మద్యం మానితే వారి పిల్లలకు నజరానా
- మద్యపాన నిషేధంపై మహిళలకు అవగాహన
- డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్
మాకవరపాలెం : మద్యపాన నిషేధంపై డ్వాక్రా మహిళలతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. జిల్లాలో ఉన్న నాలుగు లక్షల కుటుంబాల్లో 65 శాతం మంది మగవారు మద్యం సేవిస్తున్నట్టు తమ సర్వేలో తేలిందని తెలిపారు. వీరిని మద్యం మాన్పించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఇప్పటి వరకు 350 మందితో మద్యం మాన్పించామని, వచ్చే మూడేళ్లలో 10 వేల మందిని మద్యానికి దూరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఒక్కో డ్వాక్రా సభ్యురాలి నుంచి ఏడాదికి రూ.10ల చొప్పున వసూలు చేసి జిల్లా సమాఖ్యలో ఉంచుతామని, ఇందులో మద్యం మానేసిన వారి పిల్లల పేరున రూ.10 వేలు జమ చేస్తామని వివరించారు.
రూ.650 కోట్ల రుణాలు: జిల్లాలో ఈ ఏడాది డ్వాక్రా మహిళలకు రూ.650 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించామని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ సత్యసాయి శ్రీనివాస్ తెలిపారు.
గతేడాది రూ.380 కోట్లు లక్ష్యం కాగా రూ.443 కోట్లు రుణాలుగా అందజేశామన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 44 వేల డ్వాక్రా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు రూ.100 కోట్లు స్త్రీ నిధి రుణాలు కూడా ఇస్తామన్నారు. డ్వాక్రా మహిళల పిల్లలు 54 వేల మంది విద్యార్థులకు ఏడాదికి ఒక్కొక్కరికి రూ.1200ల చొప్పున రూ.5.66 కోట్ల స్కాలర్‌షిప్‌లుగా అందజేస్తున్నామని తెలిపారు.