అమ్మేసిన భూములను ఆక్రమించుకోవడమా!?
ధ్వజమెత్తిన గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి
పారిశ్రామికాభివృద్ధి జరగాలంటూ మరోవైపు అడ్డుకుంటారా?
మీ హెరిటేజ్ కోసం కొన్న భూములూ అలాగే ఇచ్చేస్తారా?
జగన్ ఇంటి ముందు ధర్నా చేసింది రైతులు కాదు.. టీడీపీ కార్యకర్తలు
హైదరాబాద్: అమ్మేసిన భూములను ఆక్రమించుకోవాలని రైతులను ప్రోత్సహించడం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటిల నీతికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. విభజన నేపథ్యంలో పారిశ్రామికాభివృద్ధి జరగాలని ఓ వైపు ఉపన్యాసాలిస్తూ మరో వైపు ఫ్యాక్టరీలను అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శనివారం జగన్ ఇంటి వద్ద ధర్నా చేయడానికి వచ్చిన వారు రైతులు కానేకాదని, వారంతా ఒక సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలని తెలి పారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చి న హామీలను నెరవేర్చనందుకు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీస్తుంటే సహించలేక ఆయనను అప్రతిష్టపాలు చేసేందుకే సరస్వతీ పవర్ కంపెనీ పట్ల కక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇంకా ఆయనేమన్నారంటే...
►రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలతో సతమ తం అవుతున్నారు. రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదు. గద్దె నెక్కగానే చేసిన ఐదు సంతకాల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉండటంతో దీని నుంచి దృష్టి మళ్లించేందుకే సరస్వతీ పవర్ కంపెనీ వ్యవహారాన్ని రాద్ధాంతం చేస్తున్నారు.
►భారతి సిమెంట్స్‌లో లాభాలు వస్తే వాటిని రైతులకు పంపిణీ చేసిన రైతు బాంధవుడు జగన్. చంద్రబాబు గాని, రామోజీ గాని భూములను తీసుకున్న పేద రైతులకు ఏనాడైనా తమ కంపెనీల్లో వచ్చిన లాభాలను పంచి ఇచ్చారా?
►మాచవరం మండలంలో సున్నపురాయి విస్తారంగా ఉన్నందున సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టడానికి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అయితే ఒక్క సరస్వతీ పవర్ వ్యవహారంలోనే విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర మంత్రి శిద్ధా రాఘవరావు సోదరుడు కూడా మా ప్రాంతంలో ఐదారేళ్ల నుంచీ సిమెంటు ఫ్యాక్టరీ కోసం భూములు కొన్నారు. భవ్య, అంబుజ కంపెనీలు కూడా భూములు కొన్నాయి. కానీ జగన్‌ను అప్రతిష్టపాలు చేయడానికే ఒక్క సరస్వతీ విషయంలోనే రాద్ధాంతం చేస్తున్నారు.
►చంద్రబాబు హెరిటేజ్ కోసం కొనుగోలు చేసిన భూములను, టీడీపీ నేతలు విజయవాడలో రాజధాని పేరుతో తక్కువ ధరకు కొన్న భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తారా?
►సరస్వతీ పవర్ కంపెనీ వల్ల తమకు ఎలాంటి నష్టం కలుగలేదని, తాము అడిగిన దానికన్నా ఎక్కువ ధర ఇచ్చి భూములు కొన్నారని, ఫ్యాక్టరీ రావడానికి అడ్డుపడొద్దని వేడుకోవడానికి రైతులు వస్తే వారిని కనీసం కలవడానికి కూడా చంద్రబాబు ఇష్టపడక పోవడం నిజంగా శోచనీయం. అదే జగన్ ఇంటి వద్ద ఘెరావ్ చేయడానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, ఓ సామాజిక వర్గం వారిని మాత్రం పిలిచి మరీ మాట్లాడారు. రైతులు కాని వారికి ప్రాధాన్యత నిచ్చిన చంద్రబాబు నిజమైన రైతులను కలవకుండా లాఠీ చార్జి చేయించారు.