అధికారం.. దుర్వినియోగం.!
► దౌర్జన్యంగా స్థలం స్వాధీనానికి యత్నం
► కోర్డు పరిధిలో ఉండగానే బరితెగింపు
► సీఎం సురేష్‌నాయుడు కుమారుడి నిర్వాకం
ప్రొద్దుటూరు(ఎర్రగుంట్ల): అధికారపార్టీ అండతో టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి సీఎం సురేష్‌నాయుడు కుమారుడు చరణ్‌తేజ్‌నాయుడు వివాదాస్పదంగా ఉన్న స్థలాన్ని కొనుగోలు చేశారు. సర్వే చేయించి స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా బాధితులు అడ్డుకున్న సంఘటన శుక్రవారం ఎర్రగుంట్లలో జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
24 సెంట్ల విలువైన స్థలంపై కన్ను..
ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలికి కూతవేటు దూరంలో సర్వే నంబరు 560లో 24 సెంట్ల విలువైన స్థలం ఉంది. పలుకూరి మిద్దెల పెద్ద ఓబుళరెడ్డికి చెందిన ఈ స్థలానికి సంబంధించి 1943లోనే చెక్‌బందీ అయినట్లు వివరాలున్నాయి. 1972లో స్థల యజమాని చనిపోగా ఇదే స్థలంలో సమాధి నిర్మించారు. తర్వాత ఆయన కుమారులిద్దరూ భాగాలు పంచుకోగా ఈ స్థలం మిద్దెల ఓబుళరెడ్డికి వచ్చింది. పూర్వం నుంచి స్థలానికి వీరే పన్ను కూడా చెల్లిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పట్టాదారు పుస్తకాలు కూడా ఉన్నాయి.
2004లో మరో పాసుపుస్తకం..
పోట్లదుర్తి నాయుళ్ల కుటుంబానికి బంధువైన వల్లపు శేషమనాయుడుకు 2004 అప్పటి తహసీల్దార్ నాగమల్లన్న ఈ స్థలానికి సంబంధించిన పాస్‌పుస్తకం మంజూరు చేశారు. ఇందులో ఆర్‌ఐ, వీఆర్వోల సంతకాలు కూడా లేవు. ముందుగా మిద్దెల ఓబుళరెడ్డితో వారి పుస్తకం తీసుకురమ్మని చెప్పి.. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత శేషమనాయుడుకు తహసీల్దార్ పాస్‌పుస్తకం మంజూరు చేశారు. దీనిపై బాధితుడు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లా కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ లోపుగానే అధికారపార్టీ నేతలు తాము అనుకున్న పనిని గప్‌చుప్‌గా పూర్తి చేశారు.
సురేష్‌నాయుడు కుమారుడు కొనుగోలు
పక్కావ్యూహం ప్రకారం స్థలాన్ని సీఎం సురేష్ నాయుడు కుమారుడు చింతకుంట చరణ్‌తేజ్‌నాయుడు పేరుతో ఈ నెల 27 రిజిస్ట్రేషన్ చేయించారు. కమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో 24 సెంట్ల స్థలాన్ని రూ.27.88 లక్షలకు కొన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 13 తేదీ అధికార పార్టీ అండతో ఈస్థలంలోని సమాధిని కూడా జేసీబీతో తొలగించారు. ఈ విషయంపై భాధితుడు జిల్లా ఎస్పీకి మొరపెట్టుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
భారీ ఎత్తున పోలీసు బందోబస్తు
ఈ స్థలాన్ని సర్వేచేయించి స్వాధీనం చేసుకునేందుకు టీడీపీ నేతలు అధికారులను పావుగా వాడుకున్నారు. తమ పలుకుబడిని ఉపయోగించి పెద్ద ఎత్తున శుక్రవారం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రగుంట్ల తహసీల్దార్, సర్వేయర్లు సర్వే చేస్తుండగా.. సమస్య పై కోర్టులో ఉండగా ఎందుకు సర్వే చేస్తున్నారని బాధితులు ప్రశ్నించారు. స్థలాన్ని కేవలం సర్వే చేస్తున్నామని కోర్టు ఎవరికి ఇస్తే వారికే స్థలం వస్తుందని అధికారులు ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం.