాల లోపాలు రావచ్చు. అయితే వీటిని విటమిన్లు, మినరల్స్ సప్లిమెంట్ల ద్వారా అధిగమించవచ్చు. డాక్టర్ వి. అమర్ చీఫ్ కన్సల్టెంట్ మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్, కాంటినెంటల్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
నాడు 215 కేజీలు.. నేడు 70 కేజీలు
బేరియాట్రిక్ సర్జరీతో వ్యక్తి బరువును రెండేళ్లలో భారీగా తగ్గించిన ఎండోకేర్ ఆస్పత్రి లబ్బీపేట (విజయవాడ తూర్పు): అధికబరువుతో బాధపడుతున్న ఓ వ్యక్తికి ఎండోకేర్ ఆస్పత్రి వైద్యులు బేరియాట్రిక్ సర్జరీతో పునర్జన్మ ప్రసాదించారు. తెలంగాణలోని నారాయణ్‌ఖేడ్‌కు చెందిన పండరీనాథ్ 215 కేజీల బరువుతో బాధపడుతుండగా.. రెండేళ్ల కిందట విజయవాడ ఎండోకేర్ ఆస్పత్రి వైద్యులు అతనికి బేరియాట్రిక్ సర్జరీ చేశారు. దీంతో అతను ఏకంగా 145 కేజీలు తగ్గాడు. ఈ వివరాలను ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రవికాంత్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఆర్టీసీలో చిరుద్యోగి అయిన పండరీ నాథ్ రెండేళ్ల క్రితం 215 కిలోల బరువుకు చేరుకోవడంతో నడవడం కష్టంగా మారింది. దీంతో విజయవాడలోని ఎండోకేర్ ఆస్పత్రిని సంప్రదించాడు. ఆస్పత్రి ఖర్చులు సైతం భరించలేని స్థితిలో ఉండటంతో మందుల కోసం దాతల నుంచి కొంత మొత్తాన్ని సేకరించి, ఫీజులేమీ తీసుకోకుండానే ఆస్పత్రి వైద్యులు చికిత్స చేశారు. నీరు తగ్గించే మందుల ద్వారా తొలుత 10 కిలోల బరువు తగ్గించిన వైద్యులు.. అనంతరం 2014 డిసెంబర్లో బేరియాట్రిక్ సర్జరీ చేశారు. దీంతో రెండేళ్లలో క్రమేపీ 120 కేజీల బరువు వరకు తగ్గి.. 95 కేజీలకు చేరుకున్నాడని డాక్టర్ రవికాంత్ చెప్పారు. అయితే అతనిలోని కొలెస్ట్రాల్ అంతా కరిగిపోయి చర్మం వేలాడుతుండటంతో 20 రోజుల క్రితం రెండోసారి శస్త్రచికిత్స నిర్వహించి, దానిని తొలగించినట్లు చెప్పారు. దీంతో పండరీనాథ్ మరో 25 కేజీల బరువు తగ్గి.. 70 కేజీలకు చేరుకున్నాడని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని వివరించారు. -
‘భారీ మహిళ’ వద్దకు బాలీవుడ్ హీరో!
ముంబై: ప్రపంచంలోనే అత్యధిక బరువుతో అరటన్ను (500 కేజీలు) మహిళగా పేరొందిన ఈజిప్ట్ కు చెందిన ఎమాన్ అహ్మద్(37) బరువు తగ్గే ఆపరేషన్ కోసం గత వారం ముంబై చేరుకున్న విషయం తెలిసిందే. అధిక బరువు కారణంగా గత 25 ఏళ్లుగా ఇంటికే పరిమితమైన ఆమెకు బాలీవుడ్ ఖాన్ త్రయం షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ ల మూవీలు చూస్తానని చెప్పింది. అరటన్ను మహిళ ఎమాన్‌కు సల్మాన్‌ను కలవాలన్న కోరిక ఎప్పటినుంచో ఉందట. కండలవీరుడు సల్మాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనకు వీరాభిమానినని జాతీయ మీడియాతో వెల్లడించింది. ప్రస్తుతం ముంబైలోనే ఉన్న ఆమె తన సర్జరీ ముగిసేలోగా సల్మాన్‌ను కలుసుకునే ఏర్పాటు చేయాలని బేరియాట్రిక్ సర్జరీ చేయనున్న డాక్టర్ ముఫజల్ లక్డావాలాను ఆమె కోరినట్లు సమాచారం. ఆస్పత్రి నుంచి అధికారికంగా హీరోకు రిక్వెస్ట్ పంపించారు. సల్మాన్ ఈ విషయంపై ఏవిధంగానూ స్పందించలేదు. ఆయన తండ్రి, సీనియర్ రైటర్ సలీంఖాన్ ఈ విషయంపై స్పందిస్తూ.. సైఫీ ఆస్పత్రి నుంచి అధికారికంగా ఆహ్వానం అందితే సల్మాన్ తప్పకుండా అక్కడికి వెళ్లి అభిమాని ఎమాన్‌ను కలుస్తారని చెప్పారు. గత శనివారం ఈజిప్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రత్యేక బెడ్‌పై ముంబై ఎయిర్ పోర్టుకు, అక్కడి నుంచి సైఫీ ఆస్పత్రికి తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. -
భారీ కాయంతో.. భారీ మూల్యం..
‘ఊబకాయం, బేరియాట్రిక్ సర్జరీ’ అనే అంశాలపై.. ‘సాక్షి’, జీఎస్ఎల్ ఆస్పత్రుల ఆధ్వర్యాన రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీ హోటల్లో ఆదివారం అవగాహన సదస్సు జరిగింది. రాజ్యసభ మాజీ సభ్యుడు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జీఎస్ఎల్, స్వతంత్ర వైద్య సంస్థల వ్యవస్థాపకుడు గన్ని భాస్కరరావు, సాక్షి ప్రకటనల విభాగం ఏజీఎం రంగనాథ్ సదస్సును ప్రారంభించారు. * ఒకే వేదికపై 12 విభాగాల వైద్య నిపుణుల సలహాలు * ‘సాక్షి’, జీఎస్ఎల్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ఊబకాయాన్ని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వైద్యనిపుణులు పేర్కొన్నారు. ‘సాక్షి’, జీఎస్ఎల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఊబకాయం, బేరియాట్రిక్ సర్జరీ అనే అంశాలపై రాజమహేంద్రవరంలోని ఆనంద్ రీజెన్సీలో ఆదివారం అవగాహన సదస్సు జరిగింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జీఎస్ఎల్, స్వతంత్ర వైద్య సంస్థల వ్యవస్థాపకుడు గన్ని భాస్కరరావు, సాక్షి అడ్వర్టైజ్మెంట్ ఏజీఎమ్ రంగనాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఊబకాయంతో అనేక సమస్యలు వచ్చాయని, తనకు బీపీ, షుగర్ మెండుగా ఉండడంతో అధికబరువు తగ్గించుకునే యోచనపై అయిష్టంగానే ఉండేవాడినన్నారు. దీనికి కారణం బేరియాట్రిక్ సర్జరీపై లేనిపోని అపోహాలు, అనుమానాలేనన్నారు. అయితే కొంతమంది వైద్యనిపుణుల సూచనలతో ఈ సర్జరీ చేయించుకున్నానని, దాని ఫలితం ఇప్పుడు తెలుస్తోందన్నారు. తిరిగి తన జీవితం నూతనత్వంలోకి వచ్చినట్టుందన్నారు. జీఎఎస్‌ఎల్ వ్యవస్థాపకులు గన్ని భాస్కరరావు మాట్లాడుతూ బేరియాట్రిక్ సర్జరీ అంటే చాలామందిలో ఎన్నో అపోహలున్నాయని, దీనిని పోగొట్టి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ఇది చాలా ఖరీదైనదని, చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయనే ధోరణిలో ప్రజలున్నారన్నారు. అవన్నీ అపోహలేనన్నారు. అమెరికా వంటి దేశాల్లో ఈ సర్జరీ రూ.10 లక్షలపైనే ఉంటుందని, తాము కేవలం రూ.2 లక్షలకు అందిస్తున్నామని అన్నారు. ఈ సర్జరీ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) 40 ఉన్నవారికి, ఎక్సర్సైజులు, ఆహారం మార్పుతో పాటు బరువు తగ్గే అన్నిరకాల వ్యాయామాలు చేసినా ఫలితం లేనివారికి మంచి ఫలితాలిస్తుందన్నారు. సదస్సుకు వచ్చిన వారికి ఉచితంగా ఆర్బీఎస్, ఎఫ్బీఎస్, బీఎంఐ పరీక్షలతో పాటు డైట్ కంట్రోల్ కౌన్సెలింగ్, వెయిట్ కంట్రోల్ కౌన్సెలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ మహీధర్, డాక్టర్ హిమబిందు, డాక్టర్ హరిబాబు, డాక్టర్ సోమనాథ్ దాస్, సాక్షి అడ్వర్టైజ్మెంట్ ఆర్ఎం కొండలరావు, యాడ్ ఆఫీసర్ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. వంశపారంపర్య వ్యాధులను తగ్గించుకోవచ్చు వంశపారంపర్యంగా క్యాన్సర్ ఉన్నపుడు తమకూ ఆ వ్యాధి సోకుతుందనే భయంతోనే ఆ కుటుంబీకులు బతుకుతారు. అయితే ఈ సర్జరీతో ఆ భయాన్ని చాలావరకూ పొగొట్టుకోవచ్చు. దాని బారినపడే అవకాశాలు బాగా తగ్గుతాయి. ఊబకాయం కేన్సర్ ఎందుకువస్తుందనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. - డాక్టర్ ఆనందరావు, కేన్సర్ వైద్యనిపుణుడు నాలో ఉన్న భయం పోయింది ఈ అవగాహన సదస్సుతో అనేక విషయాలు తెలిశాయి. నాలో ఉన్న భయం పోయింది. కేన్సర్, వంశపారంపర్యం అనే అంశంపై వైద్య నిపుణులు చక్కని సూచనలతో కూడిన సలహాలను ఇచ్చారు. ఇప్పటివరకూ ఏవేవో బ్యూటీసెంటర్లు, డైట్కంట్రోల్ ట్రీట్మెంట్లు తీసుకున్నా. ఫలితం లేదు. ఈ సర్జరీ ఫలితాలు బాగా తెలుసుకున్నాను. - యు.మంగాదేవి, తాళ్లూరు ఒకే వేదికపై ఇంతమంది డాక్టర్లు మనకున్న సమస్యలను తెలుసుకోవాలంటే అనేకమంది డాక్టర్లను కలవాలి. అయితే ‘సాక్షి, జీఎఎస్‌ఎల్ ఆసుపత్రి వారు ఒకే వేదికపై 12 విభాగాల వైద్యులను తీసుకువచ్చారు. ఇది చాలా మంచి అవకాశం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మహిళలకు ఈ చికిత్సపై రాయితీలు అందిస్తే బాగుంటుంది. - ప్రియాహాసిని, రాజమహేంద్రవరం ఊబకాయం తగ్గించుకుంటే సమస్యలు దూరం ఊబకాయం తగ్గించుకుంటే శరీరంలో ఉత్పన్నమయ్యే సమస్యలు దూరమౌతాయి. అధికబరువు వల్ల ఎముక సంబంధ సమస్యలతో పాటు కీళ్ల వ్యాధులు వస్తాయి, వీటినుంచి ఎదురయ్యే జబ్బులకు అధిక బరువు తగ్గించుకోవడంతో చెక్ పెట్టవచ్చు. వంశపారంపర్యంగా ఉన్న జబ్బుల నుంచి సైతం ఈ చికిత్సతో కాపాడుకునే అవకాశం ఉంది. - డాక్టర్ సుధీర్శాండిల్య, అధికబరువు, కీళ్ల వ్యాధులు వైద్య నిపుణులు వ్యాధుల పుట్టిల్లు ఊబకాయం శరీర బరువు పెరిగిందంటే అనేక సమస్యలకు మనమే దారిచూపించినట్టు. దీన్ని ఆదిలోనే ఆపాలి. చాలామంది ఎన్నో రకాల పద్ధతులు ఉపయోగించి దీన్ని అధిగమించేందుకు పలు ప్రయత్నాలు చేసి విఫలమైన కేసులు ఎన్నో ఉన్నాయి. వారందరికీ బేరియాట్రిక్ సర్జరీ మంచి అవకాశం. ఈ సర్జరీ తర్వాత అనేక రకాల జబ్బులు, సమస్యల నుంచి బయటపడవచ్చు. - డాక్టర్ సమీర్ రంజన్‌నాయక్ ముందు సంకల్పం ఉండాలి ఏ పనైనా ప్రారంభించాలంటే ముందు సంకల్పం ఉండాలి. ఇక్కడికి రావడం వల్ల చాలా విషయాలు తెలిశాయి. చాలా బాగుంది. దీనిపై ప్రత్యేకదృష్టి పెట్టాలి. చికిత్సవల్ల కలిగే లాభాలను తెలుసుకోగలిగాం. - ఆర్.నాగలక్ష్మి, కొవ్వూరు ఇటువంటి సదస్సులు ఇంకా జరగాలి ప్రజలకు ఉపయోగపడే ఈ సదస్సులు మరిన్ని జరగాలి. మంచి కార్యక్రమం. ఇది జనంలోకి వెళితే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అపోహలు తొలగిపోయాయి. బేరియాట్రిక్ సర్జరీ ఖరీదు కూడా చాలా తక్కువగా ఉంది. - ఎస్.రాంబాబు, రాజమహేంద్రవరం -
ప్రాణాల మీదకు తెస్తున్న బరువు
వెయిట్ తగ్గడం, కొవ్వులు కరిగించుకోవడం కోసం క్యూ ♦ బేరియాట్రిక్, ప్లాస్టిక్ సర్జన్లను ఆశ్రయిస్తున్న వారు ఎక్కువే ♦ సినిమా, రాజకీయ రంగాల వారే అధికం ♦ శస్త్రచికిత్సల ఖరీదు ఏటా వెయ్యికోట్ల పైనే! సాక్షి, హైదరాబాద్: మొన్న ఆర్టీఏ అధికారి రాజేంద్ర... నేడు నటి ఆర్తి అగర్వాల్.. ఇద్దరూ బరువు తగ్గించుకోవడానికి డాక్టర్లను ఆశ్రయించి మృతి చెందిన వారే! ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలే కావచ్చు గానీ.. నయా ఫ్యాషన్ ట్రెండ్‌లో యువతీయువకులు తమ శరీర ఆకృతిని ఆకర్షణీయంగా మార్చుకునేందుకు పడేపాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న 8 మంది హీరోలు లైపోసక్షన్ చేయించుకున్న వారే. గత నాలుగేళ్లలో రాజకీయ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సుమారు 60 మంది బరువు తగ్గడానికి లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో నెలకు 150 బేరియాట్రిక్ సర్జరీలు జరుగుతుండగా, లైపోసక్షన్ సర్జరీలు 1,500 నుంచి 2 వేల వరకూ జరగుతున్నట్టు సమాచారం. ఇలా అధిక బరువును తగ్గించుకునేందుకు జరుగుతున్న శస్త్రచికిత్సల వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లో వెయ్యి కోట్ల వరకూ ఉంటుందని అంచనా. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి పట్టణాల్లో బరువును తగ్గించుకునేందుకు బేరియాట్రిక్, లైపోసక్షన్ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. అసలు ఈ రెండిటి మధ్య తేడా కూడా తెలియకుండానే శస్త్ర చికిత్సలకు సిద్ధపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ రెండు సర్జరీల మధ్య తేడా ఓసారి చూద్దాం. లైపోసక్షన్ ఇది పూర్తిగా కాస్మొటిక్ శస్త్రచికిత్స. శరీరంలో ఉన్న కొవ్వులను కరిగించి బయటకు తీయడం. మనిషి బరువును బట్టి కనిష్టంగా 5 లీటర్ల నుంచి గరిష్టంగా 14 లీటర్ల కొవ్వును బయటకు తీస్తారు. ప్రస్తుతం బరువు తగ్గడం కోసం, శరీరాకృతి మార్చుకోవడం కోసం వైద్యులను ఆశ్రయిస్తున్న వారిలో ఎక్కువ మంది లైపోసక్షన్ కోసం వస్తున్నవారే. వీరిలో 80 శాతం మంది 35 నుంచి 45 ఏళ్ల లోపు వారే కావడం విశేషం. ఇవిగాకుండా ముక్కు(రినోప్లాస్టీ), లాసిక్(కళ్లలో చిన్న పొరలాంటి అద్దాలు తగిలించుకోవడం), బ్రెస్ట్ ఇంప్లాంటేషన్స్ (వక్షోజాలు పెంచుకోవడం) చేయించుకునే వారూ ఎక్కువే. బేరియాట్రిక్ సర్జరీ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్, డియోడినల్ స్విచ్ అనేవి వీటిలో రకాలు. ఇందులో ప్రధానంగా జీర్ణాశయాన్ని శస్త్రచికిత్స ద్వారా చిన్నదిగా చేసి, చిన్న పేగు మధ్య భాగాన్ని కత్తిరించి ఈ సంచికి కలిపేస్తారు. ఈ శస్త్రచికిత్స ద్వారా జీర్ణమయ్యే ఆహారం చిన్న పేగుల్లోని డియోడినల్లోకి కాకుండా నేరుగా పేగు మధ్యభాగంలోకి వెళుతుంది. అంటే మనం తినే ఆహారం పేగుల్లో ఇంకిపోవడం తగ్గిపోతుంది. దీనిద్వారా కొద్దిగా తినగానే కడుపు నిండుతుంది. ఇది పూర్తిగా హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపేలా చేస్తుంది. గుండె జబ్బులు, డయాబెటిక్ తదితర జబ్బులున్న వారు ఈ ప్రక్రియకు పూర్తిగా దూరంగా ఉండాలి. సర్జరీల ముందూ.. వెనుకా.. ♦ గుండె, కాలేయం, ఊపిరితిత్తులు వంటి అవయవాలతోపాటు ప్రధాన వైద్య పరీక్షలన్నీ చేసి, అంతా బాగుందన్న తర్వాతే బేరియాట్రిక్ లేదా లైపోసక్షన్ చేయాలి ♦ ఆపరేషన్ పూర్తయ్యాక 2 వారాల పాటు తరచూ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి ♦ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారు ఆకలైనప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి ♦ తినడానికి అరగంట ముందు, తిన్నాక అరగంట తర్వాత వరకూ నీళ్లు తీసుకోకూడదు ♦ బేరియాట్రిక్ చేయించుకున్న వారు పూర్తిగా ఆహారాన్ని నమిలి మింగాలి ♦ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు, గుండెజబ్బులు లేదా మధుమేహం ఉన్నవారికి బేరియాట్రిక్ లేదా లైపోసక్షన్ చెయ్యడం మంచిది కాదు ♦ లైపోసక్షన్ చేయించుకున్న వారు కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు తగ్గించాలి. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం చెయ్యాలి. వీటి ద్వారా తగ్గొచ్చు.. ఆహార నియమాలు విధిగా పాటించడం. తక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకోవడం. రోజూ కనీసం 45 నిముషాల నడక లేదా ఈత. యోగా, ఏరోబిక్స్ చేయడం. - డా.ఫణిమహేశ్వరరెడ్డి, ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల, విజయవాడ దుష్పరిణామాలు ఎన్నో... లైపోసక్షన్ ♦ లైపోసక్షన్ వల్ల చాలావరకూ తాత్కాలికంగా స్వల్ప సమస్యలు మాత్రమే తలెత్తుతాయి. ♦ అరుదుగా వివిధ కారణాల వల్ల తీవ్రమైన దుష్పరిణామాలు, చాలా అరుదుగా మరణం కలుగుతాయి. ♦ ఒకేసారి వేర్వేరు చోట్ల కొవ్వును తొలగించినా, ఎక్కువ మొత్తంలో తొలగించినా ప్రమాదం. ♦ లైపోసక్షన్‌తో పాటు ఇతర శస్త్రచికిత్సలు చేసినా ప్రమాదం ఎక్కువ. ♦ రక్తం, ద్రవాలు ఎక్కువగా తొలగిపోతే షాక్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. ♦ చర్మం కింద ద్రవాలు లేదా రక్తం లీక్ కావడంతో పాటు ఇన్ఫెక్షన్ల ముప్పు పెరగొచ్చు. ♦ పొరపాటుగా ప్లీహం, కాలేయం వంటి కీలక అవయవాలు ధ్వంసం అయ్యే ప్రమాదం ఉంటుంది. ♦ ఇంజెక్ట్ చేసిన ద్రావణం విషపూరితంగా మారి కూడా ముప్పు కలగవచ్చు. ♦ ఊపిరితిత్తుల్లో కొవ్వు లేదా రక్తం గడ్డలు ప్రాణాంతకం కావొచ్చు. బేరియాట్రిక్ ♦ ఈ శస్త్రచికిత్సలు చేసుకునే ప్రతి 20 మందిలో ఒకరు ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు. ♦ పౌష్టికాహార లోపం, పేగుల్లో అడ్డంకులు ఏర్పడవచ్చు. ♦ ప్రతి 100 మందిలో ఒకరికి కాళ్లలో లేదా ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు కట్టవచ్చు. ♦ గుండె వద్ద మంట, వాంతులు, వికారం కలుగుతాయి. ♦ శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం జరగొచ్చు. ♦ శస్త్రచికిత్స తర్వాత పది నెలలకు పిత్తాశయంలో రాళ్లు ఏర్పడవచ్చు. ♦ అరుదుగా గుండెపోటు వచ్చి మరణమూ సంభవించవచ్చు.