చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు
Published Sun, Sep 22 2013 2:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
సాక్షి, కాకినాడ : ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రూ. ఐదు లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కరరెడ్డి అన్నారు. డీఎస్పీ శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాకినాడ రూరల్ వాకలపూడి ఎస్సీ కాలనీకి చెందిన రాజనాల సన్యాసిరావు అలియాస్ నానాజీ పలు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డాడన్నారు. నిందితుడిపై టూటౌన్ క్రైం స్టేషన్, సర్పవరం పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు.
అతడిని శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఫ్లై ఓవర్ కింద అరెస్టు చేసి, 24.50 కాసుల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు రూ. ఐదు లక్షలు ఉంటుందన్నారు. వీటిలో నాలుగు బంగారు గాజులు, రెండు బ్రాస్ లెట్లు, ఒక నెక్లెస్, నల్ల పూసల దండ, ఒక ఉంగరం, ఐదు వెండి వస్తువులు, చెవి దుద్దులు, గొలుసు ఉన్నాయన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో సీసీఎస్ సీఐ ఆండ్ర రాంబాబు, క్రైం ఎస్సై కేవీ రామారావు, క్రైం హెడ్ కానిస్టేబుళ్లు గోవిందరావు, శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు శ్రీరామ్, వర్మలను
డీఎస్పీ అభినందించారు.
Advertisement