డోనా గంగూలీ ,కుమార్తె సన
విశాఖపట్నం: ‘నాట్యం పాదాలతో చేసే ప్రార్థన. ఆపాదమస్తకం లగ్నం చేసే ఒక యజ్ఞం. భారతీయ సంప్రదాయ కళలకు ఒడిస్సీ నాట్య ప్రక్రియ ద్వారా సేవలందించే అవకాశం భగవత్ సంకల్పంగా భావిస్తాను’ అన్నారు ప్రఖ్యాత ఒడిస్సీ నృత్యకారిణి డోనా (రాయ్)గంగూలీ. ‘దాదా’ అని భారతీయులంతా ముద్దుగా పిలుచుకునే క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ జీవిత భాగస్వామి అయిన ఈమె నాట్య యవనికపై ప్రత్యేక ముద్రను పదిలపరుచుకుని ప్రపంచాన్ని చుట్టి వస్తున్న కళాకారిణి. నగరంలో జరిగిన 11వ అఖిల భారత నృత్యోత్సవం ‘వైశాఖి’లో పాల్గొనేందుకు వచ్చిన డోనా సాక్షితో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
ఒడిస్సీలో గ్రేస్ నన్ను ఆకర్షించింది
నాట్యమంటే నాకు బాల్యం నుంచీ అమితమైన ఇష్టం. నా మూడో ఏటనే అందెలతో జత కట్టాను. తెలిసీ తెలియని వయసు నుంచీ నాట్యం నా జీవితంలో అంతర్వాహినిగా కొనసాగుతోంది. మొదట్లో నేను పండిట్ బిర్జూ మహరాజ్ శిష్యురాలు అమలా శంకర్ వద్ద కొన్నాళ్లు కథక్ నేర్చుకున్నాను. ఒక వర్క్‌షాప్‌నకు హాజరైనప్పుడు ఒడిస్సీ నృత్యంపై ఆరాధనా భావం ఏర్పడింది. ఒడిస్సీ నృత్యంలోని గ్రేస్ నన్ను కట్టిపడేసింది. ఆహార్యం, ప్రదర్శనా పటిమకు దాసోహమయ్యాను. అప్పుడే గిరిధారి నాయక్ వద్ద ఒడిస్సీ నృత్యంలో ఓనమాలు దిద్దాను.
మహాపాత్ర శిష్యురాలిని కావడం అదృష్టం
ఒడిస్సీ నాట్యానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన గురు కేలూ చరణ్ మహాపాత్ర వంటి కారణజన్ముని దగ్గర నేరుగా శిష్యరికం చేసి నాట్యవిద్య ఔపోశన పట్టే అవకాశం దక్కడం నా అదృష్టం. 1988 నుంచి 2004 వరకు ఆయన వద్ద నాట్యాన్ని అభ్యసిస్తూ, ఆయన నృత్య పరికల్పనలో, పర్యవేక్షణలో పలు ప్రదర్శనల్లో నేరుగా పాల్గొనే అవకాశం దక్కిన శిష్యగణంలో నేనూ ఉండటం గర్వకారణంగా భావిస్తున్నా.
‘దాదా’ ప్రోత్సాహమే కారణం
సౌరవ్ గంగూలీ నా బాల్య స్నేహితుడు. మేం ప్రేమించి పెళ్లిచేసుకున్నాం. 1997 ఫిబ్రవరిలో మా పెళ్లయింది. అప్పటికే నృత్యకారిణిగా నాకంటూ గుర్తింపు ఉంది. ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవిస్తాం. ఆయన సమక్షంలో నాట్యప్రదర్శన చేసిన సందర్భాలు అరుదు. వేళ్లపై లెక్కపెట్టవచ్చు. నాట్యంపై నా అభిరుచికి సౌరభ్ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా ఒడిస్సీ నృత్యప్రదర్శనల్లో పాల్గొనే అవకాశాలు సద్వినియోగం చేసుకోగల్గుతున్నానంటే అందుకు మీ అభిమాన క్రికెటర్ ‘దాదా’ ప్రోత్సాహమే కారణం.
‘డోనా రాయ్ డే’ : ఓ మధుర జ్ఞాపకం
1995 జూన్ 9వ తేదీన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో మా బృందం నాట్య ప్రదర్శన ఇచ్చింది. ఆ ప్రదర్శనకు ముగ్ధుడైన ఆ నగర మేయర్ ఎం. జోర్డాన్ జూన్ 9వ తేదీని ‘డోనా రాయ్ డే’గా ప్రకటించడం ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే 2016 జూన్ 12న కోల్‌కతాలోని చారిత్రక విక్టోరియా మహల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరు కావడం మరపురాని అనుభూతి.
మా శిక్షణాలయం ‘దీక్షా మంజరి’
‘దీక్షా మంజరి’ సంస్థను 2000 సంవత్సరంలో ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ చేతుల మీదుగా స్థాపించాను. అందులో నాట్య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం మా అకాడమీలో 2000 మంది అభ్యాసకులు విభిన్న అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. మా బృందంతో కలసి దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, నృత్యోత్సవాల్లో ప్రదర్శనలిచ్చాను. అమెరికా, లండన్ (ఇంగ్లండ్), చైనా, సింగపూర్, బంగ్లాదేశ్‌లకు తరచూ ప్రదర్శనల కోసం వెళ్తుంటాను.
సనకు ఫైనాన్షియల్ ఫీల్డ్ ఇష్టం
మా గారాల పట్టి ‘సనా గంగూలీ’. ఆమె క్రీడలతో పాటు ఒడిస్సీ నృత్యం నేర్చుకుంది. తను ప్రస్తుతం లెవెన్త్ క్లాస్ చదువుతోంది. తనకి కెరీర్‌పై స్పష్టమైన అవగాహన ఉంది.
వాళ్ల నాన్నలా క్రికెటర్, నాలా డ్యాన్సర్ కాకుండా ఈ రెంటికీ భిన్నంగా ఫైనాన్షియల్ రంగంలో స్థిరపడాలనుకుంటుంది. ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకర్ కావాలనుకుంటుంది.
విశాఖ బాగా నచ్చింది
‘‘విశాఖపట్నం నాకు చాలా నచ్చింది. 2013లో వైశాఖి నృత్యోత్సవంలో పాల్గొన్నాను. నటరాజ్ మ్యూజిక్ అకాడమీ ఉత్సవాలు నిర్వహించే తీరు, కళాకారులకు ఆతిథ్యమిచ్చే విధానం మాకు బాగా నచ్చాయి. అందుకే ఈ ఏడాది మళ్లీ మా ప్రదర్శనకు అవకాశం ఇచ్చి ‘వైశాఖి’ ఎక్స్‌లెన్సీ అవార్డు తీసుకునేందుకు వచ్చాను. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ స్థానికుల హృదయాలు చాలా విశాలం. కుటుంబంతో సహా రెండు మూడు రోజులు ఇక్కడ ప్రశాంతంగా గడపాలనిపిస్తోంది’
Comments
Please login to add a commentAdd a comment