కర్ణాటక నుంచి నడిచివస్తున్న మహిళకు సాయం  | Officials Help To Migrant Women In Prakasam District | Sakshi
Sakshi News home page

కర్ణాటక నుంచి నడిచివస్తున్న మహిళకు సాయం 

Published Tue, May 5 2020 8:49 AM | Last Updated on Tue, May 5 2020 12:37 PM

Officials Help To Migrant Women In Prakasam District - Sakshi

గర్భిణి మహిళ సలోమి, భర్త, పిల్లలతో స్వగ్రామం చిమటకు చేరిన సలోమి

చంకన బిడ్డ.. కడుపున నలుసు.. పొట్టకూటి కోసం పొరుగు ప్రాంతం  వెళ్లిందా మహిళ..  అంతలోనే కరోనా మహమ్మారి కసిరింది ఉన్న ప్రాంతం వదిలి సొంతూరికి  బయల్దేరింది.. బండ్లు తిరగలేదు.. బస్సులు కదలలేదు నెత్తిన భగభగ మండే ఎండ నిప్పుల కొలిమిలా కాలుతున్న నేల భుజాన బిడ్డను ఎత్తుకొని  ఆకలి ఎరుగక.. కాలినడకన వడివడిగా అడుగులు వేస్తూ..  స్వగ్రామానికి పయనమైంది  దారిపొడవునా కష్టాలే..  ఆ అమ్మను చూసి ‘అయ్యో..’ అనడమే అందరి వంతైది.. అష్టకష్టాలతో అనంత చేరుకోగా.. అధికారి పద్మావతమ్మ సాయంగా నిలిచారుపోలీసుల సాయంతో సొంతూరికి సాగనంపేందుకు ఏర్పాట్లు చేసింది.

సాక్షి, మర్రిపూడి: ఉపాధి కోసం పొరుగు రాష్ట్రం కర్ణాటకకు వలస వెళ్లిన ఓ కుటుంబం లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనుల్లేక స్వగ్రామానికి కాలినడకన బయలుదేరింది. ఆ కుటుంబంలోని మహిళ నిండు గర్భిణి కావడంతో ఆపసోపాలు పడుతూ సుమారు 150 కిలోమీటర్లు నడిచి ఆంధ్రాలో ప్రవేశించిన తర్వాత.. అనంతపురం జిల్లా అధికారులు ఆ కుటుంబానికి అండగా నిలిచి.. స్వగ్రామానికి తరలించారు. రాష్ట్ర అధికారుల ఔదార్యానికి ఆ కుటుంబం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని చిమట దళితవాడకు చెందిన కొమ్ము కృపానందం, సలోమి దంపతులకు ముగ్గురు సంతానం. ప్రస్తుతం సలోమి 8 నెలల గర్భిణి. చిమట గ్రామంలో కూలీ పనులు దొరక్క.. బేల్దారీ మేస్త్రీ వద్ద పనులు చేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటకలోని బళ్లారి వద్ద గల చెలికేరికి వెళ్లారు.

తమతో పాటు మూడేళ్ల చిన్న కుమారుడిని తీసుకెళ్లారు. లాక్‌డౌన్‌ విధించాక బేల్దారీ మేస్త్రీ డబ్బులు ఇవ్వలేదు. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. మరో ముగ్గురుతో కలసి కృపానందం దంపతులు ఈ నెల ఒకటిన కాలినడకన స్వగ్రామానికి బయలుదేరారు. రెండ్రోజుల అనంతరం వారు అనంతపురం జిల్లాలో ప్రవేశించారు. చేతిలో చిల్లిగవ్వలేదు. తెచ్చుకున్న తిండి అయిపోయిన తరుణంలో అనంతపురం జిల్లా సీటీవో కార్యాలయంలో అధికారి పద్మావతమ్మ ఆ కుటుంబ పడుతున్న అవస్థలను గుర్తించి ఆదుకున్నారు. వారికి భోజనం పెట్టించారు. వైద్య పరీక్షలు చేయించి, కలెక్టర్, ఎస్పీల వద్ద నుంచి తరలింపునకు అనుమతి పత్రాలు తీసుకున్నారు. ఆ కుటుంబాన్ని ఆదివారం కారులో స్వగ్రామం చిమటకు తరలించారు. 

బతిమాలినా బండ్లు ఆపలేదు: సలోమి 
నడిచి వచ్చేటప్పుడు ఎంతో మందిని బతిమలాడాను. అయినా ఎవరూ వాహనాలు ఆపలేదు. నడిచి వచ్చేటప్పుడు నా బిడ్డను చూసి కనికరించి కొందరు పండ్లు, తినుబండారాలు ఇచ్చారు. చెప్పులు సైతం తెగిపోయాయి. అనంతపురంలో ప్రభుత్వ అధికారి పద్మావతమ్మ భోజనం పెట్టించి వైద్యపరీక్షలు చేయించి కారు మాట్లాడి మా ఇంటికి పంపించారు. ఆవిడకు ప్రత్యేక ధన్యవాదాలు. 

కంట తడిపెట్టించింది.. కృపానందం 
కరోనా నేపథ్యంలో మమ్మల్ని కర్ణాటక రాష్ట్రం తీసుకెళ్లిన మేస్త్రీ మాకు కూలి డబ్బులు ఇవ్వలేదు. చేతిలో చిల్లి గవ్వలేక జీవనం కష్టంగా మారింది.  నడిచి ఇంటికి వెళ్లాలనుకుని ఈ నెల ఒకటో తేదీన బయలు దేరాం.  8 నెలల నిండు గర్భిణి అయిన నా భార్య సలోమి మాతో నడవడం నాకు బాధేసింది. పైగా మూడు ఏళ్ల వయసున్న నా మూడో కుమారుడు జైపాల్‌ను ఎత్తుకుని నడవడం మరీ కష్టం అయిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement