
తల్లీ కూతుళ్ల హత్య నిందితుడి అరెస్టు
- తనను కాదని వేరొకరితో చనువుగా ఉండటమే కారణం
- ఆమెను ప్రోత్సహిస్తోందని తల్లిని కూడా ..
- డీఎస్పీ కే సూర్యచంద్రరావు వెల్లడి
నూజివీడు, న్యూస్‌లైన్ : బాపులపాడు మండలం మల్లవల్లిలో తల్ల్లీకూతుళ్లను అతి కిరాతకంగా నరికి తలలు వేరుచేసి హతమార్చిన పోట్రు శివనాగరాజును అరెస్టు చేసినట్లు నూజివీడు డీఎస్పీ కే సూర్యచంద్రరావు శుక్రవారం విలేకరులకు తెలిపారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్యకు దారితీసిన వివరాలను డీఎస్పీ వివరించారు.
ఆగిరిపల్లి మండలం కృష్ణవరానికి చెందిన పోట్రు శివనాగరాజు(25) చుట్టుపక్కల గ్రామాల్లో అరటిపళ్లు అమ్ముకుని జీవిస్తుంటాడు. ఈ క్రమంలో దాదాపు 9నెలల క్రితం అతనికి బాపులపాడు మండలం మల్లవల్లికి చెందిన భర్త లేకుండా ఒంటరిగా ఉంటున్న పల్లపు చిన్ని(28)తో పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది.
ఈ విషయంలో చిన్ని తల్లి చందమ్మ కూడా ప్రోత్సహించింది. అయితే ఈ విషయం నిందితుడి తండ్రి వెంకటేశ్వరరావుకు తెలియడంతో అతను నెల రోజుల క్రితం మల్లవల్లి వచ్చి చిన్నిని, ఆమె తల్లి చంద్రమ్మను ప్రవర్తన మార్చుకోవాలని మందలించి వెళ్లాడు. అప్పటి నుంచి చిన్ని శివనాగరాజుతో సరిగా ఉండటం లేదు. ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో పాటు, ఇంటికి రావద్దని చెబుతుండడం, వేరొకరితో తిరుగుతుండడం, దీనికి ఆమె తల్లి ప్రోత్సాహం ఉండటంతో వారిపై శివనాగరాజు కక్ష పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఈనెల 4వ తేదీన చిన్ని ఇంటికి వచ్చి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం మానుకోమని చిన్నిని హెచ్చరించగా, తల్లి కూతుళ్లు ఇద్దరూ అవమానకరంగా మాట్లాడి పంపారు. తనతో వివాహేతర సంబంధాన్ని మానుకోవడం, అవమానకరంగా మాట్లాడటం, మరొకరితో తిరగడంతో వారిద్దరినీ తుదముట్టించాలనే నిర్ణయానికి వచ్చి ఈనెల 5వ తేదీ తెల్లవారుజామున కృష్ణవరం నుంచి కత్తితో టీవీఎస్ మోపెడ్‌పై వచ్చి పల్లపు చిన్నిని, ఆమె తల్లి అచ్చి చందమ్మలను అతి కిరాతకంగా కత్తితో నరికి వారి పీకలను కోసి తలలను వేరుచేశాడు.
అనంతరం నిందితుడు పారిపోగా ఆగిరిపల్లి మండలం సగ్గూరు వద్ద శుక్రవారం పట్టుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అతని వద్ద నుంచి నరకడానికి ఉపయోగించిన కత్తిని, అతనివంటిపై ఉన్న రక్తపు మరకల దుస్తులను, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అచ్చి చందమ్మ చిన్న కుమార్తె చల్లా శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరవల్లి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి జంక్షన్ సీఐ వైవీ రమణ దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిన వీరవల్లి ఎస్‌ఐ పీ వాసు, ఆగిరిపల్లి ఎస్‌ఐ ఎం.వెంకటనారాయణను డీఎస్పీ అభినందించారు.