∙నాకు 27 ఏళ్లు. రెండేళ్ల కిందట బేరియాట్రిక్ సర్జరీ అయింది. ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడం వలన వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తవచ్చా? ప్రెగ్నెన్సీ, డెలివరీలో కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా?
– వృంద శాఖాయ్, నాందేడ్
అత్యధిక బరువు ఉండి, అలాగే బీపీ, సుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉండి, ఆరునెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామాలు చేసినా ఫలితం లేనప్పుడు, పిల్లలు కలగడానికి కూడా పీసీఓడీ, అధిక బరువు కారణమైతే బేరియాట్రిక్ సర్జరీ ద్వారా బరువు తగ్గవచ్చు. గ్యాస్ట్రిక్ బ్యాండింగ్, గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ వంటి పద్ధతుల ద్వారా బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. వీటిలో ఆహారం కొద్దిగా తినగానే పొట్ట నిండినట్లు అనిపించడం, ఇంకా ఎక్కువ తినలేకపోవడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, ఆహారంలోని కొవ్వు, ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ వంటి పదార్థాలు ఎక్కువగా రక్తంలోకి చేరకపోవడం వంటి ప్రక్రియల వల్ల ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి 10–20 కేజీల వరకు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీ వల్ల వైవాహిక జీవితంలో ఏమీ ఇబ్బందులు ఉండవు. బేరియాట్రిక్ సర్జరీ వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు విటమిన్–బీ12, విటమిన్–డి, ఐరన్, క్యాల్షియం వంటి అనేక పోషక పదార్థాల లోపం తలెత్తుతుంది. దీనివల్ల వీరిలో బరువు తగ్గడం ఒక స్టేజికి వచ్చాక పోషకాల లోపం కోసం డాక్టర్ల పర్యవేక్షణలో విటమిన్స్, సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి. కాబట్టి సర్జరీ జరిగిన ఏడాది తర్వాత గర్భం కోసం ప్రయత్నం చేయవచ్చు. ఈ జాగ్రత్తలు సరిగా తీసుకోనప్పుడు కొందరిలో రక్తహీనత, విటమిన్స్ లోపం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ఇలాంటప్పుడు గర్భం దాల్చటం వల్ల గర్భంలో పిండం సరిగా ఎదగకపోవడం, అబార్షన్లు, బిడ్డలో అవయవ లోపాలు, ఎదుగుదల లోపాలు, నెలలు నిండకుండా కాన్పు జరగడం, బిడ్డ గర్భంలోనే చనిపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు కూడా ఉండవచ్చు. అందువల్ల మీరు పెళ్లి తర్వాత గర్భం కోసం ప్రయత్నం చేసే ముందే సర్జరీ చేసిన డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు సీబీపీ, విటమిన్–డి వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకోవాలి. ఏవైనా పోషక లోపాలు ఉంటే వాటిని ఆహార నియమాలు, సప్లిమెంట్ల ద్వారా సరి చేసుకున్నాకనే గర్భం కోసం ప్లాన్ చేయడం మంచిది. గర్భం రాకముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మోతాదు అదనంగా తీసుకోవాలి. అలాగే మల్టీవిటమిన్లు తీసుకుంటూ ఉండాలి. అవసరమైతే మల్టీవిటమిన్లు ఇంజెక్షన్ రూపంలో తీసుకోవలసి ఉంటుంది. గర్భం దాల్చగానే గైనకాలజిస్టును సంప్రదించి, వారి సలహా మేరకు విటమిన్స్‌తో పాటు క్యాల్షియం, ఐరన్ మాత్రలు తీసుకుంటూ ఉండాలి. బిడ్డ ఎదుగుదలకు సంబంధించి రెండో నెలలో స్కానింగ్, మూడో నెలలో ఎన్‌టీ స్కాన్, ఐదో నెలలో బిడ్డ అవయవాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు టిఫా స్కాన్, ఏడో నెల నుంచి బిడ్డ బరువు పెరుగుదల తెలుసుకోవడానికి గ్రోత్ స్కానింగ్ వంటివి చేయించుకోవాలి. సమస్యలను బట్టి తగిన సమయంలో కాన్పు చేయించుకోవడం వల్ల ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా తల్లీబిడ్డా క్షేమంగా ఉంటారు. బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఆహారం ఎక్కువగా తినలేరు కాబట్టి న్యూట్రీషనిస్ట్ సలహా మేరకు క్రమ పద్ధతిలో కొద్ది కొద్దిగా రోజుకు ఆరుసార్లు పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది.
∙నాకు 28 ఏళ్లు. రెండు రొమ్ముల్లోనూ గడ్డలున్నాయి. డాక్టరుకి చూపిస్తే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అవి సహజమే అన్నారు. నాకింకా పెళ్లి కాలేదు. వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టవు కదా?
– స్వర్ణలత, కాకినాడ
కొందరిలో రొమ్ములో ఉన్న ఫైబ్రస్ టిష్యూ ఎక్కువగా పెరిగి గడ్డలా తయారవుతుంది. దీనినే ఫైబ్రో ఎడినోమా అంటారు. ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల, కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల, ఇంకా తెలియని కారణాల వల్ల ఇవి రావచ్చు. ఇవి బఠాణీగింజ అంత పరిమాణం నుంచి నిమ్మకాయంత పరిమాణం వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవి చిన్న గోలీలా ఉండి, పట్టుకుంటే చిక్కకుండా రొమ్ములో కదిలిపోతుంటాయి. వీటి వల్ల ప్రమాదం ఏమీ లేదు. కాకపోతే, పరిమాణం త్వరగా పెరగడం, మరీ పెద్దగా ఉండి నొప్పి పెడుతుంటే, చిన్న ఆపరేషన్ చేసి తొలగించి, దానిని ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపడం జరుగుతుంది. ఇవి సాధారణంగా 13–35 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అల్ట్రసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం వల్ల వాటి పరిమాణం కరెక్టుగా ఎంత ఉన్నదీ, అవి ఫైబ్రోఎడినోమా గడ్డలేనా లేక ఏవైనా తేడాగా ఉన్న గడ్డలా అనే సంగతి తెలుస్తుంది. దానిబట్టి తర్వాత మమోగ్రామ్, బయాప్సీ వంటి ఇతర పరీక్షలేవైనా అవసరమా లేదా అనేది తెలుస్తుంది. వీటి వల్ల వైవాహిక జీవితానికి ఇబ్బందేమీ లేదు. ఈ లోపల మీరు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ, బరువు పెరగకుండా ఉంటే అవి సైజు పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి.
డా‘‘ వేనాటి శోభ
గైనకాలజిస్ట్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment