నర్మెట: తమ పట్టాభూమి ఆక్రమణకు గురవుతోందని మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దంపతులు పురుగు మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసు కోవడం కలకలం రేపింది. జనగామ జిల్లా నర్మెట మండలం సూర్యబండతండాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తండాలో ఇరువర్గాల మధ్య కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. 257, 258, 259, 263 సర్వే నంబర్లలో అసైన్డ్ భూమి తో పాటు పట్టాభూమి ఉంది.
ఇందులో భూక్య ఈర్యా, మేగ్యా, కిష్ట, మోహిలా సోదరులకు 258 సర్వే నంబర్‌లో 12.18 గుంటల పట్టాభూమి ఉంది. వీరికి 12 మంది వారసులు ఉన్నారు. మరోవర్గంలో భూక్యా పాపా వారసులు చంద్రు, లక్ష్మా, సకృ, రాములు, జయరాంలకు 257 సర్వేనంబర్ లో పట్టా భూమితో పాటు అసైన్డ్ భూమి ఉంది. కాగా, భూక్య జయరాం.. ఇటీవల హిటాచీతో భూమి చదును చేపట్టడంతో మరో వర్గానికి చెందిన మేగ్యా కుమారుడు భూక్య గురు, జయరాంల మధ్య తగాదా ఏర్పడింది. దీంతో వీరు పోలీసులను ఆశ్రయించగా భూమి సర్వేకు సూచించారు. ఈ నేపథ్యంలో ఈనెల 3న సర్వే నిర్వహించిన అధికారులు 257, 258 సర్వేనంబర్లకు హద్దులు గుర్తించి, 14న పత్రాలు అందిస్తామని చెప్పి వెళ్లినట్లు సమాచారం.
అనంతరం ఈ భూమిని పరిశీలించిన పోలీసులు సర్వే రిపో ర్టులు వచ్చేవరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని చెప్పినా, జయరాం 258 సర్వేనంబర్‌లో హిటాచీతో భూమి చదును చేయించాడు. దీంతో తమకు న్యాయం జరగదని ఆందోళనకు గురైన భూక్య గురు, సునీత దంపతులు పురుగు మందుతాగడంతో అది గమనించిన తండావాసులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు వీరికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న ఏసీపీ దేవేందర్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment