మేత భూమినీ మేసేశారు
పశువుల మేత పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. ఇది ప్రభుత్వ భూమి అంటూ హెచ్చరిక బోర్డులు పెట్టినా...గుట్టుచప్పుడు కాకుండా దున్నేసి ఏకంగా పంటలు సాగుచేస్తున్నారు. వెలిగండ్ల మండలంలోనే దాదాపు 200 ఎకరాలు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి.
- యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణ
- 200 ఎకరాలు కబ్జా
- హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా ఆగని దందా
వెలిగండ్ల : ప్రభుత్వ భూమి ఖాళీగా కనిపిస్తే చాలు.. దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రిళ్లు పొక్లెయిన్‌లు పెట్టి భూములను బాగుచేసి, ట్రాక్టర్లతో దున్నుతున్నారు. పైర్లు సాగు చేస్తున్నారు. మండలంలోని బొంతగుంట్ల, ఇమ్మడిచెరువు, పద్మాపురం, రామలింగాపురం, వెలిగండ్ల, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 200 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురయ్యాయి.
ఆక్రమణ దారులు దర్జాగా భూములు సాగు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు పశువుల మేత భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్నారు. ఒక ఊరి పొలాలను వేరొక ఊరు వాళ్లు ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని ఇరు గ్రామాలకు చెందిన ఆక్రమణదారులు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నారు.
బొంతగుంట్లపల్లిలో సర్వే నంబర్లు 65, 66,69, 77,70,59/16, 59/18, 59/2, 58, 20,19/2, 42 నంబర్లలో 704.42 ఎకరాలు రెవిన్యూ రికార్డుల ప్రకారం పశువుల మేత గ్రేజింగ్ పోరంబోకు భూమిగా ఉంది. ఆ భూముల్లో సుమారు 150 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఆక్రమించుకున్న భూముల్లోని 9 సర్వేనెంబర్లలో రెవిన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి.
ఇమ్మడిచెరువులో సర్వే నంబర్ 50లో 18 ఎకరాల పశువుల మేత పోరంబోకు భూమిని ఆ గ్రామానికి చెందిన మాజీ వీఆర్వో ఆక్రమించుకొని సాగు చేస్తున్నట్లు ఎంపీపీ ముక్కు జయరామిరెడ్డి గతంలో పనిచేసిన తహ శీల్దార్ కావేటి వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేయడంతో గ్రామంలో దండోరా వేయించి పనులు ఆపివేశారు. మళ్లీ మూడు రోజుల నుంచి పనులు చేస్తుండటంతో ఎంపీపీ తహ శీల్దార్ పుల్లారావుకు ఫిర్యాదు చేశారు. పనులు ఆపి, బోర్డులు ఏర్పాటు చేయాలని తహ శీల్దార్ వీఆర్వోను ఆదేశించారు. కానీ ఆ భూమిలో మాత్రం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు.
పద్మాపురంలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 13,14,15లో 40 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. ఇలాగే రామలింగాపురం, వెలిగండ్ల, నాగిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములు, పశువుల మేత పోరంబోకు భూములు కబ్జా అయ్యాయి. ఇకనైనా రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు స్పందించి మండలంలో ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.
హెచ్చరిక బోర్డులు పెట్టాం
బొంతగుంట్లలో ఆక్రమణలకు గురైన పశువుల మేత భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. ఇమ్మడిచెరువులో సర్వే నంబర్ 50లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని వీఆర్వోను ఆదేశించాను. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాను.
-వి.పుల్లారావు, తహశీల్దార్