Warning boards
-
వెంచర్ల వంచన
సీఆర్డీఏ పరిధిలోని గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో 2020లో 5.50 ఎకరాల్లో కొందరు లే అవుట్ వేశారు. ఈ ప్రాంతం నగర శివారులో ఉండడం, కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో సమీపంలోనే ఓ భారీ కంపెనీ వస్తున్నట్టు ప్రచారం చేసుకున్నారు. దాంతో పలువురు ప్లాట్లు కొన్నారు. వాటిల్లో నిర్మాణాలు చేపట్టాలని సీఆర్డీఏకి దరఖాస్తు చేసుకుంటే అసలు ఆ లేఅవుట్‌కు అనుమతి లేదని తేలింది. దాంతో ప్లాట్లు కొన్న వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇదే కాదు.. సీఆర్డీఏ పరిధిలోని గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఇలాంటి లేఅవుట్లు చాలా వెలిశాయి. వాటి తొలగింపునకు సీఆర్డీఏ అధికారులు చర్యలు ప్రారంభించారు. వీటిలో ఎవరూ ప్లాట్లు కొని మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని పేరు చెప్పి ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేశారు. ఇందులో అక్రమ లేఅవుట్లు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. అమరావతి రాజధాని నెపంతో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ)ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని దాదాపు మొత్తం ప్రాంతాన్ని దీని పరిధిలోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో అనేకానేక ప్రాజెక్టులు వస్తాయని ప్రచారం చేశారు. దీంతో ఈ రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇబ్బడిముబ్బడిగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడో లేఅవుట్ వేశారు. వీటిలో దాదాపు అన్నీ అక్రమంగా, అనుమతి లేకుండా వేసినవే. వీటికోసం ప్రచారం ఘనంగా చేశారు. కళ్లు చెదిరే నిర్మాణాలు, అంతర్జాతీయ పరిశ్రమలు వస్తున్నాయని ఊదరగొట్టారు. భారీగా అభివృద్ధి జరిగిపోతున్నట్లు గ్రాఫిక్స్ చూపించారు. దీంతో అనేక మంది ఇక్కడ ప్లాట్లు కొన్నారు. ధర ఎంత అన్నది చూడకుండా కొనేశారు. వీటిలో ఇళ్లు కట్టుకొనేందుకు అనుమతుల కోసం దరఖాస్తు చేయగా.. ఆ లేఅవుట్లకు అసలు అనుమతులే లేవని సీఆర్డీఏ అధికారులు వాటిని తిరస్కరించారు. దీంతో మోసం బయటపడింది. ప్లాట్లు కొనుక్కున్న వారు కన్నీటిపర్యంతమవుతున్నారు. సీఆర్డీఏ పరిధిలో భారీ ప్రాజెక్టులు వస్తున్నాయని, అద్భుత నగరం ఆవిష్కృతమవుతుందని గత ప్రభుత్వ హయాంలో ప్రచారం చేసి ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వందలాది వెంచర్లు వేశారు. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య, అమరావతి – గుంటూరు మధ్య జాతీయ రహదారికి ఇరువైపులా, విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఇబ్రహీంపట్నం, నున్న, గన్నవరం, కంకిపాడు ప్రాంతాల్లో, చిలకలూరిపేట సమీపంలో.. ఇలా సీఆర్డీఏ పరిధిలోని 19 నియోజకవర్గాల్లో లేఅవుట్లు వేశారు. వీటిలో దాదాపు అన్నీ అనుమతుల్లేకుండా అక్రమంగా వేసినవే. ఈ వెంచర్ల యజమానులు రెరా, సీఆర్డీఏ అనుమతులు తీసుకోకుండానే అవన్నీ ఉన్నట్టుగా మభ్యపెట్టారు. వేరే చోట అనుమతి ఉన్న లే అవుట్ల ఎల్పీ నంబర్లను ఇక్కడి వాటికి జోడించి కొనుగోలుదారులకు తప్పుడు సమాచారం అందించారు. ఆకట్టుకొనే డిజైన్లు, వారు చేసిన ప్రచారం, బ్రోచర్లను చూసి ముచ్చటపడిన వినియోగదారులు ఎక్కువ ధర అయినా కొనేశారు. విదేశాల్లో ఉన్న వారు కూడా చాలా మంది వీటిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత వీటి మోసం బయటపడటంతో సీఆర్డీఏకు పలు ఫిర్యాదులు అందాయి. ఇలా వచ్చిన వాటిలో 2020 వరకు 1,469 లేఅవుట్లను అక్రమమైనవిగా గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఇటీవల మరో 98 అక్రమ లేఅవుట్లను గుర్తించారు. వాటిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. సీఆర్డీఏ పరిధిలో అక్రమ లేఅవుట్లతో పాటు అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలు మరో 3,072 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిపైనా చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ లేఅవుట్లు, అక్రమ నిర్మాణాల యజమానులకు నోటీసులు కూడా జారీ చేశారు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని, అలా చేస్తే వచ్చే నష్టాలను వివరిస్తూ ఆ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి వాటిని కొనుగోలు చేస్తే భవిష్యత్‌లో ప్రభుత్వ అనుమతులు మంజూరు కావని సీఆర్డీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. గుర్తింపులేని లేఅవుట్లతో ఇబ్బందులు సీఆర్డీఏ పరిధిలో ప్రభుత్వ అనుమతి లేని లే అవుట్లు, నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి వాటిలో ప్లాట్లు కొంటే భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రావు. కొనుగోలుదారులు ప్లాటు కొనే ముందు రెరా, సీఆర్డీఏ అనుమతి, ఎల్పీ నంబర్ వంటివి సరిచూసుకోవాలి. సీఆర్డీఏ కూడా అన్ని ప్రభుత్వ అనుమతులు, సదుపాయాలతో లేఅవుట్లను నవులూరు, నూజివీడులో అభివృద్ధి చేసింది. ఏ వివరాలు కావాలన్నా వినియోగదారులు సీఆర్డీఏ వెబ్సైట్లో చూడవచ్చు. – సీఆర్డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్ సీఆర్డీఏ లేఅవుట్లు సేఫ్ కొనుగోలుదారుల అవసరం మేరకు అన్ని అనుమతులు, సౌకర్యాలను కల్పించి సీఆర్డీఏనే సొంతంగా లేఅవుట్లు వేస్తోంది. నవులూరు, నూజివీడులో ప్లాట్లను అభివృద్ధి చేసి, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీ సైతం కల్పిస్తోంది. ఇలా నవులూరులో 386 ప్లాట్లు అభివృద్ధి చేయగా ఇప్పటికే 164 అమ్ముడయ్యాయి. మిగిలిన ప్లాట్లలో 10 శాతం ప్రభుత్వ అవసరాలకు మినహాయించి 180 ప్లాట్ల వరకు ఈ–లాటరీకి ఏర్పాట్లు చేసింది. నూజివీడులోనూ సీఆర్డీఏ 40.78 ఎకరాల్లో 393 ప్లాట్లను అభివృద్ధి చేసింది. -
హెచ్చరిక బోర్డులనూ వదట్లేదు.!
ఆరిలోవ: పైనాపిల్‌కాలనీ జేఎన్ఎన్యూఆర్ఎం నివాస సముదాయంలో టీడీపీ నాయకులు.. తమ ప్రచారానికి జీవీఎంసీ హెచ్చరిక బోర్డులనూ వదట్లేదు. ప్రభుత్వ స్థలాలను కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకున్న అనంతరం ‘ఈ స్థలం జీవీఎంసీది.. దీన్ని ఎవరు ఆక్రమించినా శిక్షార్హులవుతారు’ అని రాసిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఆ బోర్డులను స్థానిక టీడీపీ నాయకులు తీసుకొచ్చి జనం నడిచిన రోడ్డు పక్కన ఏర్పాటు చేశారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఫొటోతో ఫ్లెక్సీ కట్టారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం దీన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
వెయ్యి కోట్ల ప్రభుత్వ స్థలం స్వాధీనం
రక్షణ కంచె, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు హైదరాబాద్: బంజారాహిల్స్‌లో రూ.వెయ్యి కోట్ల విలువైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసు కుంది. ఇన్నాళ్లూ వివాదంలో ఉన్న ఈ స్థలాన్ని శని వారం సికింద్రాబాద్ ఆర్డీవో చంద్రకళ నేతృత్వంలో షేక్‌పేట తహసీల్దార్ రాములు సిబ్బందితో కలసి స్వాధీనం చేసుకుని.. చుట్టూ 22 హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి, తెలంగాణ భవన్ మధ్యలో ఉన్న సర్వే నంబర్ 403, టీఎస్ నంబర్ 1, వార్డు 10, బ్లాక్ హెచ్ షేక్‌పేట్ విలేజ్, షేక్‌పేట మండల పరిధిలోని 20 ఎకరాల్లోని ఈ స్థలానికి ఫెన్సింగ్ నిర్మించారు. రాధికా కో–ఆపరే టివ్ సొసైటీ, గోదావరి కో–ఆపరేటివ్ సొసైటీ, ఫరీద్ హుస్సేన్ అధీనంలో ఉన్న ఈ స్థలం ఇన్నాళ్లూ వివాదంలో ఉంది. 1960లో తాము ఈ స్థలాన్ని అసైనీల ద్వారా కొనుగోలు చేసినట్లు సొసైటీలు చెప్పాయి. 1980లో అప్పటి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌తో ఈ స్థలాలపై విచారణ జరిపి అసైన్ మెంట్ బోగస్ అని తేల్చింది. దీనిపై 1983లో జీవో 942 విడుదల చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ సదరు సొసైటీలు 1984లో హైకోర్టును ఆశ్రయిం చాయి. హైకోర్టు సింగిల్ బెంచ్ జీవోను కొట్టివేస్తూ సొసైటీలకనుకూలంగా తీర్పిచ్చింది. ప్రభుత్వం మళ్లీ కోర్టును ఆశ్రయించగా నిబంధనలకు అను కూలంగా ఉండి.. అర్హత ఉంటే సొసైటీలకు రెగ్యు లరైజ్ చేయడానికి దరఖాస్తును పరిశీలించాల్సిం దిగా తీర్పునిచ్చింది. సొసైటీలకు రెగ్యులరైజేషన్‌కు అర్హత లేదంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర యించింది. 2002లో చంద్రబాబు ప్రభుత్వం, ఆ తర్వాత రోశయ్య ప్రభుత్వం ఈ స్థలంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినా.. సమస్య పరి ష్కారం కాలేదు. దీంతో ఈ నెల 6న రాష్ట్ర ప్రభు త్వం ఈ సొసైటీల రెగ్యులరైజేషన్ దరఖాస్తులను తిరస్కరిస్తూ ఆర్డర్ పాస్ చేసింది. -
మేత భూమినీ మేసేశారు
పశువుల మేత పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. ఇది ప్రభుత్వ భూమి అంటూ హెచ్చరిక బోర్డులు పెట్టినా...గుట్టుచప్పుడు కాకుండా దున్నేసి ఏకంగా పంటలు సాగుచేస్తున్నారు. వెలిగండ్ల మండలంలోనే దాదాపు 200 ఎకరాలు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి. - యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణ - 200 ఎకరాలు కబ్జా - హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా ఆగని దందా వెలిగండ్ల : ప్రభుత్వ భూమి ఖాళీగా కనిపిస్తే చాలు.. దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రిళ్లు పొక్లెయిన్లు పెట్టి భూములను బాగుచేసి, ట్రాక్టర్లతో దున్నుతున్నారు. పైర్లు సాగు చేస్తున్నారు. మండలంలోని బొంతగుంట్ల, ఇమ్మడిచెరువు, పద్మాపురం, రామలింగాపురం, వెలిగండ్ల, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 200 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణ దారులు దర్జాగా భూములు సాగు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు పశువుల మేత భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్నారు. ఒక ఊరి పొలాలను వేరొక ఊరు వాళ్లు ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని ఇరు గ్రామాలకు చెందిన ఆక్రమణదారులు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నారు. బొంతగుంట్లపల్లిలో సర్వే నంబర్లు 65, 66,69, 77,70,59/16, 59/18, 59/2, 58, 20,19/2, 42 నంబర్లలో 704.42 ఎకరాలు రెవిన్యూ రికార్డుల ప్రకారం పశువుల మేత గ్రేజింగ్ పోరంబోకు భూమిగా ఉంది. ఆ భూముల్లో సుమారు 150 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఆక్రమించుకున్న భూముల్లోని 9 సర్వేనెంబర్లలో రెవిన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ఇమ్మడిచెరువులో సర్వే నంబర్ 50లో 18 ఎకరాల పశువుల మేత పోరంబోకు భూమిని ఆ గ్రామానికి చెందిన మాజీ వీఆర్వో ఆక్రమించుకొని సాగు చేస్తున్నట్లు ఎంపీపీ ముక్కు జయరామిరెడ్డి గతంలో పనిచేసిన తహ శీల్దార్ కావేటి వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేయడంతో గ్రామంలో దండోరా వేయించి పనులు ఆపివేశారు. మళ్లీ మూడు రోజుల నుంచి పనులు చేస్తుండటంతో ఎంపీపీ తహ శీల్దార్ పుల్లారావుకు ఫిర్యాదు చేశారు. పనులు ఆపి, బోర్డులు ఏర్పాటు చేయాలని తహ శీల్దార్ వీఆర్వోను ఆదేశించారు. కానీ ఆ భూమిలో మాత్రం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. పద్మాపురంలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 13,14,15లో 40 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. ఇలాగే రామలింగాపురం, వెలిగండ్ల, నాగిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములు, పశువుల మేత పోరంబోకు భూములు కబ్జా అయ్యాయి. ఇకనైనా రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు స్పందించి మండలంలో ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. హెచ్చరిక బోర్డులు పెట్టాం బొంతగుంట్లలో ఆక్రమణలకు గురైన పశువుల మేత భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. ఇమ్మడిచెరువులో సర్వే నంబర్ 50లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని వీఆర్వోను ఆదేశించాను. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాను. -వి.పుల్లారావు, తహశీల్దార్