కిలోకు ఎన్ని గ్రాములు : 1000, అరకిలోకు: 500
ఈ లెక్క కూడా తెలియదా... ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పిల్లగాడినడిగినా ఠపీమని చెబుతాడు ... ఇవేమి పిచ్చి ప్రశ్నలనుకుంటున్నారా ... చంద్రబాబు సర్కారు బడిలో చదువుకున్న పౌరసరఫరాల అధికారులు, డీలర్లు మాత్రం వేరే లెక్క చెబుతున్నారు.
కిలో అంటే 750 గ్రాములే..
అర కిలో అంటే 400
గట్టిగా మాట్లాడితే 350 గ్రాములే అంటున్నారు. ఇదేమి లెక్కని ‘చంద్రన్న సంక్రాంతి కానుక’లందుకున్న కార్డుదారులు ఎదురుతిరిగితేఅది అంతేనంటూ తెగేసి చెబుతున్నారు.
కురిచేడు : ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పేరుతో తెలుగు దేశం ప్రభుత్వం ప్రకటించిన సరుకుల్లో కూడా చేతివాటం ప్రదర్శించడంతో లబ్ధిదారులు గొల్లుమంటున్నారు. పేదలకు ఇచ్చే నిత్యావసరాల్లో కూడా ఇంత కక్కుర్తా అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఇలా ఎందుకు ఇస్తున్నారని నిలదీస్తే ‘ఊరకనే ఇచ్చేదాంట్లో ఇవేమి ప్రశ్న’లంటూ డీలర్లు ఇచ్చే సమాధానాలకు విస్తుపోవడం కార్డుదారులవంతయింది.
గోధుమపిండి, శనగలు కిలో చొప్పున, నూనె అరకిలో, నెయ్యి వంద గ్రాములు, పప్పు, బెల్లం అరకిలో చొప్పున పంపిణీ చేస్తున్నట్టు ఇన్నాళ్లూ ఆర్భాటంగా ప్రచారం చేశారు. అయితే రేషన్ షాపులకు సరఫరా చేసే గోడౌన్ల వద్దనే అవినీతి తొంగి చేసింది. కందిపప్పు, బెల్లం, శనగల గోతాలలో తూకాలు తగ్గిపోయాయి. శనగలు 50 కిలోలకు 48 కిలోలు, కందిపప్పు 50 కిలోలకు 48 కిలోలు, బెల్లం పదికిలోలకు 9 కిలోల 200 గ్రాములు మాత్రమే రేషన్ షాపులకు చేరాయి. ఇక రేషన్ షాపులకు వచ్చిన తరువాత మేము మాత్రం తక్కువ తిన్నామానంటూ రేషన్ దుకాణాలకు వచ్చిన సరుకుల్లో మరింత కోత పెట్టారు.
తక్కువతో ప్యాకింగ్‌లు...
శనగలు కిలో, కందిపప్పు అరకిలో, బెల్లం అరకిలో ప్రకారం ప్యాక్ చేయాల్సి ఉంది. కందిపప్పు 400 గ్రాములు, శనగలు 750 గ్రాములు, బెల్లం 350 గ్రాములుండేలా డీలర్లు రీ ప్యాక్ చేశారు. చేతికి అందుకోగానే ఏదో తేడా ఉందని గమనించిన కార్డుదారులు పక్క దుకాణంలో తూకం వేయించుకుని చూస్తే తక్కువుగా ఉన్నాయి. ఇదేమని డీలర్లను ప్రశ్నిస్తే ఊరకనే వచ్చాయి ... ‘తక్కువ తూకం వస్తే మీకేమి నష్టం లేద’ంటూ నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారు.
సరుకులు తక్కువగా ఇచ్చారు
-నుసుం సుబ్బారెడ్డి, కార్డుదారుడు
సరుకులు తక్కువ తూకంతో ఇస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇవ్వటంతో ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారు. ఒక్కవస్తువు కూడా సక్రమంగా కాటాకు రాలేదు. అన్ని సరుకులు తరుగుతోనే వచ్చాయి.
తూకాలలో చేతివాటం
-కోవెలకుంట్ల నారాయణ, కార్డుదారుడు
సరుకులన్నీ తిరకాసులా ఉన్నాయి. శనగలు, కందిపప్పు కూడా ఒక్కొక్కరికీ ఒక్కోరకంగా తూకం వచ్చాయి. ఇదేమని అడిగితే ఊరక ఇచ్చేవి అదే ఎక్కువ వెళ్లు ... వెళ్లండంటున్నారు.
కానుక... ఇదేమి తూనిక
Published Wed, Jan 14 2015 9:21 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM
Advertisement
Advertisement