ఆక్వా చెరువుల్లో కాసుల వేట | Officials Bribery Demand From Aqua Farmers East Godavari | Sakshi
Sakshi News home page

ఆక్వా చెరువుల్లో కాసుల వేట

Published Mon, Dec 16 2019 12:27 PM | Last Updated on Mon, Dec 16 2019 12:27 PM

Officials Bribery Demand From Aqua Farmers East Godavari - Sakshi

పెదమడిలో సీఏఏ అనుమతి కోసం రైతులు దరఖాస్తు చేసుకున్న చెరువులు

వివిధ శాఖల్లో వక్రమార్గం పట్టిన కొందరు అధికారులు ఆక్వా చెరువుల్లో అక్రమాల పంటపండిస్తున్నారు. ఒక్కో స్థాయిలో ఒక్కో రేటు నిర్ణయించి కాసులు దండుకుంటున్నారు. అసలు చేయి తడపందే ఆక్వా చెరువులకు అనుమతులే ఇవ్వబోమంటున్నారు. సొమ్ములెందుకివ్వాలని ఎవరైనా ఎదురు తిరిగి అడిగితే పాత ‘నకిలీ’లను బయటపెట్టి బెదిరింపులకు దిగుతున్నారు.దీంతో ఎందుకొచ్చిన గొడవంటూ ఆ అధికారులు అడిగినంతా ఆక్వా రైతులు ముట్టజెబుతున్నారు. ఆక్వా సాగవుతున్న దాదాపు అన్ని మండలాల్లోనూ ఈ ఆమ్యామ్యాల బాగోతం యథేచ్ఛగా సాగుతోంది. ఆక్వా చెరువులకు అనుమతి ఉన్నట్టుగా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి ప్రభుత్వ విద్యుత్తు రాయితీ పొందిన రైతులే అధికంగా ఉండడంతో ఆయా అధికారులు అడిగిన మొత్తం కిమ్మనకుండా సమర్పించుకుంటున్నారు.

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: జిల్లాలో రొయ్యల చెరువులకు అనుమతి పత్రాల కోసం వివిధ శాఖల్లోని కొందరు అధికారులు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆక్వా సాగులో నాణ్యమైన ఉత్పత్తుల కోసం కేంద్ర ప్రభుత్వం రొయ్యలు, చేపల చెరువులను సాగు చేసేందుకు చెన్నై కేంద్రంగా కోస్టల్‌ ఆక్వా కల్చర్‌ అథారిటీ సర్టిఫికెట్‌ (సీసీఏ) తప్పనిసరి చేసింది. ఈ సర్టి ఫికెట్‌ లేకుండా చెరువులు తవ్వకానికి, ఆక్వా సా గు చేపట్టడానికి వీలు లేదు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆక్వా చెరువుల సా గుకు వినియోగించే విద్యుత్తుకు రాయితీని పెంచింది. గత ప్రభుత్వంలో రూ.3.60 ఉన్న యూని ట్‌ విద్యుత్‌ను ప్రస్తుతం రూ.1.50కే అందిస్తోంది. ఈ క్రమంలో విద్యుత్‌ రాయితీ కొట్టేసేందుకు కొందరు ఆక్వా రైతుల బుద్ధి వక్రమార్గం పట్టింది. ఎటువంటి అధికారిక అనుమతులూ లేకపోయినా చెరువులు తవ్వేసి రాయితీ మొత్తం కాజేస్తున్నారు. ఈ విషయాన్ని రెండు నెలల కిందట ‘సాక్షి’ వెలుగులోకితెచ్చింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి నకిలీ సర్టిఫికెట్లతో విద్యుత్తు కనెక్షన్లు పొందిన చెరువుల వివరాలను మత్స్యశాఖ ద్వారా సేకరించారు. వాటి కనెక్షన్లను రద్దు చేయించారు. అలా రద్దు చేసిన సర్టిఫికెట్లను పునరుద్ధరించుకునేందుకు రైతులకు 2020 జనవరి 4వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. ఆ గడువు దగ్గర పడుతున్న క్రమంలో రైతులు అనుమతుల కోసం తొందరపడుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని క్షేత్ర స్థాయిలో పలు శాఖల అధికారులు లంచాలు డిమాండ్‌ చేస్తూ రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. విద్యుత్‌ కనెక్షన్‌ లేకుండా ఆక్వా సాగు అసాధ్యం. దీంతో చెరువుల సాగుకు అనుమతి పత్రాల కోసం అధికారుల చుట్టూ యజమానులు తిరుగుతున్నారు. కోస్టల్‌ ఆక్వా కల్చర్‌ అథారిటీ çసర్టిఫికెట్‌ పొందాలంటే తొలుత మండల స్థాయి, ఆ తరువాత జిల్లా స్థాయి కమిటీల్లో అనుమతి తప్పనిసరి.

‘స్పందన’ ఫిర్యాదుతో కలెక్టర్‌ అప్రమత్తం
కాకినాడ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే ‘స్పందన’కు ఆక్వా సాగుపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. వ్యవసాయం, నివాస ప్రాంతాలు, మంచినీటి వనరులు కలుషితం కాకూడదనే ఉద్దేశంతో మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను మరింత పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌ చైర్మన్‌గా మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కన్వీనర్‌గా, వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్, నీటిపారుదల, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సభ్యులుగా జిల్లా స్థాయి కమిటీ ఉంది. మండల స్థాయి కమిటీలో తహసీల్దార్, మత్స్య, ఇరిగేషన్, వ్యవసాయ, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఆక్వా సాగు కోసం రైతుల దరఖాస్తులపై మండల కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా కమిటీకి సిఫారసు చేయాలి. ఆ కమిటీ అనుమతించిన తరువాతే చెన్నైలోని ఆక్వా కల్చర్‌ అథారిటీకి పంపిస్తారు.

ఈ ప్రక్రియ క్షేత్రస్థాయిలో పక్కతోవ పట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముడుపులు ముట్టకుంటే కింది స్థాయి అధికారులు ఫైళ్లను ముందుకు కదపడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. ఈ ముడుపుల వ్యవహారంపై కోనసీమలోని పలు మండలాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. నాడు విద్యుత్తు రాయితీల కోసం కక్కుర్తిపడి, నకిలీ సర్టిఫికెట్లతో సాగు చేయడాన్ని బూచిగా చూపించి, ముడుపులు డిమాండ్‌ చేస్తున్నారని, అడిగినంతా ముట్టజెప్పందే తమ అర్జీలను జిల్లాస్థాయికి పంపడం లేదని అంటున్నారు. కోనసీమలోని ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి, పెదమడి, బాణాపురం, కేశనకుర్రుపాలెం, మురమళ్ల; కాట్రేనికోన మండలం చెయ్యేరు, చెయ్యేరు అగ్రహారం, కాట్రేనికోన, కందికుప్ప; అల్లవరం మండలం కొమరగిరిపట్నం, గోడి, గోడిలంక; ఇంకా ఉప్పలగుప్తం, అయినవిల్లి తదితర మండలాల్లో కూడా ఈ ముడుపుల దందా నడుస్తోందంటున్నారు.

ఇందుకు మరో కారణం కూడా లేకపోలేదు. కోస్టల్‌ ఆక్వా అథారిటీ సర్టిఫికెట్‌ లేని చెరువుల విద్యుత్తు కనెక్షన్‌ తొలగించేందుకు ఏపీఈపీడీసీఎల్‌ సమాయత్తమవుతోంది. దీంతో హడావిడి పడుతున్న రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మండల స్థాయిలో మత్స్య, వ్యవసాయ శాఖ అధికారులు వసూళ్లకు తెగబడతున్నారు. ఈ మండలాల్లో ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల చొప్పున గుంజుతున్నారు. ఈ ముడుపులను మండల స్థాయిలో శాఖల వారీగా తలా రూ.3 వేల చొప్పున పంపకాలు చేసుకుంటున్నారు. చేయి తడపనిదే జిల్లాస్థాయి కమిటీకి సిఫారసు చేయడం లేదని కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాలకు చెందిన పలువురు రైతులు, ఒక మండల స్థాయి అధికారి చెప్పారు. సీఏఏ సర్టిఫికెట్‌ విద్యుత్తు శాఖకు అందజేస్తే రాయితీ వస్తుందనే ఆశతో వారు డిమాండ్‌ చేసినంతా ఆక్వా రైతులు ఇచ్చుకుంటున్నారు.

రాయితీ ఇలా..
జిల్లాలో చెరువులకు ఉన్న 7,111 విద్యుత్తు కనెక్షన్లకు ప్రభుత్వం రాయితీపై విద్యుత్‌ సరఫరా చేస్తూ వస్తోంది. వీటిలో 3,583 చెరువులకు మాత్రమే సీఏఏ సర్టిఫికెట్లున్నాయి. మిగిలిన 3,528 విద్యుత్తు కనెక్షన్లున్న చెరువులకు పొందిన సర్టిఫికెట్లు నకిలీవేనని తేల్చి, వాటిని రెండు నెలల కిందట కలెక్టర్‌ రద్దు చేశారు. వీటితోపాటు రద్దు చేస్తారనే భయంతో కొందరు రైతులు ముందస్తుగా సీఏఏ సర్టిఫికెట్లు పునరుద్ధరించుకునేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇదే అదునుగా వారి నుంచి అధికారులు ముడుపులు గుంజేస్తున్నారు.

మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు
సర్టిఫికెట్ల కోసం మండలాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి. అత్యధికంగా అల్లవరం మండలంలో 603, కాజులూరులో 533, ఐ.పోలవరంలో 447, ఉప్పలగుప్తంలో 316, సఖినేటిపల్లి మండలంలో 265, కాట్రేనికోనలో 256, తాళ్లరేవులో 200 దరఖాస్తులు వచ్చాయి. అమలాపురంలో 98, అయినవిల్లిలో 82, ముమ్మిడివరంలో 167, మలికిపురంలో 56, రాజోలు 47, మామిడికుదురులో 46, కొత్తపల్లిలో 95, కరపలో 104, పెదపూడిలో 45, కె.గంగవరంలో 49, రామచంద్రపురంలో 44 దరఖాస్తులు వచ్చాయి. ఇవి కాకుండా రెండు నుంచి 20 వరకూ దరఖాస్తులు వచ్చిన మండలాలు మరో 10 వరకూ ఉన్నాయి.

విచారణ జరిపించిచర్యలు తీసుకుంటాం
ముడుపుల విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటాం. రైతుల నుంచి నిర్దిష్టంగా ఫిర్యాదులు వస్తే కచ్చితంగా విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటాం. ఇంతవరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. నకిలీ సర్టిఫికెట్లతో కనెక్షన్లు పొందిన రైతులు ఇటీవల మంత్రులను కలిసి పునరుద్ధరించాల్సిందిగా అభ్యర్థించారు. కానీ, అన్ని అనుమతులూ తీసుకున్న వాటిని మాత్రమే గుర్తించి, పునరుద్ధరిస్తామని వారు రైతులకు చెప్పారు. లంచాల విషయం మా దృష్టికి రాలేదు. ఏయే మండలాల్లో ఇలాంటి పరిస్థితి ఉందో స్వయంగా తెలుసుకుంటాం. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అటువంటి వాటిని కట్టడి చేస్తాం.– పి.కోటేశ్వరరావు, జేడీ ఇన్‌చార్జి, అదనపు డైరెక్టర్, ప్రిన్సిపాల్, రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ కార్యాలయం (ఎస్‌ఐఎఫ్‌టీ), కాకినాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement