సంఘటన జరిగిన ప్రదేశంలో విచారణ చేస్తున్న తహసీల్దారు, సీఐ
నూజివీడు : మండలంలోని సుంకొల్లు పరిధిలోని తోటలలో క్షుద్ర పూజలు నిర్వహించడంతో పాటు నరబలి ఇవ్వడానికి ప్రయత్నించారంటూ ముసునూరుకు చెందిన చిన్నం ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణల నేపథ్యంలో శనివారం పోలీసు, రెవెన్యూ అధికారులు విచారణ నిర్వహించారు. సీఐ మేదర రామ్‌కుమార్, పట్టణ, రూరల్ ఎస్‌ఐ చెదరబోయిన రంజిత్‌కుమార్, మేడిబోయిన చిరంజీవిలతో పాటు తహసీల్దారు గుడిశే విక్టర్‌బాబు ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దీనిలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జోరిగే రాంప్రసాద్‌ను అతని తోటలోకి తీసుకెళ్లి అక్కడి ప్రాంతాలను పరిశీలించడంతో పాటు తోటలో కాపలా ఉంటున్న వృద్ధ దంపతులను జరిగిన విషయమై విచారించారు.
ఆరోపణల్లో నిజం లేదు..
అనంతరం పట్టణంలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ రామ్‌కుమార్, తహసీల్దారు విక్టర్‌బాబు మాట్లాడారు. క్షుద్ర పూజలు, నరబలి ఇవ్వడానికి ప్రయత్నించారని వస్తున్న వదంతులు, ఆరోపణలు అవాస్తమన్నారు. అమ్మవారి గుడి నిర్మించడానికి గాను గురు పౌర్ణమి రోజున జొరిగే రాంప్రసాద్ ఏడుగురు వ్యక్తులను, చిన్నం ప్రవీణ్‌ను తీసుకెళ్లడం జరిగిందన్నారు. వెళ్తూ దారిలోనే ఉన్న గంగానమ్మ గుడి వద్ద పూజలు చేశారని చెప్పారు. గ్రామస్తులు ఎవరైనా పొలాల్లోకి వెళ్లేటప్పుడు అక్కడ పూజలు చేయడం, మొక్కుకోవడం, ముడుపులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. అనంతరం తోటలోకి వెళ్లిన తర్వాత ప్రవీణ్ వృద్ధుల పాక వద్దకు వెళ్లి డబ్బా తీసుకుని బహిర్భూమికని వెళ్లి తిరిగి రాలేదన్నారు.
అతను బహిర్భూమికి వెళ్లేటప్పుడు అతని వెంట ఎవరూ పడలేదని, మిగిలిన వ్యక్తుల వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవని దర్యాప్తులో తేలిందన్నారు. ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని, ఎక్కడైనా జరుగుతున్నట్లుగా చూసినట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజలెవరూ భయపడాల్సిన పనే లేదన్నారు. అయితే ప్రవీణ్‌కుమార్ నరబలి ఇవ్వడం కోసం క్షుద్ర పూజలు నిర్వహించారంటూ ఎందుకు చెప్తున్నాడో, దీని వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా తదితర విషయాలపై దర్యాప్తు నిర్వహిస్తామని చెప్పారు.
వారితో నాకు ప్రాణభయం ఉంది
క్షుద్ర పూజల ఆరోపణలతో తప్పించుకున్న యువకుడి మొర
ముసునూరు (నూజివీడు) : చంద్రగ్రహణం రోజు నరబలి ఇస్తే శుభాలు కలుగుతాయనే మూఢ నమ్మకంతో అమాయకుడైన యువకుడిని బలి చేయడానికి యత్నించారనే విషయంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నూజివీడు మండలం యనమదల పరిసర అడవుల్లోకి జొరిగే రాంప్రసాద్, పామర్తి సాయి అనేవారు శుక్రవారం తనను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని వెళ్ళి అక్కడ క్షుద్ర పూజలు చేసి, కత్తులతో తనపై దాడికి యత్నించారని ముసునూరుకు చెందిన చిన్నం ప్రవీణ్ విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు శనివారం సాయంత్రం స్థానిక దళితవాడకు చెందిన పెద్దలు, యువకులతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు.
తన యజమాని రాంప్రసాద్ పిలవడంతో వెళ్లానని, కానీ యనమదల అడవుల్లోకి వెళ్లాక అక్కడ మరికొందరు క్షుద్ర పూజారులు ఉండడంతో భయంతో వారి బారి నుంచి తప్పించుకుని నూజివీడు పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వాపోయాడు. ఈ విషయాన్ని పోలీసులు తేలికగా కొట్టిపారవేస్తూ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడంతో ఆ వ్యవస్థపై తనకు నమ్మకం పోయిందని, మీరే న్యాయం జరిగేలా చూడాలంటూ విలేకర్లను బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు. తమకు సరైన న్యాయం జరగక పోతే విషయాన్ని జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాలు, నిరాహార దీక్షలు చేపడతామని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment